Wednesday, January 22, 2025

గుజరాత్ ‘ప్రగతి’లో ఆదివాసీల దుస్థితి

- Advertisement -
- Advertisement -

గుజరాత్ గిరిజనులు పేదరికం, నిరుపాధి, నిరక్షరాస్యత సమస్యలతో నల్లరంగు ఆఫ్రికన్ల నిందతో వివక్షకు గురవుతున్నారు. దక్షిణ గుజరాత్ డాంగ్ జిల్లాలో సహ్యాద్రి అడవులు, కొండలు, నదులు వున్నాయి. ఆ జిల్లాకు సాపుతారా పర్వత కేంద్రమని పేరు. గుజరాతీలో సాపుతారా అంటే పాముల ఇల్లు. వంకర టింకర సర్పగంగ నదితో ఈ పేరొచ్చింది. ఇక్కడి భిల్లు, కున్బీ, వర్లి కులాల డాంగి గిరిజనులు వ్యవసాయం చేస్తూ కొయ్య, వెదురు ఇళ్ళలో వుంటారు. సంపన్న నగరాల ప్రజలు ఇక్కడికి వినోద యాత్రలకు వస్తారు. గుజరాత్ నక్షత్రం సాపుతారా పర్వత కేంద్రంలో మేఘాలు తప్ప మాట్లాడే వాడుండడని గుజరాత్ టూరిజం ప్రకటనలో అమితాబ్ బచ్చన్ ఆహ్లాదంగా వ్యాఖ్యానిస్తారు. 2017 సెప్టెంబర్‌లో గుజరాత్ పర్యాటక శాఖ పాత్రికేయులకు సాపుతారా యాత్ర ఏర్పాటు చేసింది. ఆ పర్వత కేంద్ర అభివృద్ధిని పత్రికలు కథనీకరించాలని ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఇక్కడికి 3 కిలోమీటర్లలోని నవాగాంకు పత్రకారులను తీసుకెళ్ళలేదు. సాపుతారా ప్రగతి దుష్ప్రభావాల దుర్గంధం అక్కడి గాలిలో వ్యాపించి వుంది.

నవాగాం మహారాష్ట్ర సరిహద్దు గ్రామం. 270 ఇళ్ళున్నాయి. 1500 జనాభా. వీరికి ఆధార్, రేషన్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలు లేవు. వాళ్ళుంటున్న ఇళ్ళు వాళ్ళవి కావు. వీళ్ళ పూర్వీకులు సాపుతారా ప్రాంతంలో వ్యవసాయంతో జీవించేవారు. ఆ పర్వత ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి 1970 లో వారిని అక్కడి నుండి తొలగించారు. ఆ కొత్త స్థావరమే నవాగాం. అక్కడ అప్పుడిచ్చిన గుడిసెలపై యాజమాన్య హక్కు కోసం 53 ఏళ్ళ నుండి వారు పోరాడుతూనే ఉన్నారు. 1989 లో సాపుతారా, నవాగాంలను అధిసూచిత క్షేత్రం (నోటిఫైడ్ ఏరియా) గా ప్రకటించారు. ఇక్కడ వీధి విక్రేతలు నిషేధం. ఇది ఏ పంచాయతీ పరిధిలోకి రాదు. పంచాయతీలకు వర్తించే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు, బ్యాంకు అప్పులకు ఇక్కడి ప్రజలు అనర్హులు. అధిసూచిత క్షేత్రాలు స్థానిక సంస్థల్లో భాగంకాదు. ప్రభుత్వ ప్రాముఖ్య ప్రాంతాలుగా పరిగణించబడతాయి. దేశంలో అనేక ఆదివాసీ ప్రాంతాలకు అధిసూచిత క్షేత్ర హోదా ఇవ్వబడింది. గుజరాత్ పర్యాటక శాఖ ప్రకటనల్లో సాపుతారా ప్రకాశిస్తున్న నక్షత్రం.

