Sunday, December 22, 2024

ఘనంగా ఎన్‌టిఆర్‌కు నివాళ్లు

- Advertisement -
- Advertisement -

ఎన్‌టిఆర్ ఘాట్ వద్ద బాలయ్య ప్రభృతుల నివాళి
రసూల్ పుర నుండి ఘాట్ వరకు అమర జ్యోతి ర్యాలీ

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలుగునాట సంక్షేమ రాజ్యానికి మొట్టమొదట శ్రీకారం చుట్టిన వ్యక్తి స్వర్గీయ ఎన్‌టిఆర్ అని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారకరామారావు 28వ వర్థంతిని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్ సచివాలయం సమీపంలోని ఎన్‌టిఆర్ ఘాట్ ను పలువురు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ , నందమూరి రామకృష్ణ , తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసినితో పాలు పలువురు పెద్ద సంఖ్యలో హాజరై ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నందమూరి సుహాసిని తదితరులు మాట్లాడుతూ …ఎన్‌టిఆర్ మరణించి 28 ఏళ్లు గడిచినప్పటికీ ప్రజల హృదయాల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్‌టిఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అని నినదించిన వ్యక్తి ఎన్‌టిఆర్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే కాదు.. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కిలో రెండు రూపాయలకే బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల పథకం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారన్నారు. రైతులకు రూ.50కే హార్స్ పవర్ విద్యుత్ ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పెన్షన్ ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. రాజకీయాల్లో మహానాయకుడిగా, వెండితెరపై రారాజుగా వెలుగొంది తెలుగువారి ఆత్మగౌరవ కీర్తిపతాకాన్ని ప్రపంచ నలుదిశలా చాటారన్నారు.
ఎన్‌టిఆర్ ఘాట్ వరకు అమర జ్యోతి ర్యాలీ..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ 28వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత ఎన్‌టిఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ అమరజ్యోతి ర్యాలీని నిర్వహించారు. బేగంపేట రసూల్ పుర చౌరస్తాలోని ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని నందమూరి రామకృష్ణ , నందమూరి సుహాసిని ప్రారంభించారు. అక్కడ నుండి ఎన్‌టిఆర్ ఘాట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఏ కాట్రగడ్డ ప్రసూన కానూరి జయశ్రీ, ఎమ్ రాజు, బోనాల శ్రీనివాస్ గౌడ్, బొప్పన ప్రవీణ్, సోమలింగం, మురహరి గౌడ్, మల్లేష్, యాదగిరి తో పాటు ఇతర నందమూరి అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tributes to NTR

Rally

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News