గిరిజనుల సమగ్ర వికాసానికి మనవంతు తోడ్పాటునందించాలి
రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పేదలు, మధ్య తరగతి ప్రజలు మరింత వృద్ధిలోకి రావడానికి తీసుకుంటున్న చర్యలకు మనమంతా వారధులుగా పని చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో గిరిజనుల సమగ్ర వికాసానికి పాల్పడింది రాష్ట్రంలో ఎవరన్న విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం గిరిజన మేధావులు, ఉద్యోగులు, ప్రజలపై ఉందన్నారు.
రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసిసి) చైర్మన్‌గా నియామకమైన రమావత్ వాల్యా నాయక్ శుక్రవారం దామోదర సంజీవయ్య సంక్షేమభవన్, మాసబ్ టాంక్, హైదరాబాద్‌లో బాధ్యతల స్వీకారోత్సవానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని తీర్మానం చేస్తూ కేంద్రానికి బిల్లు పంపిస్తే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తమకు గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై ప్రతిపాదన రాలేదని మాటమార్చిందన్నారు. గిరిజనుల పట్ల కేంద్రానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు అనడానికి ఇది ఒక నిదర్శనమన్నారు.
ఈ జీసిసిని మరింత ముందుకు తీసుకెళ్లాలి
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గిరిజనులకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడం కోసం జీఓ 3 తీసుకొస్తే, బిజెపి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జీఓ 3ని సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. ఈ జీఓ 3ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం తరపున వేశామని, దీనికి కేంద్రం మద్దతు పలకాలని కోరితే ఇప్పటివరకు దానిపై అతీ, గతీ లేదన్నారు. గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకుండా గిరిజన ఉద్యోగులకు స్థానికంగా అవకాశం కల్పించే జీఓ 3ను కొట్టివేసి, గిరిజనుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది ఎవరో మనమే గమనించాలన్నారు.
జిసిసి బృందం కరోనా కష్టకాలంలో ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా శానిటైజర్, మాస్కులు, సబ్బులు, షాంపులు, ఇతర ఉత్పత్తులు తయారుచేయడంలో అద్భుతంగా పని చేశారన్నారు. జిసిసి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వాల్యా నాయక్ ఈ జీసిసిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆమె ఆకాంక్షించారు. జిసిసి గతంలో లాభదాయకంగా లేదనీ, జీసిసి ఉద్యోగులుగా పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబాల్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని, వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, ఎక్సైజ్ , టూరిజం శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, జిసిసి మాజీ చైర్మన్ గాంధీ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఇతర అధికారులు హాజరయ్యారు.