Wednesday, January 22, 2025

మనతో చాలాకాలం పాటు ప్రయాణించే సినిమా ‘సార్’: త్రివిక్రమ్ శ్రీనివాస్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు)/‌ ‘వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్'(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రీమియర్ షోల టికెట్లు రికార్డు స్థాయిలో బుక్ అయ్యాయి. ఇదే ఉత్సాహంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఈ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో నిర్మాత ఎస్.రాధాకృష్ణ, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య అతిథి, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “గోవిందుడు, గురువు ఎదురైతే మొదటి నమస్కారం నేను ఎవరికి పెట్టాలంటే.. గోవిందుడు వీడు అని చెప్పిన గురువుకే నా మొదటి నమస్కారం పెడతానని కబీర్ అన్నాడు. అలాంటి ఎంతోమంది గురువులకి నమస్కారం చెబుతూ.. అలాంటి గురువుల గురించి సినిమా తీసిన వెంకీని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. లాక్ డౌన్ సమయంలో వెంకీ ఈ కథ చెప్పాడు. అతను చెప్పిన కథని నమ్మి ఈ సినిమా చేసిన ధనుష్ గారికి ధన్యవాదాలు. నిర్మాతల్లో ఒకరైన నా భార్య ఈ సినిమా చూసి.. కథగా విన్నప్పుడు కంటే, సినిమాగా చూసినప్పుడు ఇంకా బాగుంది అని చెప్పింది. నేను కూడా ఈ సినిమా చూశాను.

నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి కథకి ఒక ఆత్మ ఉంటుంది. ఈ కథ తాలూకు ఆత్మ ఏంటంటే.. విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలు డబ్బుతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనేది ప్రపంచం మనకి నేర్పుతున్న పాఠం. కానీ వాటినే సామాన్య జనాలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. అసలు చదువు ఎందుకు మనిషికి ముఖ్యమంటే.. ఒక మనిషి జీవనశైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. ఒక పేదవాడి కొడుకుని డబ్బున్న వాడిని చేయగలిగేది చదువు. ఒక గుమాస్తా కొడుకుని కలెక్టర్ ని చేయగలిగేది చదువు. ఒక మాములు మనిషి కొడుకుని ఒక సుందర్ పిచై, ఒక సత్య నాదెళ్ళ లాంటి స్థాయికి.. ప్రపంచం మొత్తం చూసే స్థాయికి తీసుకెళ్లగలిగేది చదువు. అంత గొప్ప ఆయుధాన్ని కేవలం డబ్బు మీకు లేదని ఒక కారణం మూలంగా వాళ్ళకి దూరం చేయడం ఎంతవరకు రైట్?. ఈ ప్రశ్నే ఈ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు. అందుకే ఈ సినిమాకు నాకు చాలా బాగా నచ్చింది. దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలలో ఉండే వాళ్లకి ఉన్నత చదువులకు వెళ్ళాలంటే అడుగడుగుక్కి చదువు దూరమైపోతుంది. ఇప్పుడైతే ఎల్కేజీ ల నుంచే దూరమవ్వడం మొదలుపెట్టింది. అక్కడి నుంచే గీతలు గీసేస్తున్నాం.. మీకు డబ్బుంది, మీకు డబ్బు లేదు.. మీరు చదువుకోగలరు, మీరు చదువుకోలేరని. చదువుకోవడానికి బుర్ర కాదు, డబ్బు కావాలి అనుకునే స్థాయి మనం వచ్చేశామంటే.. మనం ఎంత దిగజారిపోతున్నామో మనకు తెలుస్తుంది.

