Sunday, December 22, 2024

గోల్ మాల్ గోవిందంగాళ్లను.. గోల్ మాల్ జేయాలె

- Advertisement -
- Advertisement -

ఎన్నికల వేళ నోట్ల కట్టలు, మందుతో మోపైతున్రు..

మన తెలంగాణ/మందమర్రి: ఎన్నికల వేళ డబ్బులు పం చి.. మందుపోసి ఆగమాగం చేస్తారని వీళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. గోల్‌మాల్ గోవిందం గాళ్లు మోపైతరని, వాళ్లను ప్రజలు గోల్‌మాల్ చేయనంతవరకు ఈ దరిద్రం ఇలాగే ఉంటదన్నారు. చెన్నూరు ని యోజకవర్గంలోని మందమర్రిలో మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సిఎం ఎన్నికల్లో డ బ్బు బలం చూపించే నేతలపై నిప్పులు చెరిగారు. సూట్‌కేసులతో వచ్చే దోపిడీదారులు కావాల్నో.. నిఖార్సయిన నా యకులు కావాల్నో ప్రజలే తేల్చుకోవాలి అన్నారు. అంబేద్కర్ వంటి గొప్ప నేతను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆయన గుర్తుచేశారు. అంబేద్కర్‌పై కాంగ్రెస్‌కు ఉన్న కపట ప్రేమకు ఇదే నిదర్శనమన్నారు. మనం ఆకాశమంతా ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించినం. సచివాలయానికి ఆయన పేరే పెట్టుకున్నామని ఆయన అన్నారు. దళిత అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం కాబట్టే దళితబంధు వంటి పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ఇది దేశంలో పొలికేకగా మారిందని పేర్కొన్నారు.

మీ ఓటే మీ తలరాతలను నిలబెడుతుందని ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే గందరగోళ్లగాళ్లతో గందరగోళానికి గురికావొద్దని అభ్యర్థ్ది చరిత్ర ఆలోచించి ఓటు వేయాలని గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద్ధి సంక్షేమాలను ప్రవేశపెట్టిందని 24 ఏండ్ల క్రితమే బిఆర్‌ఎస్ పార్టీ పుట్టిందని బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలే బాస్‌లని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గత పాలకుల పాలనలో తెలంగాణ నయవంచనకు గురైందని, గత పాలకుల చేతుల్లో నలిగిపోయిన తెలంగాణను కొట్ల్లడి తెచ్చుకున్నామన్నారు. కొట్లడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్, బిజెపి పార్టీల చేతుల్లో పెడితే కైలాసంలో పెద్ద పాము మింగినట్లే అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నల్ల బంగారం అయిన బొగ్గు వెలికితీయ చాతకాక 49 శాతాన్ని కేంద్రానికి కట్టబెట్టిన నీచ చరిత్ర కాంగ్రెస్‌దేనని అన్నారు. సింగరేణి కార్మికులకు 1000 కోట్ల లాభాలను పంచుతున్న ఘనత బిఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. నాటి కాంగ్రెస్ నేతల చాతకాని తనం వల్లే సింగరేణి కేంద్రానికి 49 ఇచ్చిందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు.

ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న బిజెపి ఇప్పుడు సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని సిఎం ఆరోపించారు. తెలంగాణకు సింగరేణి కొంగుబంగారమని సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందని మన అదృష్టానికి ప్రకృతి సింగరేణి ప్రసాదించిందన్నారు. తెలంగాణలో 10 కోట్ల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నదని ఇప్పటి వరకు ఒకటిన్నర బొగ్గును కూడా వెలికితీయలేదన్నారు. ఇంకా 8.5 కోట్ల మిలియన్ టన్నుల బొగ్గు ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. ఇది అచ్చంగా తెలంగాణ కంపెనీ అని దీంట్లో ఎవరి వాటా లేకుంటే అని తెలిపారు. సింగరేణి కార్మికులకు 39 శాతం లాభాల వాటాను పంచి ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రైవేటీకరణకు పెట్టింది పేరు బీజేపీ అని, బీజేపీకి ఓటు వేస్తే మోడీ అమ్ముకుంటాడని, మత చిచ్చులు పెట్టే బిజపిని తెలంగాణాలోఅడుగు పెట్టనివ్వద్దని పేర్కొన్నారు. గత పాలకుల పాలనకు ప్రస్తుత బిఆర్‌ఎస్ పాలన ఎలా ఉందో ప్రజలు గ్రహించాలని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రాతో సంబంధం లేకుండా వేరుగా ఉన్న తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో కలిపి నిలువునా ముంచింది కాంగ్రెస్ పార్టీనేనని, పట్టపగలు ఏడుగురు విద్యార్థ్ధులను కాల్చి చంపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రాన్ని విలీనం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు.

రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం బిఆర్‌ఎస్ అని, రైతుబంధు పథకాన్ని బందు పెడదామన్న కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని, ధరణి పోర్టల్ ద్వారా రైతులకు మేలు జరుగుతుందని, ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ రాష్ట్రంలో దళారులు మొదలవుతారని, దళారుల రాజ్యం రాకుండా ఉండాలంటే రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండాలని, దేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంటు అందిస్తున్నామని, రైతుల ఆత్మహత్యల్లో నవంబర్ వన్‌గా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో సూట్కేసులు తెచ్చినోళ్లు కావాలో లేక తెలంగాణ ఉద్యమకారుడు కావాలో నియోజకవర్గ ప్రజలు గ్రహించుకోవాలని, చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ గెలిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని, బాల్క సుమన్ నా ఇంటి బిడ్డ అని ఆయన బాల్క సుమన్‌కు కితాబిచ్చారు. నవంబరు 30న జరిగే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి చెన్నూరులో సుమన్‌ను లక్ష మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఆశీర్వాద సభలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డితో పాటు ఫిలిం కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ పుస్కూరి రాంమోహన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, నాయకులు జె రవీందర్, మేడిపల్లి సంపత్, కొంగల తిరుపతిరెడ్డి, బండారి సూరిబాబు, ఒ రాజశేఖర్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News