అక్కడ ఒకనాడు వ్యవసాయంతో ప్రజల కు అన్నంపెట్టిన ఆదివాసీల జీవితాలు నేడు పర్యాటకుల దయాదాక్షిణ్యాల మీద, వారికి ఈ గిరిజనులు చేసే సేవల రుసుం మీద ఆధారపడి వున్నాయి. సాపుతారాలో సరస్సులు, వెలుగులీనే నక్షత్రాల హోటళ్ళ దగ్గరే ఈ కష్టజీవుల చీకటి జైల్లున్నాయి. ఈ బందిఖానాల్లో నవాగాం వాసులు టీ, పావ్ భాజీ, వడలు, పకోడీలు, బంగాళాదుంప బజ్జీలుఅమ్ముకొని కూలీలుగా, ఆవుల కాపరులుగా బతుకుతున్నారు. ఈ పనులకూ బయటివారి పోటీ పెరిగింది. ‘ఈ తినుబండారాలు చేయడం మాకు వచ్చేది కాదు. మా పూర్వీకులు కందమూలాలు, అడవుల్లో దొరికే పండ్లు, కూరగాయలు తినేవారు.బతకడానికి మేము ఈ వంటలు చేస్తున్నాం’ అని అక్కడ నివసించే నాందేవ్ అన్నారు. 80% నవాగాం వాసులు ఈ పనే చేస్తారని, మిగిలినవారు కూలి చేసుకొని బతుకుతారని నవాగాం వాసి రామచంద్ర హడస్ చెప్పారు. నవాగాంవాసులు కూలి కోసం సరిహద్దు మహారాష్ట్రకు పోతారు. ఈ కుటుంబం 60 కిలోమీటర్లలోని మహారాష్ట్ర గ్రామం పింపల్ గాఁవ్‌కు వెదురుకోయడానికి వెళ్ళిందని రాముభాయి ఖాండుభాయి పిఠే తాళం వేసిన ఇంటిని చూపించారు. ఆగస్టులో మహారాష్ట్రలో ద్రాక్ష తోటల్లో పనులకు వెళతారు.

2, 3 నెలలు పొలాల్లోనే గుడిసెలు వేసుకొని ఉంటారు. ఆ 2, 3 నెలలు పిల్లల చదువు ఆగిపోతుంది. ఇది ప్రతి ఏటి బాగోతమే.బిజెపి ప్రభుత్వ ప్రగతి: ముఖ్యమంత్రి విజయ రుపానీ 2017 జూన్ డాంగ్ జిల్లా పర్యటనలో ‘ఇళ్ళను మా పేరున క్రమబద్ధీక రించండి, లేకుంటే శాసనసభ ఎన్నికలను బహిష్కరిస్తాం’ అని నవాగాం ఆదివాసులు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. పూర్వ ముఖ్యమంత్రి మోడీ నుండి నేటి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జిల్లా కలెక్టర్ వరకు అనేక వినతి పత్రాలు సమర్పించారు.నవాగాంను మాలేగాఁవ్ పంచాయతీలో కలపమని బిజెపి ప్రాంతీయ నాయకుడు విజయ్ పటేల్‌కు మోడీ సూచించారు. ఆదేశాలు ఇవ్వకుండా తమ పార్టీ నాయకులతో ప్రస్తావించడం మోడీ చిత్తశుద్ధి లేని పని. అందుకే అది నేటికీ అమలు కాలేదు. దేశమంతా స్వచ్ఛ భారత్, శౌచాలయ నిర్మాణాలు సాగుతున్నా, ఈ గుజరాతీయులకు ఆరుబయలే గతి. సరీబెన్ కేశవ్ పవార్ అనే వృద్ధ మహిళ, మాకు ఇల్లూ భూములు, టాయిలెట్లు బాత్ రూంలు లేవని కోపంతో అరిచారు. ‘మా పొలాలు లాక్కొని మమ్ములను బయటికి గెంటేశారు.

