ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రశ్రేణి సంస్థతో కుదిరిన అవగాహన ఒప్పందం
రాష్ట్రంలో ప్రపంచస్థాయి ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడి
స్థల పరిశీలన కోసం మంత్రి కెటిఆర్ సూచన మేరకు ప్రత్యేక
హెలీకాప్టర్‌లో జహీరాబాద్ నిమ్జ్‌కు వెళ్లిన కంపెనీ బృందం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ట్రైటాన్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు రూ.2,100 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ సుముఖతను వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ ఇవి (ఎలక్ట్రానిక్ వెహికల్) ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. కంపెనీ సిఇఒ హిమాన్షు పటేల్‌తో కూడిన ప్రతినిధుల బృందం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ను కలిసి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీలో గ్లోబల్‌గా పేరుగాంచిన ట్రైటాన్ కంపెనీ..ఇవితో గ్లోబల్‌గా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు చేపడుతోంది. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నందుకు కంపెనీ ఇవి సిఇఒకు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు కొరకు జహీరాబాద్‌లోని నిమ్జ్‌ను పరిశీలించాల్సిందిగా కంపెనీ ప్రతినిధులను కోరారు. కాగా మంత్రి కెటిఆర్ సూచన మేరకు కంపెనీ ప్రతినిధులను ప్రత్యేక ఛాపర్లో జహీరాబాద్ నిమ్జ్‌కు తీసుకెళ్లి స్థల పరిశీలన చేశారు. ప్రస్తుతం యుఎస్ కేంద్రంగా ఈ సంస్థ ఇవి ఈవీ కార్లును ఉత్పత్తి చేస్తోంది. పరిశ్రమ ఏర్పాటుకు ల్యాండ్ ఎంపిక పూర్తయితే త్వరలోనే ఓ భారీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ తెలంగాణ కేంద్రంగా పనిచేయనుంది.