Wednesday, January 22, 2025

రాష్ట్రం కోసం త్యాగం చేసిన వీరుడు

- Advertisement -
- Advertisement -

నెత్తురుబొట్టు రాలకుండా, ప్రాణత్యాగం లేకుండా ఏ ప్రజా ఉద్యమం విజయం సాధించిన ఆనవాళ్లు లేవని చరిత్ర చెప్తున్నది. తెలంగాణ ఉద్యమాల కార్ఖాన, పోరాటాల ఖిల్లా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో వీరులు తమ రక్తాన్ని ధారపోస్తే తెలంగాణ కల సాకారమైంది. త్యాగాల పునాదుల మీద ఈ తెలంగాణ ఏర్పడ్డది. తొలి దశ ఉద్యమంలో 369 మంది ప్రాణాలు అర్పిస్తే, మలి దశ ఉద్యమంలో 1200 పైగా అమరులయ్యారు. మనం అమరుల భుజాలపై నిలబడి ప్రత్యేక తెలంగాణ శ్వాస పీలుస్తున్నాం. మలి దశ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతచారి (ఆగస్ట్టు 15, 1986 డిసెంబర్ 3, 2009). 3 డిసెంబర్ 2009 తెలంగాణ అంతటా విషాద ఛాయలు. పాట మూగపోయింది, గజ్జె కునుకు తీసింది. డప్పు మోగనంది. భవిష్యత్ తెలంగాణ యువ కిషోరం దివికేగి తెలంగాణ ఉద్యమానికి వెలుగుదారి చూపిండు. ప్రతీ తల్లి బిడ్డ శోకం పెట్టిండ్రు. తల్లి తెలంగాణ వలవల ఏడ్చింది. ఆ వీరున్ని గన్న అమ్మ నాయినాల దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోయింది.

కరకర పొడిచే పొద్దును చీల్చుకుంటూ పొడిచేడు గ్రామంలో కాసోజు వెంకటాచారి, శంకరమ్మ దంపతుల పెద్ద కొడుకుగా 1986 ఆగస్టు15న శ్రీకాంతచారి జన్మించాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన వీరిది మధ్య తరగతి కుటుంబం. శ్రీకాంతచారికి రవీంద్రాచారి అనే తమ్ముడు ఉన్నాడు. తండ్రి వెంకటాచారి వ్యవసాయంతో పాటు వృత్తి పనులు చేసేవాడు. శ్రీకాంతచారి అందరి పిల్లలలెక్కనే ఆడుతూపాడుతూ, మస్తు హుషారుగా ఉండేటోడు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు పుట్టడంతో దోస్తులు నువ్వు అదృష్టవంతుడివి మనకు స్వాతంత్య్రం రోజు పుట్టినవ్ అని అనే సరికి ఆ రోజు ప్రత్యేకత తెలుసుకునే సందర్భంలో భగత్ సింగ్, అంబేడ్కర్, చంద్రబోస్ ఇలా ఎందరో యోధుల చరిత్ర చదివి స్ఫూర్తి పొందా డు. అందులోనూ నల్గొండ జిల్లాలో సాయుధ పోరాట ఉద్యమ నేపథ్యం ఉండటంతో ఆ వీరుల జీవితాలు తొందరగా వంటపట్టాయి. శ్రీకాంతచారి ఎవరు సాయం కావాలన్నా కాదనేవాడు కాదు. సమాజ సేవలో ఎప్పుడు ముందు వుంటూ, ఎల్లప్పుడూ సమాజం హితం కోసం తపించేవాడు.

