Saturday, November 16, 2024

కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టింది టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు జీవం పోసింది కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించాం
కేంద్ర మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర కెసిఆర్‌ది
పార్టీలు మారిన చరిత్ర మీది
నెపాలు పెట్టి, బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి
కాంగ్రెస్‌పై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టింది టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు జీవం పోసింది కెసిఆర్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు కాంగ్రెస్ సభ్యులను ఉద్ధేశించి పేర్కొన్నారు. శాసనసభ్యుడు కాకుండా తనను మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని సిఎం రేవంత్ మాట్లాడడంపై హరీష్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మొదటగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీష్‌రావు ధీటైన సమాధానమివ్వడంతో సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిందే టిఆర్‌ఎస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఉత్తిగనే తమకు పదవులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కెసిఆర్
చంద్రబాబు హయాంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కెసిఆర్ అని, ఆ రోజుల్లో ప్రణబ్ ముఖర్జీతో హిమాచల్ భవన్‌లో చర్చలు జరిగినప్పుడు వెంకటస్వామి, మాజీ ఎంపి సురేందర్ రెడ్డి, కెసిఆర్, ఆలే నరేంద్ర తాను ఆ చర్చల్లో పాల్గొన్నానని ఆయన తెలిపారు. పొత్తుల చర్చలు జరిగినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని కెసిఆర్ అన్నారని హరీష్‌రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకుపో అని ప్రణబ్ తమతో పేర్కొన్నారని హరీష్‌రావు తెలిపారు. తాము పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మీరు ఏదో గెలిస్తే మాకు పదవులు ఇవ్వలేదని, మేం కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించామని హరీశ్‌రావు తెలిపారు.
సోనియా గాంధీ కెసిఆర్‌ను కేంద్రమంత్రి వర్గంలో చేరాలని…
కెసిఆర్‌ను ఎంపి చేశామని కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారు. ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా అధ్యక్షతన యూపిఏ సమావేశం జరిగింది. సోనియా గాంధీ కెసిఆర్‌ను కేంద్ర మంత్రి వర్గంలో చేరాలని కోరారు. కానీ, కెసిఆర్ ఒక మాట చెప్పారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో తెలంగాణ అంశాన్ని పెడితేనే తాను కేబినెట్‌లో చేరుతానన్నారు. తాను పదవుల కోసం రాలేదు. తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చానని కెసిఆర్ చెప్పారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో పెట్టించి, నాటి ఉభయసభలను ఉద్దేశించి చేసిన రాష్ట్రపతి ప్రసంగంలో సంప్రదింపుల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయిస్తామని చెప్పించింది కెసిఆర్ అని హరీష్‌రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. షిప్పింగ్ పోర్ట్ ఫోలియో ఇస్తే డిఎంకే పార్టీ తమకు ఆ శాఖ ఇవ్వాలని, లేదంటే యూపిఏ నుంచి బయటకు పోతామని చెబితే ఈ పోర్ట్ పోలియో తమకు అవసరం లేదని, తాను తెలంగాణ కోసం వచ్చానని కేంద్ర మంత్రి పదవిని స్వచ్ఛందంగా వదులుకున్న చరిత్ర కెసిఆర్ దని హరీష్‌రావు గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి మొదటగా ఏబివిపిలో పనిచేసి…
పదవులను గడ్డి పోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే అది కెసిఆర్, టిఆర్‌ఎస్ పార్టీకి ఉందని హరీష్‌రావు తెలిపారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉందని, తాము ఏదో పదవుల కోసం పాకులాడినం అన్నట్టు సిఎం మాట్లాడడం సరికాదని హరీష్‌రావు పేర్కొన్నారు. ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి మొదటగా ఏబివిపిలో పనిచేసి టిఆర్‌ఎస్‌లో పని చేసి, తెలుగుదేశంలో చేరారని, అనంతరం కాంగ్రెస్‌లో ఉన్నారని, మరి రేపు యేడ ఉంటాడో తెలియదని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి. కానీ, మాకు అట్లాంటిది ఏం లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
సభను తప్పుదోవ పట్టించే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
ఈ సభను తప్పుదోవ పట్టించే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. సిఎం మాట్లాడుతూ పోతిరెడ్డి ప్రాజెక్టుపై మా నాయకులే కొట్లాడారని, రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ఉన్న మంత్రులు మాట్లాడలేదని ఆయన అన్నారు. దాని మీద వీలైతే చర్చ పెట్టండి. సభ రికార్డులు తీసి బయటపెట్టింది. వీడియో ఫుటేజీ కూడా సభలో ఉంటుంది. అది కూడా బయటపెట్టండి. అన్ని విషయాలు బయటపెడితే దాని మీద తాను చర్చకు సిద్ధమని హరీష్‌రావు పేర్కొన్నారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో ఆరుగురు మంత్రులు ఉన్నాం. 14 నెలలకే రాజీనామా చేశాం. ఆరు కారణాలు చెప్పి రాజీనామాలు చేశామని హరీష్‌రావు తెలిపారు.