వీటిని సినిమాలో చాలా బలంగా ప్రశ్నించాడు వెంకీ. నేను చదువుకునే సమయంలో ఇంజనీరింగ్ కోసం ఏడెనిమిది వేలు ఫీజు కట్టాలి. కానీ మా నాన్నగారు డిగ్రీ చదువుకోమని చెప్పడంతో.. నేను పెద్దగా ఏమీ ఆలోచించకుండా, చింతించకుండా డిగ్రీలో చేరాను. కానీ ఈ సినిమాలో ఒక సీన్ చూస్తే.. పిల్లలు ఏదైనా ఒక వస్తువు అడిగినప్పుడు వాళ్ళకి కొనలేకపోతే వాళ్ళు కాసేపే బాధపడతారు. కానీ వాళ్ళ అమ్మానాన్నలు మాత్రం ఆ కొనలేని పరిస్థితి గురించి పోయేవరకు బాధపడతారు అని ఈ సినిమాలో ఒక మాట రాశాడు వెంకీ. నాకు ఇప్పుడు అనిపిస్తుంది.. నేను దాని గురించి పెద్దగా బాధపడలేదు.. కానీ మా నాన్నగారు మాత్రం ఇప్పటికీ మా వాడిని ఇంజనీరింగ్ చదివించలేకపోయానని బాధపడుతూ ఉంటారేమో. మౌలికమైన వసతులు అందరికీ సమానంగా అందాలి. నేను జల్సా సినిమాలో ఇదే రాశాను. వాళ్ళు ఆసుపత్రికి ఇంత దూరంగా ఉన్నారు, స్కూల్ కి ఇంత దూరంగా ఉన్నారు.. కానీ పేదరికానికి మాత్రం బాగా దగ్గరలో ఉన్నారు. ఇలాంటి సమాజాన్ని మనం ప్రోత్సహించకూడదు. మనకేం కాదు కదా మనం బాగున్నాం కదా అనుకుంటే.. బాగున్నా గ్రూప్ చిన్నదైపోయి, బాగోని గ్రూప్ పెద్దదైతే గనుక.. బాగున్నవాళ్ళు కూడా ఉండరు.. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది 2000లో జరిగిన కథగా చెప్పారు కానీ ఇప్పటికి కూడా సరిగ్గా సరిపోతుంది.

టీచర్, స్టూడెంట్ కి మధ్య ఉండే రిలేషన్ చాలా పవిత్రమైనది. మనం ఎంత దూరం ప్రయాణం చేసినా కూడా మన గురువులు మనతో పాటే ఉంటారు. అలాగే ఈ సార్ సినిమా కూడా మనతో పాటు చాలాకాలం పాటు ప్రయాణించే సినిమా అవుతుంది. ఈ తరం గొప్ప నటుల్లో ధనుష్ ముందు వరుసలో ఉంటాడు. ఆయన జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ పనిని ఎంజాయ్ చేస్తారు. అలా పనిని ఎంజాయ్ చేసేవాళ్ళని ఎవరూ ఆపలేరు. ధనుష్ మొదటి తెలుగు సినిమాలో మేం కూడా భాగమైనందుకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. వెంకీ చాలా మంచి సినిమా చేశాడు. అతనికి ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నాను” అన్నారు.

ఈ వేడుకలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ధనుష్ తనకు తమిళ్ మాత్రమే వచ్చు అని, తెలుగు సరిగ్గా రాదని చెప్పడంతో.. వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మైక్ అందుకొని తెలుగులోకి అనుదించడం మొదలుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంత పెద్ద దర్శకుడు అయ్యుండి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆయన అలా అనువదించడానికి ముందుకు రావడం అభినందనీయం. ధనుష్ తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించడం, మధ్య మధ్యలో త్రివిక్రమ్ తెలుగు పదాలు అందించడం చూడటానికి ఎంతో అందంగా అనిపించింది.