తాను దాచుకున్న డబ్బును పేదలు, స్నేహితుల కోసం ఖర్చు చేసేవాడు. ప్రాథమిక విద్యను మోత్కూరు, నకిరేకల్ గ్రామాల్లో అభ్యసించిన శ్రీకాంత్ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వెళ్ళాడు. ఈ క్రమంలోనే తెలంగాణ స్థితిగతులను అధ్యయనం చేశాడు. తోటి విద్యార్థులకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను చెప్తుండేవాడు. ఇలా శ్రీకాంతచారి విద్యార్థి నాయకుడిగా చురుకైన పాత్ర పోషించాడు. తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను ముందుండి నడిపేవాడు. సెలవుల్లో ఇంటికి వెళ్లినా.. తెలంగాణ ధ్యాసే తెలంగాణ పాటలు పాడటంతో పాటు కవితలు రాస్తూ, గ్రామస్థులను చైతన్య పరిచేవాడు. ఒకసారి వెంకటచారి శ్రీకాంతచారి గురించి చెప్తూ ‘ఎందుకు బిడ్డ, మంచిగా సదువుకొక రోజులు మంచిగా లేవు. ఈ ఉద్యమాలు మనకు వద్దు, కేసులు అయితై, పోలీసులు పట్కపోతరు. నీ సదువు ఏదో నువ్వు సదువు. ఎట్లా అయ్యేది ఉంటే గట్ల అయితది..’ అంటే ‘అట్ల కాదు బాపు. ఎవ్వరూ మనకెంది అంటే ఎట్లా చెప్పు.. మన దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో పోరాటం చేశారు, వారు కూడా మకెంది అనుకుంటే మనం ఇయ్యాల ఇట్ల ఉందుమ.. అంటూ భగత్ సింగ్ గురించి చెప్పిండు’ అంటూ కన్నీరు పెట్టుకుండు వెంకటాచారి..

అప్పుడప్పుడే స్వరాష్ట్ర ఆకాంక్ష, మలిదశ ఉద్యమం ప్రతి బిడ్డకు చేరుతోన్న రోజులు. 2009 నవంబర్ 29న కెసిఆర్ ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు మీడియా ద్వారా చెప్పిండు. కరీంనగర్ నుంచి సిద్దిపేట దీక్షస్థలికి పోతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ అంతటా ఆందోళనలు, ఉద్యమాలు, నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లింది. నిరసనలు ఉధృతమయ్యాయి. తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం అణచివేత కొనసాగించడం ప్రారంభించింది. ఉద్యమకారులపై లాఠీ దెబ్బలు, అరెస్టులను చూసి శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. ఆ ఉద్వేగంతో, మరుగతున్న రక్తంతో, ఆత్మగౌరవం కోసం కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన చావుతోనైనా ఈ ప్రభుత్వంలో చలనం తేవాలనుకున్నడు. తన శరీరంలో అణువణువు తెలంగాణ కోసం తపించే శ్రీకాంతచారి 2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్ సర్కిల్ల్లో కెసిఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో పాల్గొన్న శ్రీకాంత్ ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ మంటలు సైతం సలం కొట్టేలా మంటలు చెలరేగుతుంటే అగ్నికి ఆహుతి అవుతూ..

“జై తెలంగాణ” అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించాడు. తమ రాష్ట్రానికి న్యాయం చేయమంటూ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆకాలిన గాయాలతో వేడుకున్నడు. అక్కన్నే వున్న పోలీస్ సిబ్బంది, తోటి ఉద్యమకారులు వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసి కామినేని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం యశోదకు, రెండు రోజుల తర్వాత ఉస్మానియాకు తీసుకెళ్లారు. ఆ తర్వాత చివరగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3న రాత్రి తెలంగాణకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ కూడా తెలంగాణ నినాదాన్ని వదలలేదు. బతికితే తెలంగాణ కోసం మళ్లీ చావడానికైనా సిద్ధమంటూ నినదించాడు. ఒకవేళ నేను చచ్చినా తెలంగాణ రాకపోతే మళ్లీ జన్మించి మళ్లీమళ్ళీ ప్రాణత్యాగం చేస్తా అని పిడికిలి బిగించి కన్నుమూశాడు. శ్రీకాంతచారి మంటల్లో కాలుతున్న దృశ్యాన్ని టివిల్లో చూసిన తెలంగాణ ప్రజల గుండెలు రగిలాయి.

శ్రీకాంతచారి గుండె ధైర్యానికి మృత్యువు కూడా కన్నీరు కార్చింది. శ్రీకాంతచారి ఆత్మబలి దానం తెలంగాణ ప్రజానీకాన్ని కదిలించింది. యావత్ తెలంగాణ విద్యార్థులు, రైతులు, కార్మికులు, ఇలా సకల జనులు కదం తొక్కారు.. ఆ అమరుడు చూపెట్టిన దారిలో పోరాటాలు చేసి వారి ప్రాణాల్ని సైతం అర్పించి. అమరులు ఉడుకుతున్న తమ గుండెల్ని తీసి మన చేతిలో పెట్టి, భవిష్యత్ తరాలకు ఉద్యమ స్ఫూర్తిని పంచి, వారు కలలుగన్నా తెలంగాణ సాకారం అయిందా అని పైనుంచి చూస్తున్నారు…!? జోహార్ శ్రీకాంతచారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News