Friday, November 22, 2024

త్రిపురలో బిజెపికి ఎదురుగాలి

- Advertisement -
- Advertisement -

త్రిపురలో మౌలికంగా గిరిజన ప్రాబల్యం ఎక్కువ. గిరిజనుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నది త్రిపుర రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. 2018 ఎన్నికల్లో గిరిజనుల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను బిజెపి బలపరచింది. గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర… ఐపిటిఎఫ్‌తో జత కట్టింది. ఎన్నికల్లో సిపిఎం కూటమిని ఓడించి అధికారానికి వచ్చింది. బిజెపి విజయంలో ఐపిటిఫ్ కీలక పాత్ర పోషించింది. దాదాపు 15 నియోజక వర్గాల్లో కమలం పార్టీ విజయానికి దోహదపడింది. అయితే ఈ ఐదేళ్లూ ప్రత్యేక గిరిజన రాష్ట్రం డిమాండ్‌ను ఐపిటిఎఫ్ అటకెక్కించదన్న విమర్శలున్నాయి. దీంతో గిరిజనంలో ఐపిటిఎఫ్ పరపతి తగ్గింది. టిప్రా మోతా పార్టీ రంగంలోకి దిగడంతో ఐపిటిఎఫ్ పలుకుబడి ఇంకా తగ్గింది. ఈ విషయాన్ని గమనించిన బిజెపి ఈసారి ఐపిటిఎఫ్‌కు కేవలం ఐదు సీట్లు కేటాయించింది.

ఈ నెల 16న ఎన్నికలు జరగనున్న త్రిపురలో బిజెపి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. నిన్నమొన్నటి వరకు బిజెపికి ఎదురే లేదని అందరూ భావించారు. కమ లం పార్టీ నాయకులు కూడా అదే ధీమాతో ఉన్నారు. అయితే ఒక్కసారిగా టిప్రా మోతా పార్టీ తెరమీదకు రావడంతో త్రిపురలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికైతే టిప్రా మోతా పార్టీ ఇటు బిజెపికి అటు సిపిఎంకు చెమట్లుపట్టిస్తోంది. ప్రత్యేక టిప్రాల్యాండ్ డిమాండ్‌తో త్రిపుర రాచ కుటుంబానికి చెందిన ప్రద్యుత్ విక్రమ్ మాణిక్య దేవ్ వర్మ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. విక్రమ్ మాణిక్య దేవ్ వర్మ రాజకీయాలకు పాత కాపు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కొంత కాలం పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. టిప్రా మోతా పార్టీ ఆవిర్భావానికి ముందు త్రిపురలో రెండే కూటములుండేవి. ఇందులో ఒకటి అధికార పక్షమైన బిజెపి కాగా, రెండోది సిపిఎం కూటమి. తాజాగా టిప్రా మోతా పార్టీ ఎన్నికల బరిలో నిలవడంతో త్రిపురలో ముక్కోణపు పోటీ జరగబోతోంది.

42 సీట్లలో టిప్రా మోతా పార్టీ పోటీ

త్రిపురలో మొత్తం అసెంబ్లీ నియోజక వర్గాలు 60. ఇందులో 42 నియోజక వర్గాల్లో టిప్రా మోతా పార్టీ బరిలోకి దిగుతోంది. 20 నియోజక వర్గాల్లో ఈ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే ఎవరి ఓట్లను టిప్రా మోతా చీల్చుతుందన్న దానిపై భిన్నమైన వాదనలు వినవస్తున్నాయి. టిప్రా మోతా పార్టీ ప్రభావం బిజెపి విజయావకాశాలపై ఎక్కువగా ఉంటుందంటున్నాయి అగర్తలా రాజకీయ వర్గాలు. త్రిపురలో మౌలికంగా గిరిజన ప్రాబల్యం ఎక్కువ.

గిరిజనుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నది త్రిపుర రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉన్న డిమాండ్. 2018 ఎన్నికల్లో గిరిజనుల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను బిజెపి బలపరచింది. గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర… ఐపిటిఎఫ్‌తో జత కట్టింది. ఎన్నికల్లో సిపిఎం కూటమిని ఓడించి అధికారానికి వచ్చింది. బిజెపి విజయంలో ఐపిటిఫ్ కీలక పాత్ర పోషించింది. దాదాపు 15 నియోజక వర్గాల్లో కమలం పార్టీ విజయానికి దోహదపడింది. అయితే ఈ ఐదేళ్లూ ప్రత్యేక గిరిజన రాష్ట్రం డిమాండ్‌ను ఐపిటిఎఫ్ అటకెక్కించదన్న విమర్శలున్నాయి. దీంతో గిరిజనంలో ఐపిటిఎఫ్ పరపతి తగ్గింది.

