చట్టపరమైన చర్యకు హెచ్చరిక
చెన్నై : ఎఐఎడిఎంకె మాజీ నేత ఎవి రాజు తనపై చేసిన నిందాపూర్వక వ్యాఖ్యకు ప్రముఖ నటి త్రిష తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆయనపై చట్టపరమైన చర్య తీసుకుంటానని త్రిష హెచ్చరించింది. కాగా, పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాజుకు ఈ నెల 17న ఎఐఎడిఎంకె నుంచి ఉద్వాసన పలికారు. త్రిష సోషల్ మీడియాలో ఆ రాజకీయ నాయకుని తీవ్రంగా విమర్శించారు.
‘ జనం దృష్టిని ఆకర్షించేందుకు ఏ స్థాయికైనా దిగజారే నీచ మానవులను పదే పదే చూడడం విసుగు కలిగిస్తోంది. అవసరమైన, తీవ్ర చర్య తీసుకోగలను. ఏదైనా చెప్పాలన్నా, చేయాలన్నా నా న్యాయ విభాగం ద్వారానే జరుగుతుంది’ అని త్రిష ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నది. నటి త్రిషపై ఎవి రాజు ప్రకటన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో నటి గురించి కించపరిచే వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ సంఘటన వివాదానికి దారి తీసింది. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.