సిటిబ్యూరో: ట్రాఫిక్ వలంటీర్లు స్వచ్ఛంద సేవకులని సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ నారాయణనాయక్ అన్నారు. ఎస్‌సిఎస్‌సి ట్రాఫిక్ వలంటీర్లుకు గచ్చిబౌలిలోని సిపి కార్యాలయంలో సోమవారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో 100మంది వలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ సిపి ట్రాఫిక్ నారాయణ నాయక్ మాట్లాడుతూ ఎండ, వర్షం పడుతున్నా ట్రాఫిక్ వలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు.
ట్రాఫిక్ వలంటీర్ల నిబద్ధత అభినందనీయమని అన్నారు. ఎస్‌సిఎస్‌సి జనరల్ సెక్రటరీ రమేష్ కాజా మాట్లాడుతూ గత త్రైమాసికంలో ట్రాఫిక్ వలంటీర్లు 1,300 రోజుల కంటే ఎక్కువగా ట్రాఫిక్ విధులు నిర్వర్తించారని తెలిపారు. మహిళలు కూడా ట్రాఫిక్ వలంటీర్లుగా చేరడం అభినందనీయమని అన్నారు. ట్రాఫిక్ వలంటీర్ల విధుల వల్ల సమాజంలో మంచి మార్పు వస్తుందని తెలిపారు. ట్రాఫిక్ ఫోరం లీడర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కువ మంది ట్రాఫిక్ వలంటీర్లు చేరడం అభినందనీయమని అన్నారు. ఉత్తమ ట్రాఫిక్ వలంటీర్లకు సైబరాబాద్ జాయింట్ సిపి ట్రాఫిక్ నారాయణనాయక్ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.