Friday, November 22, 2024

ఆదివాసి గిరిజనులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

మన్ననూర్: ఆదివాసి గిరిజనులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, గిరిజనుల ఆర్థిక స్వావలంబన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్‌కుమార్ తెలిపారు. ఆగష్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ ఐటిడిఏ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. గిరిజన ఆదివాసీల పతాకం అవిష్కరించి ఆదివాసీల నాయకులు కొమురం భీం, చెంచు లక్ష్మి చిత్రపటాలను పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆనాడు జల్ జంగల్ జమీన్ అని కొమురం భీం ఆదివాసీల కోసం పోరాడారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధి కోసం కృతనిశ్చయంతో ఉన్నాయని మీ హక్కులను సమర్థవంతంగా సాధించుకునే క్రమంలో ఆదివాసీలు కలిసి ముందుకు రావాలని సూచించారు. ఆదివాసి చెంచులు, గిరిజనులకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. చెంచు విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని అందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అనువైన ఉచిత శిక్షణ ఏర్పాటు చేస్తామని, అలాంటి వారు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఎంబిబిఎస్ లాంటి ఉన్న చదువులు చదవాలనుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 50 లక్షల వరకు సహకారం అందిస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా మెరుగైన ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు జిల్లాలో ఇప్పటికే 250 మంది కుటుంబాలకు ఒక్కో యూనిట్ లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందచేసి వివిధ రకాల యూనిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మన్ననూర్, కొల్లాపూర్ ప్రాంతాలు టూరిజంలో అభివృద్ధి చెందుతున్నాయని, చెంచు యువత సైతం గ్రూపులుగా ఏర్పడితే స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.

కుటుంబంలో మహిళల ద్వారానే ఆర్థిక పరిపుష్టి పెరుగుతుందని, మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏది లేదని ఆ దిశగా మహిళలు అంకురార్పణకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. వైద్యంపై మాట్లాడుతూ వైద్యం కోసం సిబ్బందిని నియమించామని రూ. 45 లక్షలతో మొబైల్ యూనిట్ వాహనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. గత ఏడాది జిల్లా మెడికల్ కాలేజీ వైద్యుల చేత 750 చెంచు కుటుంబాలకు ప్రత్యేకంగా దత్తత తీసుకుని ఆరోగ్య సమస్యలపై ప్రొఫైల్ నిర్వహించామని, ఇదే తరహాలో మరో 750 కుటుంబాలను త్వరలోనే జిల్లా మెడికల్ కళాశాల వైద్యులు అడాప్ట్ చేసుకుంటారన్నారు.

నేడు నల్లమల అడవి సురక్షితంగా ఉందంటే అది ఆదివాసీ చెంచులు ఉన్నందుకేనని అన్నారు. ఆవాస రక్షణ విషయంలో ఇప్పటికే 102 పక్కా గృహాలు పూర్తి చేశామని, మరో 200 గృహాలు మంజూరు చేశామన్నారు. మరో 600 పక్కా గృహాల మంజూరుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. చెంచులకు ఆదివాసీ భూమి హక్కు పత్రాలు మరికొందరికి అందాల్సి ఉందని, ఆ దిశగా కృషి జరుగుతుందని, ఇంకా అర్హులకు ఎవరికైనా రాకపోతే వారి వివరాలు ఇవ్వాలని తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిజిడిఓ కమలాకర్ రెడ్డి, ఐటిడిఏ సీనియర్ అసిస్టెంట్ జాఫర్, లక్ష్మయ్య, ఎంపిటిసి దాసరి శ్రీనివాసులు, ఆదివాసిల నాయకుడు నిమ్మల శ్రీనివాసులు, ఆదివాసి ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News