ప్రయాణికులను పట్టించుకోని ఆర్టిసి డ్రైవర్లు
రాత్రి సమయాల్లో బస్టాపుల్లో ఆగని బస్సులు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
హైదరాబాద్: ఆర్‌టిసిలో సమ్మెలు, కరోనా కష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టిసి ఉన్నతాధికారులు ఆదాయాన్ని పెంచేందుకు అనేక ప్రణాళికలు అమలు చేస్తుంటే ఇవేమీ పట్టని కొంత మంది డ్రైవర్లు,కండక్టర్లు ప్రయాణికుల పట్ల నిర్లక్షంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హకీంపేట ట్రాన్స్‌పోర్టు అకాడమీలో డ్రైవర్లకు, కండక్టర్ల ఉత్తమశిక్షణ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే అధికారులు ఆర్టిసికి ఆధాయాన్ని తెచ్చిపెట్టే ప్రయాణికులు పట్ల విధంగా మెలగాలో శిక్షణ ఇవ్వలేదా ? అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.ఆర్టిసిలో కొంత మంది డ్రైవర్లకు ముందు చూపే కాని వెనుక చూపు ఉండటం లేదు.కొంత మంది డ్రైవర్లు బస్టాపుల్లో బస్సులు ఆపకుండా పోతుంటే మరి కొంత మంది తమ బస్సులను బస్టాపుల్లో ఆపినప్పుడు వెనక డోర్ నుంచి ప్రయాణికులు ఎక్కుతున్నా దిగుతున్నా పట్టించు కోకుండా ముందుకు పోతుండటంతో ప్రయాణికులు తరచు గాయాలు పడుతుండగా మరి కొందరు తమ విలువైన ప్రాణాలను కొల్పోతున్నారు.
వెనక డోర్ నుంచి ప్రయాణికుల ఎక్కుతున్నారా లేదా అనే పరిశీలించేందుకు డ్రైవర్‌కు ఎడమై వైపును రేర్ వ్యూ మిర్రర్ అద్దం ఉంటుంది. దాని ద్వారా వెనుక డోర్ గుండా బస్సు ప్రయాణికులు బస్సు ఎక్కుతున్నారా లేదా అనేది పరిశీలించ వచ్చు. కాని వారు ఇవి ఏమీ పట్టించుకోక పోవడంతో అది నామమాత్రంగా మారింది. మరి కొంత మంది డ్రైవర్లు బస్టాపుల్లో ఆపకుండా పోతుండటంతో మరో బస్సు వచ్చే వరకు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొన్ని సందర్భాల్లో డ్రైవర్లకు కండక్టర్లకు సమన్వయం లేక పోవడంతో కూడా ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. వెనుక భాగంలో ప్రయాణికులు బస్సులు దిగుతున్నారా ? ఎక్కుతున్నారా? అని అంశాలను సంబంధిత కండక్టర్లు పట్టించు కోకుండా రైట్… రైట్ అనడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
సెట్విన్ బస్సులు బస్టాపులో ఒక్క ప్రయాకుడు ఉన్నా వారిని ఎక్కించుకుని తన ఆదాయ మార్గాన్ని పెంచుకుంటుంటే ఆర్టిసి డ్రైవర్లు మాత్రం బస్టాపుల్లో ప్రయాణికులు ఉన్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి సమస్యలు రాత్రి సమయాల్లో ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో అధికంగా ఉంటున్నాయి.దీంతో ప్రయాణికులు ప్రైవేట్ రవాణా వ్యవస్థను ఎన్నుకోవడంతో ఆర్టిసి నష్టాల బారిన పడుతోంది. బస్సులకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రయాణికులను పట్టించు కోకుండా ముందుకు వెళితే ఏలా అని వారు ప్రశిస్తున్నారు. ఏది ఏమైన అధికారులు ఇటువంటి అంశాలపై ప్రత్యేక దృష్టి ప్రతి బస్టాపుల్లో బస్సులు ఆగి విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేక పోతే ప్రయాణికులు ప్రైవేట్ రవాణా పట్ల మొగ్గుచూపు చూపితే ఆర్టిసి మరింత నష్టాల బారిన పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.