Saturday, November 23, 2024

ఆ కాంగ్రెస్ అలసిపోయింది.. మాదే అసలైన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

Trinamool Congress criticizes Congress in Jago Bangla

పార్టీ పత్రికలో తృణమూల్ కాంగ్రెస్ స్పష్టీకరణ

కోల్‌కత: యుద్ధంలో అలసిపోయిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించడంలో విఫలమైందని, ప్రస్తుత పరిస్థితులలో తమదే అసలైన కాంగ్రెస్ పార్టీ అని మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తన పార్టీ గొంతుక జాగో బంగ్లా పత్రికలో కాంగ్రెస్‌పై తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. బిజెపిపై పోరు సల్పడంలో కాంగ్రెస్ అలసిపోయిందని, ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైందంటూ సంపాదకీయంలో టిఎంసి విమర్శించింది. ఇటీవల ఢిల్లీలో టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పార్టీ ఎంపీలతో సమావేశమై తమ పార్టీని ఇతర రాష్ట్రాలలో విస్తరించాలన్న ఆలోచనను పంచుకోవడాన్ని వ్యాసంలో ఉటంకించింది. బిజెపి దూకుడును అడ్డుకోవలసిన ప్రధాన బాధ్యత కాంగ్రెస్ పార్టీదని, కేంద్రంలో ఆ పార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా ఉందని టిఎంసి పేర్కొంది.

కాని.. అంతఃకలహాలతో, గ్రూపు రాజకీయాలతో చీలికలు పేలికలై, పోరాటంలో అలసిపోయిన కాంగ్రెస్ తన బాధ్యత నిర్వహణలో పూర్తిగా విఫలమైందని టిఎంసి విమర్శించింది. అయితే..కాలం ఎవరి కోసమూ వేచి చూడదని, ఎవరో ఒకరు ముందుకు రావలసిందేనని, ఆ బాధ్యతను టిఎంసి నిర్వర్తిస్తుందని, తమదే అసలైన కాంగ్రెస్ పార్టీ అంటూ సంపాదకీయంలో టిఎంసి పేర్కొంది. అయితే..టిఎంసి ఒంటరిగా ముందుకు వెళ్లదలచుకోలేదని, అందరినీ కలుపుకుని పోరాడాలన్నదే తమ ఆశయమని కూడా పత్రిక పేర్కొంది. ఇదిలా ఉండగా&ప్రతిపక్షంలో చీలికలు తేవడానికి టిఎంసి ప్రయత్నిస్తోందంటూ వస్తున్న ఆరోపణలను అభిషేక్ బెనర్జీ మంగళవారం ఢిల్లీలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో తోసిపుచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తమ పార్టీని ఇతర రాష్ట్రాలలో విస్తరిస్తామని, అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఎం కూడా టిఎంసికి వ్యతిరేకంగా పోరాడి బిజెపికి సాయపడ్డాయని అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించినట్లు వర్గాలు తెలిపాయి. బెంగాల్‌లో జరిగింది ప్రతిపక్షాల ఐక్యతలో అడ్డంకులు సృష్టించడం కానిపక్షంలో ఇతర రాష్ట్రాలలో టిఎంసి విస్తరించడం ఎలా సమస్య అవుతుందని ఆయన ప్రశ్నించినట్లు వారు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News