చిత్ర కథానాయకుడు ధనుష్ మాట్లాడుతూ..” 2002 లో నా మొదటి సినిమా విడుదలైంది. ఇప్పుడు 2023 లో నా మొదటి తెలుగు సినిమా విడుదలవుతోంది. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. ఇప్పుడు కూడా నాకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఇది అద్భుతమైన ఎమోషన్స్, మెసేజ్ తో కూడిన సింపుల్ సినిమా. మేమొక అర్థవంతమైన సినిమా చేశాము. ప్రేక్షకులకు మాములుగా వాళ్ళ కథలతో ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఇది మీ అందరి కథ. దర్శకుడు వెంకీ గారికి, హీరోయిన్ సంయుక్త మీనన్, నిర్మాత వంశీ గారికి అందరికీ ధన్యవాదాలు. సాయి కుమార్ గారు ఇంటినుంచి భోజనం తెప్పించేవారు. త్రివిక్రమ్ గారు మొదటి నుంచి మాకిచ్చిన సపోర్ట్ కి ధన్యవాదాలు. యువరాజ్ గారు ప్రాజెక్ట్ కి పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించకపోయినప్పటికీ ఈ వేడుకకు వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు బిగ్ థాంక్స్. అఖండ సినిమాలో నీ వర్క్ చాలా నచ్చింది.” అన్నారు.

చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమా విజయం పట్ల మేం చాలా నమ్మకంగా ఉన్నాం. అందుకే ముందురోజే ప్రీమియర్లు వేయాలని నిర్ణయించుకున్నాం. ఆన్ లైన్ లో పెట్టిన కాసేపటికే ప్రీమియర్ షోల టికెట్లు బుక్ అవ్వడం చూశాక.. ఈ సినిమా మీద మేమెంత నమ్మకం పెట్టుకున్నామో, ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారని అర్థమైంది. ఈ సినిమా మిమ్మల్ని అసలు నిరాశపరచదు. ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది” అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “మేం సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. మాములుగా ప్రీమియర్లు వేయడానికి నిర్మాతలు ఇష్టపడరు. కానీ ఈ సినిమా ప్రీమియర్లు వేస్తున్నామంటే నిర్మాతకు మా సినిమా మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఇది తొలిప్రేమ తర్వాత నేను చాలా నమ్మకంగా ఉన్న సినిమా. ఇది ఒక వీకెండ్ మాత్రమే చూసే సినిమా కాదు.. కనీసం నాలుగు వీకెండ్ లు చూసే సినిమా. నేను నమ్మకంగా చెబుతున్నాను. ఈ సినిమా తెలుగులో కనీసం నాలుగు వారాలు, తమిళ్ లో కనీసం ఎనిమిది వారాలు ఆడుతుంది. నాకు మ్యాథ్స్ నేర్పిన మంజుల మేడంకి, నాకు క్రమశిక్షణ నేర్పిన రామ్మూర్తి సార్ కి ధన్యవాదాలు. అలాగే సినిమాల్లో నాకు దర్శకులు మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారు గురువులు. నేను వారి సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను.

నేను ఈరోజు ఇక్కడ ఉండటానికి కారణం త్రివిక్రమ్ గారు. సంయుక్త మీనన్, సాయి కుమార్ గారు, సముద్రఖని గారు, తనికెళ్ళ భరణి గారు, హైపర్ ఆదితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. డీవోపీ జె.యువరాజ్ గారు సినిమాకి లైఫ్ ని తీసుకొచ్చారు. జీవీ ప్రకాశ్ గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సుద్దాల అశోక్ తేజ గారు ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప పాట రాశారు. రామజోగయ్యశాస్త్రి, ప్రణవ్ చాగంటి అద్భుతమైన పాటలు రాశారు. ఈ సినిమా చేసే అవకాశమిచ్చిన ధనుష్ గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది. ధనుష్ గారు ఒక నాగస్వరం. ఎన్ని వాయిద్యాలు ప్లే అవుతున్నా.. ఒక్కసారి నాగస్వరం ప్లే అయితే.. మనకు నాగస్వరం మాత్రమే వినిపిస్తుంది. ధనుష్ గారు ఒక నాగస్వరం. ఆయన నటిస్తుంటే.. ఆయన ఒక్కడే కనిపిస్తాడు, ఆయన ఒక్కడే వినిపిస్తాడు. అలాంటి నటుడితో సినిమా చేసే అవకాశం రావడం గర్వంగా ఉంది.” అన్నారు.

