Friday, November 22, 2024

గుజరాతీలో ప్రశ్నిస్తే…ఉర్దూలో సమాధానం…వాహ్!

- Advertisement -
- Advertisement -

KCR vs Modi

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) కొన్ని ప్రశ్నలు వేసింది. కాగా బిజెపి దానికి బదులు ఉర్దూలో ఇచ్చింది. రాజకీయ హీట్ కాస్తా భాషా హీటయిందా అనిపిస్తోంది. మొదట హైదరాబాద్‌లో పోస్టర్లు/ఫ్లెక్సీల వైరం రాజుకుంది. తర్వాత ఇప్పుడేమో రెండు పార్టీల మధ్య భాషాపరమైన పోరు మొదలయింది. ప్రధాని మోడీని టిఆర్‌ఎస్ గుజరాతీలో టార్గెట్ చేస్తూ ప్రశ్నలు వేసింది. టిఆర్‌ఎస్ పార్టీకి ఏఐఎంఐఎంతో పొత్తు ఉన్నందున బిజెపి ప్రతిగా ఉర్దూలో జవాబిచ్చింది. ఏది ఏమైనప్పటికీ టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాను బేస్ చేసుకుని నిందించుకుంటున్నాయి. అయితే ఆ రెండు పార్టీలు మొదటిసారి వేరే భాషాల్లో ఒకదాన్ని మరొకటి విమర్శించుకోవడం ఇక్కడ విశేషం.
ప్రధాని మోడీకి టిఆర్‌ఎస్ తన అధికారిక సైట్ నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ తరఫున ఎనిమిది ప్రశ్నలు సంధించింది. ‘మీరు మీ భాషలో అయితే బాగా అర్థం చేసుకుంటారని’ అంటూ గుజరాతీలో ప్రశ్నల వర్షం కురిపించింది. ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, తెలంగాణ విషయంలో సవతి తల్లి వైఖరి వంటివి ప్రశ్నించింది. దానికి బిజెపి స్పందించింది. టిఆర్‌ఎస్‌కు మజ్లీస్ పార్టీకి మధ్య ఉన్న పొత్తును దృష్టిలో పెట్టుకుని ఉర్దూ బాషలో 13 టిఆర్‌ఎస్ ప్రభుత్వ అపజయాలను ఎలుగెత్తింది. వాటిలో రైతుల ఆత్మహత్యలు, నెరవేరని బంగారు తెలంగాణ స్వప్నం, అప్పులు వంటివి హైలైట్ చేసింది. “మా మైనారిటీ మోర్చా ఉర్దూలో ప్రతిస్పందించింది. వారి గుజరాతీ ట్వీట్‌కు తగు విధంగా ప్రతిస్పందించింది” అని బిజెపి పార్టీ నాయకుడొకరన్నారు.
రెండు పార్టీలు హ్యాష్ ట్యాగ్‌లో కౌంటర్లు ఇచ్చుకున్నాయి. బిజెపి ‘మోడీ ఆగయా, కెసిఆర్ డర్‌గయా’ అని, ‘సాలుదొర’ అంటూ ఎత్తిపొడిచింది. కాగా టిఆర్‌ఎస్ ‘బైబై మోడీ’, ‘బిజెపి సర్కస్ మోడీ’, ‘మోడీ జవాబివ్వు’ అంటూ సోషల్ మీడియాలో బాహాబాహికి దిగాయి. “ఎత్తిపొడుపులు కొన్ని సందర్భాల్లో విపరీతంగానే ఉన్నాయి. ఎన్నికలు దగ్గరికొచ్చే కొద్దీ ఈ సోషల్ మీడియా పోరు మరింత రాజుకునేలా ఉంది’ అని రాజకీయ విశ్లేషకుడు ఎస్. రామకృష్ణ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News