ఖద్దరు జాతీయ గౌరవానికి ప్రతీక కావాలి
కాంగ్రెస్ నేత సోనియా గాంధీ పిలుపు
మోడీ ప్రభుత్వ పోలియెస్టర్ జెందా విధానంపై విమర్శ
న్యూఢిల్లీ : యంత్రంతో తయారు చేసిన పోలియెస్టర్ జెండాలను మోడీ ప్రభుత్వం ఆదరించడాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మంగళవారం తీవ్రంగా ఆక్షేపించారు. త్రివర్ణ పతాకానికి విలక్షణతను చేకూర్చే వస్త్రంగా ఖద్దరును పునరుద్ధరించాలని సోనియా పిలుపు ఇచ్చారు. ఖద్దరు జాతీయ గౌరవానికి ప్రతీక కావాలని ఆమె ఉద్ఘాటించారు. సోనియా గాంధీ ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో వ్యాసం రాస్తూ, ‘స్వాతంత్య్ర దినోత్సవానికి వారం ముందు ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారోద్యమానికి ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి పిలుపు ఇవ్వడం జాతీయ పతాకంపైన, దేశానికి దాని ప్రాముఖ్యం గురించి సమష్టిగా పునరాలోకనానికి అవకాశం ఇస్తున్నదని పేర్కొన్నారు.
‘ఆయన (మోడీ) ద్వంద్వ వైఖరితో ఒక వైపు జాతీయ పతాకానికి గౌరవం ఇస్తూనే, మరొకవైపు విరుద్ధ భావాలు గల సంస్థకు విధేయుడుగా ఒక ఎత్తు. చైనా, తదితర ప్రదేశాల నుంచి తరచు దిగుమతి చేసుకునే ముడి సరకుతలో యంత్రం తయారీ పోలియెస్టర్ జెండాలను ఆమోదించడం మరొక ఎత్తు’ అని ఆమె అన్నారు. జాతీయ పతాకాన్ని ‘చేతితో వడికిన, చేతితో నేసిన ఉన్ని/ నూలు/ పట్టు ఖద్దరు వస్త్రం’తో రూపొందించాలని భారత పతాక నియమావళి చారిత్రకంగా కోరుతున్నదని సోనియా గుర్తు చేశారు. జాతీయోద్యమానికి తన సారథ్యంలో మహాత్మా గాంధీ స్వయంగా వడికిన, నేసిన ముతకదైనా, గట్టిదైన ఖద్దరు మన చారిత్రక, సాంస్కృతిక జ్ఞాపకాల్లో ప్రత్యేకత సంతరించుకున్నదని ఆమె పేర్కొన్నారు.
ఖద్దరు మన గతానికి చిహ్నం అని, భారత ఆధునిక, ఆర్థిక పటిష్ఠతకు ప్రతీక అని సోనియా అన్నారు. ‘2022లో మన స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవం శుభ సందర్భంగా ప్రభుత్వం ‘యంత్రం తయారీ పోలియెస్టర్ వస్త్రం, తోరణం’ను చేర్చేందుకు (2021 డిసెంబర్ 30 నాటి తన ఉత్తర్వు ద్వారా) పతాక నియమావళిని సవరించింది, అదే సమయంలో పోలియెస్టర్ జెండాలను జిఎస్‌టి నుంచి మినహాయించింది. ఆ విధంగా వాటికి ఖద్దరు పతాకాలకు వలె సమాన పన్ను స్థాయి తెచ్చింది’ అని సోనియా తెలిపారు. మన దేశ జాతీయ ప్రతీకల సర్వీసుకు మనల్ని నిబద్ధులను చేయడం సముచితంగా ఉండవలసిన సమయంలో ప్రభుత్వం వాటిని పక్కకు నెట్టి భారీ మార్కెట్, యంత్రం తయారీ పోలియెస్టర్ వస్త్రం వినియోగించేలా చేసిందని సోనియా విమర్శించారు.
భారత ప్రమాణాల మండలి (బిఐఎస్) గుర్తింపు ఉన్న దేశంలోని ఏకైక జాతీయ పతాక తయారీ సంస్థ కర్నాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘ (కెకెజిఎస్‌ఎస్) భారత ఖద్దరు పరిశ్రమను ప్రభుత్వ ప్రాయోజిత హననం చేయడంపై జనం దృష్టిని ఆకర్షించడానికి నిరవధిక సమ్మెకు దిగవలసి వచ్చిందని ఆమె తెలియజేశారు. పోలియెస్టర్ తయారీకి గ్లోబల్ హబ్‌గా ఉన్న ఘనమైన రోజులకు భిన్నంగా భారత్ 2023, 2024లో పోలియెస్టర్ నూలు నెట్ దిగుమతిదారుగా మారిన సమంలో ఈ నిర్ణయం చోటు చేసుకుందని ఆమె పేర్కొన్నారు. ‘చైనా నుంచి ప్రధానంగా పోలియెస్టర్ నూలును దిగుమతి చేసుకుని, మన జాతీయ పతాకం వస్త్రం కోసం దీనిని నేసే దురదృష్టం మనకు ప్రాప్తించింది. మన సరిహద్దుల్లో చైనీస్ సాయుధ బలాల దురాక్రమణలు, ప్రధాని ‘ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం’ పరాకాష్ఠ సమయంలో మన జాతీయ గౌరవం ఈ విధంగా దెబ్బ తిన్నది’ అంటూ సోనియా కేంద్రాన్ని దుయ్యబట్టారు. ‘ప్రభుత్వ లక్షంలో డొల్లతనం మహాత్మా గాంధీకి అత్యంత ప్రియతమ వారసులు మన ఖద్దరు నేతలు, కార్మికులను నేరుగా దుష్ప్రభావానికి గురి చేసింది’ అని ఆమె విమర్శించారు.
ఇది మన జాతీయ పతాకానికే పరిమితం కాదు, భారతకు ప్రతిష్ఠాకరమైన చేనేత, హస్తకళల సంప్రదాయాల పట్ల ఈ ప్రభుత్వ అనాసక్తతను సూచిస్తున్నదని ఆమె అన్నారు. 2014 నుంచి ప్రభుత్వం క్రమంగా బడా కార్పొరేట్ ప్రయోజనాలను, పరిమిత స్వామికీకరణను ప్రోత్సహించసాగిందని, మన చేనేత పరిశ్రమలకు ఆలవాలమైన మన దేశ సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల రంగాన్ని దెబ్బ తీయసాగిందని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ‘పెద్ద నోట్ల రద్దు, శిక్షాత్మక జిఎస్‌టి, అనాలోచితంగా కొవిడ్ 19 లాక్‌డౌన్ వల్ల వేలాది మంది మన చేనేత కార్మికులు తమ వృత్తిని విడనాడవలసి వచ్చింది’ అని సోనియా ఆరోపించారు. ‘జిఎస్‌టి నుంచి చేనేతను మినహాయించాలన్నమన కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం చెవికెక్కలేదు. మరొక వైపు పెరుగుతున్న వ్యయాలు, ముఖ్యంగా విద్యుత్, పత్తి నూలు ధరలు వారిని ఇక్కట్లకు గురి చేశాయి’ అని సోనియా అన్నారు. అనేక విధాలుగా లోపభూయిష్టమైన, ఇటీవలే ప్రారంభించిన విశ్వకర్మ యోజన పరిధి నుంచి చేనేత కార్మికులను పూర్తిగా మినహాయించారని సోనియా ఆరోపించారు.