చిత్ర కథానాయిక సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. “ఒక సినిమా విజయం సాధించాలంటే అందరి కృషి ఉండాలి. ప్రివ్యూ చూశాక మా టీమ్ అందరి కాన్ఫిడెన్స్ చూసి, నా కాన్ఫిడెన్స్ రెట్టింపు అయింది. ముఖ్యంగా నిర్మాత వంశీ గారు ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శక నిర్మాతలకు, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు” అన్నారు.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావడం చాలా సంతోషంగా ఉంది. కొద్దిరోజులుగా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు అందరూ కర్చీఫ్ లు తీసుకెళ్లండి. ఖచ్చితంగా ఈ సినిమా చూసి కంటతడితో బయటకు వస్తారు. నిర్మాత వంశీ గారు ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలని తాపత్రయపడుతుంటారు. ఈ సినిమా దర్శకుడు వెంకీతోపాటు ఈ సినిమాకి పని చేసిన అందరికీ గౌరవాన్ని తీసుకొస్తుంది. నా అభిమాన నటుల్లో ధనుష్ ఒకరు. ఈ సినిమా ఆయనకు ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. సంగీత దర్శకుడు జీవీ ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేశాడు. నా గత ఐదేళ్ల ప్రయాణాన్ని ఇంత అద్భుతంగా మార్చిన త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు” అన్నారు.

ప్రముఖ నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ.. “నటుడిగా నాకిది 50వ సంవత్సరం. నా విజయానికి కారకులు నా తల్లితండ్రులు, నా గురువులు. గురువుకి పట్టాభిషేకం చేస్తున్న ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ సార్ లో నటించడం మా అందరి అదృష్టం. ఇందులో అద్భుతమైన పాత్ర పోషించాను. ధనుష్ సెట్ లో చాలా కూల్ గా, సరదాగా ఉంటాడు. అప్పటిదాకా సరదాగా ఉండి, షాట్ మొదలవ్వగానే ఒక్కసారిగా పాత్రలోకి వెళ్ళిపోతాడు. చాలా అద్భుతమైన నటుడు ధనుష్. దర్శకుడు వెంకీ అట్లూరి కూడా కూల్ గా ఉంటాడు. ఏం చేయాలి, నటుల నుంచి ఎంత రాబట్టుకోవాలి అని స్పష్టంగా తెలిసిన దర్శకుడు. ఇది మంచి సందేశంతో పాటు వినోదంతో కూడిన సినిమా. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ముఖ్యంగా ప్రతి విద్యార్ధి, ప్రతి గురువు చూడాల్సిన సినిమా” అన్నారు.

సముద్రఖని మాట్లాడుతూ.. “ఇలాంటి బాధ్యతగల సినిమా చేసిన వెంకీ అట్లూరి గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా సోదరుడు ధనుష్ తో కలిసి ఇంకా ఎన్నో సినిమాలలో నటించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత సంయుక్త కి ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. సితార సంస్థ నాకు పుట్టినిల్లు లాంటిది. వరుస అవకాశాలు ఇచ్చి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. వంశీ గారికి, రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు. త్రివిక్రమ్ గారి పేరు చెప్పడం నాకు మంత్రం చెప్పడం లాంటిది. నాకు మంచి పాజిటివ్ వైబ్ ఇచ్చారు.” అన్నారు.

