Saturday, April 5, 2025

ఆఖరి ‘అమృత స్నానానికి’ త్రివేణి సంగమం సిద్ధం

- Advertisement -
- Advertisement -

లక్నో : ఈ విశ్వంలో అతిపెద్ద మతపరమైన ఉత్సవం మహా కుంభమేళా పరిసమాప్తి దశకు చేరుకుంటున్న తరుణంలో బుధవారం మహా శివరాత్రి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో కడపటి ‘అమృత స్నానం’ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమంలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానం ఆచరించగలరని ఆశిస్తున్నారు. భక్తుల సమూహాలు ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే త్రివేణి సంగమానికి దారి తీసే మార్గాలపై జన సందోహాన్ని చూడవచ్చు.

కుంభమేళా ప్రాంతంలో విస్తృత స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతాన్ని వాహన నిషిద్ధ మండలంగా ప్రకటించారు. అత్యవసర సరకులు రవాణా చేసే వాహనాలను, అంబులెన్స్‌లను మాత్రమే ప్రవేశించనిస్తున్నారు. రాష్ట్రం వెలుపలి నుంచి భక్తులతో వచ్చే వాహనాలను పట్టణం లోనికి రానివ్వడం లేదని, వాటిని నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి ఉంచుతున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. పట్టణంలో గత కొన్ని రోజుల్లో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్‌లు చోటు చేసుకున్నాయి. పెరుగుతున్న జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్లలో సామగ్రి గ్రహణ ప్రాంతాలను ఏర్పాటు చేశారు.

ప్రయాగ్‌రాజ్‌కు చేరుకునే మార్గంలో ముఖ్యమైన కూడలి అయిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ (పూర్వపు మొఘల్ సరాయి)లో కూడా అటువంటి ప్రాంతాలు ఏర్పాటు చేశారు. కాగా, స్నానం కోసం త్రివేణి సంగమానికి బదులు ఘాట్‌లను కూడా ఉపయోగించుకోవలసిందిగా భక్తులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. ‘తమకు సమీపంలోని ఘాట్‌లలో స్నానం చేసేలా భక్తులను ప్రోత్సహిస్తున్నాం, త్రివేణి సంగమానికి వెళ్లాలని పట్టుబట్టవద్దని వారిని కోరుతున్నాం’ అని అధికారి ఒకరు తెలియజేశారు. బుధవారం ఆఖరి అమృత స్నానం సందర్భంగా ఏర్పాట్ల పర్యవేక్షణకు సీనియర్ అధికారులను మేళా ప్రాంతంలో నియోగించారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక సమావేశంలో అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. ప్రయాగ్‌రాజ్‌లో ట్రాఫిక్ జామ్‌లు ఏవీ ఏర్పడకుండా, భక్తులకు మేళా ప్రాంతాన్ని చేరుకోవడంలో ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. అధిక సంఖ్యలో భక్తులు అయోధ్య, వారణాసి కూడా సందర్శిస్తున్నారు. మహా శివరాత్రి రోజు రికార్డు సంఖ్యలో భక్తులు ఆ రెండు పట్టణాలకు చేరుకోవచ్చు కనుక అధికారులను అలర్ట్ చేశారు. వారణాసిలో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయంలో ‘విఐపి దర్శనాన్ని’ అధికారులు రద్దు చేశారు. లక్షలాది మంది భక్తులు బుధవారం మహాశివరాత్రి సందర్బంగా ఆలయంలో ప్రార్థనలు, అభిషేకాలు చేయవచ్చునని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News