టిప్రా మోతా పార్టీ రంగంలోకి దిగడంతో ఐపిటిఎఫ్ పలుకుబడి ఇంకా తగ్గింది. ఈ విషయాన్ని గమనించిన బిజెపి ఈసారి ఐపిటిఎఫ్‌కు కేవలం ఐదు సీట్లు కేటాయించింది. దీంతో ఐపిటిఎఫ్ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి ఐపిటిఎఫ్ కార్యకర్తలు మేరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మిత్రపక్షంపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు భారతీయ జనతా పార్టీ. తనకంటూ ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకుని జనంలోకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పోటీ చేస్తున్న 55 సీట్లలో ప్రతి నియోజక వర్గాన్ని గెలుచుకోవడానికి పక్కా ప్రణాళికతో బిజెపి ముందుకెళుతోంది. సినీ నటుడు మిథున్ చక్రవర్తి ఇటీవల త్రిపురలో బిజెపి తరఫున ప్రచారం కూడా చేశారు.

బిజెపిలో ముఠా కలహాలకు కూడా కొదవ లేదు. బిజెపి అధికారంలోకి రాగానే విప్లవ్ కుమార్ దేవ్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది అగ్ర నాయకత్వం. అయితే ఢిల్లీ పెద్దల అంచనాలకు తగ్గట్టు విప్లవ్ దేవ్ పని చేయలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ఆయన పాలనా తీరుపై సొంత పార్టీ ఎంఎల్‌ఎలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ముఠాల కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. విప్లవ్ కుమార్ దేవ్ హయాంలోనే త్రిపుర స్వయం పాలిత జిల్లా కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార పక్షమైన బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో రానున్న రోజుల్లో పుట్టి మునుగుతుందని గ్రహించిన బిజెపి హైకమాండ్ అప్రమత్తమైంది. విప్లవ్ కుమార్ దేవ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసింది. సీనియర్ నాయకుడు మాణిక్ సాహాకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. అయితే విప్లవ్ దేవ్‌కు త్రిపుర బిజెపిలో తనకంటూ ఒక అనుచర వర్గం ఉంది. దీంతో కమలం పార్టీలో అసమ్మతి మరింత పెరిగింది. ఈ ముఠా గొడవల ప్రభావం ఎన్నికల్లో బిజెపి విజయావకాశాలపై పడే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కాంగ్రెస్‌తో సిపిఎం దోస్తానా

సహజంగా త్రిపుర పేరు వినగానే ఎవరికైనా భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) గుర్తుకు వస్తుంది. ఆ తరువాత సిపిఎం సీనియర్ నేత మాణిక్ సర్కార్ గుర్తుకొస్తారు. త్రిపురను సిపిఎంకు దుర్భేద్యమైన కోటగా మార్చడంలో మాణిక్ సర్కార్ కీలక పాత్ర పోషించారు. 20 ఏళ్ల పాటు త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ కొనసాగారు. అయితే ఈసారి ఎన్నికల్లో సర్కార్ పోటీ చేయడం లేదు. పార్టీ ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. 2018 లో కోల్పోయిన అధికారాన్ని తిరిగి కైవశం చేసుకోవడానికి సిపిఎం తీవ్రంగా శ్రమిస్తోంది. చాలా కాలం పాటు బద్ధ శత్రువుగా ఉన్నా కాంగ్రెస్‌తో జత కట్టింది. అయితే క్షేత్ర స్థాయిలో పని చేసే సిపిఎం కార్యకర్తలు కాంగ్రెస్‌తో పొత్తును జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నేళ్ల పాటు యుద్ధం చేసిన కాంగ్రెస్‌తో ఎలా కలిసి పని చేస్తామని మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ అసంతృప్తుల సంగతి ఎలాగున్నా 43 సీట్లలో సిపిఎం పోటీ చేస్తోంది. మిత్రపక్షం కాంగ్రెస్‌కు 13 సీట్లు కేటాయించింది. కూటమిలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు సిపిఐ, ఆర్‌ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ కు ఒక్కో నియోజక వర్గాన్ని కేటాయించింది. ఒక స్వతంత్ర అభ్యర్థికి ఒక సీటును కేటాయించింది. బిజెపి, సిపిఎం.. ఈ రెండు కూటముల మధ్య హోరాహోరీగా జరిగే పోరు ఫలితంగా త్రిపురలో ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయన్నది రాజకీయ వర్గాల కథనం. హంగ్ అసెంబ్లీ అంటూ ఏర్పడితే టిప్రా మోతా పార్టీ చక్రం తిప్పడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఎస్.అబ్దుల్ ఖాలిక్
6300174320

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News