మాకు వాగ్దానం చేసిన ఇల్లు, ఉద్యోగాలు, ఉపాధులు, మోడీ మోత మోగించే ఉజ్వల్ గ్యాస్ పొవ్వులు లేవు. కట్టెలు, మట్టి పొవ్వులే మాకు గతి. మా పొలాలపై సంపన్నులు ఆనందిస్తున్నారు, వినోదిస్తున్నారు. మేము రోదిస్తున్నాము. ఎన్నికల్లో ఓట్లు మాత్రం వేయించుకుంటారు’ అని రామచంద్ర చిమన్ హడస్ వాపోయారు.సాపుతారా, నవాగాంలను అధిసూచిత ప్రాంతంగా ప్రకటించడమే ప్రగతి. ఈ ప్రకటన సాపుతారా పర్యాటక కేంద్ర అభివృద్ధికే. ప్రజల విజ్ఞాపన పత్రాలను గుజరాత్ ప్రభుత్వానికి పంపాం. అవన్నీ అక్కడే పెండింగ్ లో వున్నాయి. ‘డాంగ్ జిల్లాధికారి బి.కె. కుమార్ వివరించారు. నవాగాంలో డిగ్రీ చదివినా ఉద్యోగాలు, ఉపాధులు దొరకవు. ఒకరిద్దరే సామాజిక మాధ్యమాలు వాడుతారు. జిల్లా కార్యాలయంలో, వఘయి లాంటి ఒకటి, రెండు తాలూకా కేంద్రాల్లో తప్ప మిగతా చోట్ల ఇంటర్‌నెట్ సౌకర్యం లేదు. జిల్లాలో ఏకైక డాంగ్ శాసన సభ స్థానం అధిసూచిత జాతులకు (ఎస్‌టి) కేటాయించబడింది. 2012, 2017 ల్లో ఎన్నికైన శాసన సభ్యుడు మంగల్ గావిత్ కాంగ్రెస్ పక్షీయుడు. నా మాట ప్రభుత్వం పట్టించుకోదని ఆయన బాధపడ్డారు.

ప్రభుత్వ ప్రగతి అక్కడి ఆదివాసీ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధం. నేటి బిజెపి ఎంఎల్‌ఎ విజయ్ రమేశ్ పటేల్ హయాంలోనూ పరిస్థితి మారలేదు. ‘ఇక్కడి హోటళ్ళలో బయటివారికే ఉద్యోగాలిస్తారు. మాకు టాయిలెట్లు శుభ్రపరిచే, చెత్త ఎత్తేసే పనులే ఇస్తారు’ అని పది చదివిన ఆశిష్ కమల్ పవార్ బాధపడ్డారు. ‘చదువు, లోకజ్ఞానం లేని మా పెద్దల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని ఆదివాసుల భూమిని కాజేసిన ప్రభుత్వం మమ్ములను అద్దె మనుషులుగా మార్చేసింది. కనీసం ఇల్లు మా స్వాధీనంలో ఉంటే తాకట్టుపెట్టి పిల్లలను చదివించుకుంటాము’ అని నవాగాం వాసుల పోరాట నాయకుడు యశ్వంత్ భాయి అన్నారు.
మేఘాలే గతి: ఎన్నికల ఎత్తుగడగా 28 ఏప్రిల్ 22 న గిరిజన శాఖ మంత్రి నరేశ్ పటేల్ 99 ఏళ్ల అద్దె పత్రాలు పంచారు. సాపుతారా సుందర ప్రదేశం. నవాగాం ఆదివాసులు లేని ఆ సుందరత అసంపూర్ణం. నవాగాంలో ఎక్కువగా గుడిసెలే. ఆ గ్రామానికి ఎదురుగా ఉన్న కొండ సగం గుజరాత్‌లో, సగం మహారాష్ట్రలో ఉంది. కొండ మీది దేవాలయం ప్రధాన పర్యాటక దర్శనాస్థలం. గుజరాత్ ప్రచారకర్త అమితాబ్ బచ్చన్ ప్రకటించినట్లు నవాగాం దీనులతో మాట్లాడేందుకు నిజంగానే ఎవరూ లేరు, మేఘాలు తప్ప.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News