భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని బేతాళపాడు గ్రామ సమీపంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 38 మంది కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటో బ్రిడ్జి పైనుండి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 30 మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒకరిని వరంగల్, మరొకరిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… మండలంలోని చీపురుగూడెం, టాక్యాతండా, ఏలకలొడ్డు, బాడవపోలు గ్రామాలకు చెందిన 36 మంది కూలీలు ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలం, రాజుపాలెంలోని ఓ రైతుకు చెందిన మొక్కజొన్న కంకులు కోసేందుకు ట్రాలీ ఆటోలో ఉదయాన్నే బయలు దేరారు. ఈ క్రమంలో బేతాళపాడు పెద్దవాగు సమీపంలోని బ్రిడ్జి పైన ఉన్న గుంతలో ట్రాలీ ముందు టైరు ఢీకొనడంతో టైరు గాలిపోయి వాహనం అదుపు తప్పి వాగులోకి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో చౌడం శేఖర్, చౌడం లక్ష్మీణారాయణ, వజ్జా పగడయ్య, వజ్జా సత్యం, వజ్జా నర్సింహారావు, వజ్జా రమేష్, వజ్జా వసంత్, బొర్రా రాఘవులు, భానోత్ కుమార్, బట్టు సాయి, బచ్చల అజయ్, భానోత్ బిక్కు, భానోత్ సురేష్, మాళోత్ రాము, మాకోత్ లక్ష్మణ్, బట్టు నర్సింహారావు, బట్టు నవీన్, బచ్చల సుధాకర్, బచ్చల క్రిష్ణ, బార్ల రోహిత్, కొడెం వెంకటేశ్వర్లు, బోగం వీరేందర్, బొర్రా రాజు, గుగులోత్ వెంకటేశ్వర్లుతో పాటు మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో సోడెం శేఖర్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరగంల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించచారు. భానోత్ సురేష్‌ను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాధావత్ రవి పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి 108లో తరలించారు. కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బిఆర్‌ఎస్ వైరా నియోజకవర్గ నాయకులు లాకావత్ గిరిబాబు, జిల్లా కబడ్డీ అసోషియేషన్ ఉపాధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి, సిపిఐ ఎంఎల్ నాయకుడు ధర్మా పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.