నటుడు హైపర్ ఆది మాట్లాడుతూ..”సార్ సినిమా గురించి చెప్పాలంటే.. ఒక్క మంచి అరిటాకు వేసి, చుట్టూ మీకు నచ్చిన కూరలన్నీ వేసి, మధ్యలో వేడి వేడి అన్నం వేసి, అందులో కాస్త నెయ్యి వేసి.. తింటే ఇలాంటి భోజనం ఎక్కడా చేయలేదంటారు కదా. ఫిబ్రవరి 17న ఈ సినిమా చూశాక కూడా చాలా బాగుంది, ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదంటారు. అంత బాగుంటుంది సార్ సినిమా. ఈ సినిమా తర్వాత సంయుక్త మీ అందరి ఫేవరెట్ హీరోయిన్ల లిస్టులో చేరిపోతుంది. ధనుష్ గారి సినిమాలో నటించే అదృష్టాన్ని ఇచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి గారికి ధన్యవాదాలు. వెంకీ అట్లూరి ఈ చిత్రంతో ఖచ్చితంగా ఘన విజయం అందుకుంటారు. నిర్మాత నాగవంశీ గారు మంచితనం, మొండితనం కలిసిన నిజాయితీపరుడు. ముందు ముందు ఆయన ఆధ్వర్యంలో సితార సంస్థ ఇంకా ఎంతో ఉన్నతస్థాయికి వెళ్తుంది. నా ఆల్ టైం ఫేవరెట్ దర్శకుడు త్రివిక్రమ్ గారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవ్వడం సంతోషంగా ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలో కుటుంబ విలువలు ఉంటాయి. నాకు తెలిసి తెల్ల కాగితానికి పూర్తి న్యాయం చేయగల ఏకైక రచయిత త్రివిక్రమ్ గారు. ఆయనది భీమవరం, ఆయన సినీ పరిశ్రమకు రావడం మనందరికీ వరం” అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ జె.యువరాజ్ మాట్లాడుతూ..”ధనుష్ గారి లాంటి అద్భుతమైన నటుడి సినిమాకి పని చేయడం గర్వంగా ఉంది. దర్శకుడు కట్ చెప్పకుండా ఉంటే బాగుండు.. ఇంకా కొంచెంసేపు ధనుష్ గారి నటన చూడొచ్చు అనిపిస్తుంది. వెంకీ అట్లూరి గారు ఎంతో ప్రతిభ గల దర్శకుడు. చాలా కూల్ గా ఉంటారు. నాకు ఇంత మంచి అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు” అన్నారు.

గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. “ఈరోజుల్లో విద్య అనే ఇతివృత్తం మీద సినిమా తీయడం సాహసం. గొప్ప కథని ఎంచుకొని, దానికి ధనుష్ లాంటి స్టార్ ని తీసుకొని, ఇంత మంచి అవకాశాన్ని దర్శకుడు వెంకీ అట్లూరికి ఇచ్చిన నిర్మాతలు నాగవంశీ గారిని, సాయి సౌజన్య గారిని అభినందించాలి. ఇందులో నేను ‘మాస్టారు మాస్టారు’, ‘మారాజయ్య’ అనే రెండు పాటలు రాశాను. వెంకీ అట్లూరి చాలా కూల్ గా ఉంటాడు. ఎలాంటి నొప్పి తెలియకుండా, ఆడుతూ పాడుతూ పని చేయించుకొని మంచి అవుట్ పుట్ రాబట్టుకుంటాడు. తన సంగీతంతో మనల్ని ఎంతగానో అలరించే జీవీ ప్రకాశ్ ఎప్పటిలాగే ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలను అందించారు. ఇదొక మంచి ఉద్దేశంతో రూపొందిన సినిమా. ఇలాంటి మంచి సినిమాలను ఆదరించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఫిబ్రవరి 17న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ధనుష్ సినిమాలలోని సూపర్ హిట్ పాటలకు చిట్టి మాస్టర్ బృందం చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ వెంకట్, డీవోపీ జె.యువరాజ్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, ప్రణవ్ చాగంటి, గాయని శ్వేతా మోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News