అప్పట్లో ఆరు కారణాలతో రాజీనామా చేశాం
అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క కొట్టి మా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను రాయలసీమకు తరలించుకుపోతున్నందుకు నిరసనగా, ఈ కేబినెట్ నుంచి మేం వైదొలగుతున్నామని, తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు మళ్లించే పులిచింతల ప్రాజెక్టును ఆపకపోవడం వల్ల కేబినెట్‌కు రాజీనామా చేస్తున్నామని చెప్పామని హరీష్‌రావు పేర్కొన్నారు. 610 జీఓను అమలు చేయడం వల్ల నిర్లక్ష్యం కారణంగా, తమ తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు దక్కే విషయంలో మాట తప్పుతున్నందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నామని చెప్పామని, నక్సలైట్లతో చర్చల పేరిట ఫేక్ ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నరు అని చెప్పి రాజీనామా చేస్తున్నామని చెప్పామని, ఇలా ఆరు కారణాలు ఇదే సభలో, బయట చెప్పి మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయాన్ని సిఎం దృష్టికి తీసుకువస్తున్నాను అని హరీశ్‌రావు వివరణ ఇచ్చారు.
45 రోజులు నిరసన వ్యక్తం చేశాం
ఇదే సభలో అదే పోడియంలో తాను పద్మారావు గౌడ్ కలిసి పోతిరెడ్డిపాడును ఆపాలని 45 రోజులు నిరసన వ్యక్తం చేశాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క పిజేఆర్ మాత్రమే కొట్లాడారు. ఆ రోజు మంత్రులుగా ఉన్న చాలా మంది పెదవులు మూసుకుని ఇక్కడ కూర్చున్నారు. ఆ రోజు మాతో గొంతు కలిపింది పిజెఆర్ మాత్రమే. ఆ పిజెఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాతోనే ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు.
మాపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుపై ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు లేచి నన్ను గెలికే ప్రయత్నం చేసిండు, లేకపోతే ఆయన గురించి మాట్లాడే అవసరం నాకు లేదు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఇదే సభలో మాట్లాడుతూ నీ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను పో అన్నప్పుడు, పేగులు తెగేదాకా కొట్లాడిందేవరు, పెదవులు మూసుకున్నదేవరో రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. ఇక్కడున్న వారిలో చాలా మంది ఆరోజు ఉన్నారు. ఆ రోజు మేం పేగులు తెగేదాకా పోడియంలోకి వెళ్లి కొట్లాడినం. ఆ రోజు మీరు పెదవులు మూసుకున్నరు. ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దయయేసి మా మీద విమర్శలు మానండి. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో ఆలోచించండి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇస్తున్నాం. కానీ, నెపాలు పెట్టి, బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి. పరిపాలన మీద దృష్టి పెట్టాలని మంత్రి శ్రీధర్‌బాబుకు హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News