మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నాయకులు నూతన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనను సన్మానించారు. ఎఫ్‌ఎల్‌ఎన్, ఉన్నతి ప్రోగ్రామ్స్ వల్ల విద్యార్థులకు సరైన న్యాయం జరగడం లేదని, ఉపాధ్యాయులకు బోధన సమయం తక్కువ అయిపోయి, రాత పని ఎక్కువ అవ్వడం వలన ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనకు గురి అవుతున్నారని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
రెండు మూడు రోజులలో సమీక్షించి ఈ కార్యక్రమాలలో మార్పులు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తపస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎబిఆర్‌ఎస్‌ఎం ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఉషారాణి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పెంటయ్య, రాష్ట్ర బాధ్యులు కళావతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కాశిరావు పాల్గొన్నారు.