Monday, January 20, 2025

గిరిజనులకు సినిమా థియేటర్‌లో నో ఎంట్రీ…. ఇక్కడా కులవివక్షేనా?(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

 

న్యూస్ డెస్క్: సినిమా థియేటర్‌లో ప్రవేశిండానికి టిక్కెట్ ఉంటే చాలు. టిక్కెట్ ఉన్నా అనుమతించకపోతే..చెన్నైలోని రోహిణి థియేటర్‌లో గురువారం అదే జరిగింది. ఎస్‌టిఆర్(శింబూ) నటించిన పత్తు తల చిత్రాన్ని చూసేందుకు ఒక గిరిజన కుటుంబం థియేటర్‌కు వచ్చింది. పిల్లాపాపలతో వచ్చిన నరికురవ దంపతులను థియేటర్‌లో ప్రవేశించకుండా థియేటర్ సిబ్బంది అడ్డుకున్నారు. తమ దగ్గర ఉన్న టిక్కెట్‌ను చూపించినప్పటికీ వారిని లోపలకు పంపడానికి అక్కడున్న గేట్‌కీపర్ నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిక్కెట్లు ఉన్నప్పటికీ వీళ్లను ఎందుకు అనుమతించడం లేదు అని పురుష గొంతు గేట్‌కీపర్‌ను ప్రశ్నించడం ఆ వీడియోలో వినిపించింది. అయితే గేట్‌కీపర్ నుంచి ఎటువంటి సమాధానం లేదు. దీంతో అదే వ్యక్తి మళ్లీ..వాళ్ల దగ్గర టిక్కెట్లు ఉన్నాయి. టిక్కెట్లు కాకుండా ఇంకేం కావాలి నీకు. వాళ్లను లోపలకు పంపించకుండా ఎందుకు అడ్డుకుంటున్నావు అని ప్రశ్నించడం వీడియోలో వినిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపింది. థియేటర్ సిబ్బంది వైఖరిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా థియేటర్‌లో కూడా కులవివక్ష ఏమిటంటూ వారు నిలదీశారు.

 

వీడియో సృష్టించిన సంచలనంతో దిగివచ్చినరోహిణీ థియేటర్ యాజమాన్యం ఒక సంజాయిషీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పత్తు తల చిత్రం యు/ఎ సర్టిఫికేషన్ ఉన్న చిత్రమని, దీనికి 12 సంవత్సరాల లోపు పిల్లలకు అనుమతి లేదని థియేటర్ యాజమాన్యం తెలిపింది. పత్తు తల చిత్రాన్ని చూసేందుకు ఒక కుటుంబం పిల్లలతో కలసి వచ్చిందని, వారి వద్ద టిక్కెట్లు ఉన్నప్పటికీ వారిని థియేటర్‌లోకి తమ సిబ్బంది అనుమతించలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని యాజమాన్యం వివరించింది. అయితే యు/ఎ సర్టిఫికేషన్ ఉన్న సినిమాలకు 12 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి లేదని, ఈ కారణంతోనే తమ సిబ్బంది వారిని అనుమతించలేదని తెలిపింది. అయితే ఇవేవీ అర్థం చేసుకోకుండా అక్కడ ఉన్న కొందరు ప్రేక్షకులు దీనికి వేరే అర్థం తీసుకున్నారని యాజమాన్యం తెలిపింది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా నివారించడానికి అదే కుటుంబాన్ని థియేటర్‌లోకి అనుమతించడం జరిగిందని, ఆ కుటుంబం సినిమా చూస్తున్నప్పటి వీడియోను కూడా దీంతో జత చేస్తున్నామని థియేటర్ యాజమాన్యం పేర్కొంది.

అయితే..1983 నాటి సిర్టిఫికేషన్ నిబంధనల ప్రకారం..యు/ఎ సర్టిఫికేషన్ ఇచ్చిన సినిమాను తల్లితండ్రులు, గార్డియన్ అనుమతితో 12 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్‌లోకి అనుమతించవచ్చు. కాగా..ఈ వివాదం ఇంతటితో సద్దుమణగలేదు. రోహిణి థియేటర్ సంఘటనపై ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి శ్రీపాద స్పందించారు. సినిమా చూసేందకు వచ్చిన ఒక కుటుంబాన్ని థియేటర్‌లో అనుమతించకపోవడం దారుణమని ఆమె పేర్కొన్నారు. చంటి బిడ్డలను, పిల్లలతో తల్లిదండ్రులు సినిమా థియేటర్‌లో సినిమా చూడడం తాను అనేక సార్లు చూశానని ఆమె చెప్పారు. ఇది దారుణమని, అగౌరవపరచడమేనని ఆమె ట్వీట్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాశ్ కుమార్ కూడా ఈ సంఘటనపై స్పందించారు. థియేటర్‌లోకి ఆ కుటుంబాన్ని తరువాత అనుమతించిన విషయం గమనించానని, అయితే తొలుత వారిని థియేటర్‌లోకి అనుమతించకపోవడం సబబు కాదని ఆయన అన్నారు. కళ అందరి సొత్తు అంటూ ఆయన ట్వీట్ చేశారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News