హుజూరాబాద్‌లో మిగతా పార్టీలను ఠారెత్తిస్తోన్న టిఆర్‌ఎస్ ప్రచార హోరు
అభివృద్ధి, సంక్షేమం జంట మంత్రాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్న అధికార పార్టీ
దళితబంధు పథకానికి విశేష ఆదరణ దళితుల ఓట్లు గంపగుత్తగా టిఆర్‌ఎస్‌కు పడే అవకాశాలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటూ ప్రజలను ఆకర్షించే యత్నంలో బిజెపి
పిసిసి పీఠం చేపట్టిన తర్వాత తొలి సవాలుగా తీసుకున్న రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి మంత్రంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ పరుగులు పెడుతోంది. ప్రతిపక్ష పార్టీలకు అందనంత దూరంలో దూసుకపోతున్నది. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రత్యర్థి శిబిరంలో గుబులు రేపుతున్నది. టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, మంత్రులు నిమగ్నమై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గురించి ప్రధానంగా ఓటర్లకు వివరిస్తున్నారు. అలాగే వివిధ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇందులో సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. దళిత వర్గాలకు చెందిన ఓట్లు అన్నీ గంపగుత్తగా కారు గుర్తుకు పడే విధంగా వ్యూహాలను రచిస్తున్నారు. మరో వైపు బిజెపి కూడా అదే స్థాయిలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పిస్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అధికార టిఆర్‌ఎస్, బిజెపిలపై నిప్పులు కురిపిస్తూ ప్రచారాన్ని రోజురోజుకు ఉధృతం చేస్తున్నారు. ఇలా మూడు పార్టీలు ఎవరి వారు ప్రచారాన్ని రోజురోజుకు మరింతగా ముమ్మరం చేస్తున్నారు. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. గులాబీ పార్టీ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. పోలింగ్ నాటికి నియోజకవర్గంలోని ప్రతి ఇంటి తలుపుతట్టే విధంగా ప్రచార ప్రణాళిలను అమలు చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే పార్టీ అధిష్టానం పార్టీ శ్రేణులను ఆదేశించింది. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు కొద్ది రోజులుగా హుజురాబాద్‌లోనే మకాం వేసి పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం అనుక్షణం శ్రమిస్తున్నారు. మరోవైరు పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు కూడా ఎప్పటికప్పుడు తన వేగుల ద్వారా పార్టీ ప్రచార శైలితో పాటు ప్రత్యర్ధుల ప్రచారం, వారి కదలికలపై తెలుసుకుంటున్నారు. తదనుగుణంగా సరికొత్త ఎత్తగుడలను రచిస్తూ పార్టీ శ్రేణులను తగు ఆదేశాలను జారీ చేస్తున్నారు. అవసరమైతే ఒకటి, రెండు బహిరంగ సభల్లో తానే పాల్గొనాలనే విధంగా ప్రణాళికలను సైతం సిద్ధం చేయాలని ఇప్పటికే సిఎం కెసిఆర్ పార్టీ శ్రేణులకు తగు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు దసరా పండుగ తరువాత పార్టీ కార్యనిర్వహాక అధ్యక్షుడు కెటిఆర్ కూడా రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా సాగుతోంది.
కాగా బిజెపి కూడా ఈ స్థానంలో విజయం సాధించడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న సంకేతాలను రాష్ట్ర ప్రజలకు పంపించాలన్న కసితో ఆ పార్టీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విస్తృతంగా పాదయాత్రలు, ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనకు మద్దతుగా పార్టీ ఎంపిలు కూడా రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకునే నాలుగైదు రోజుల ముందు పలువురు కేంద్ర మంత్రులను ప్రచార పర్వంలోకి దించే విధంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. కాగా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా కెసిఆర్, టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని పెద్దఎత్తున ఆరోపణలను గుప్పిస్తోంది. ఈటల రాజేందర్ ప్రధానంగా ఆత్మగౌరవ నినాదాన్ని నమ్ముకుని ముందుకు సాగుతుండగా, అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలు..అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్న ఆశతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి ఓ అభివృద్ధి నివేదికను కూడా రూపొందిస్తోంది.
కాంగ్రెస్ సైతం హుజూరాబాద్ ఉపఎన్నికతో తిరిగి గాఢిన పడాలని ఉవ్విళ్లూరుతోంది. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిది కావడంతో రేవంత్‌కు ఈ ఉపఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. ఇందులో తన సత్తాను చాటుకుంటే తప్ప….తన ప్రతిష్టాను ఇనుమడింప చేసుకునే అవకాశం లేదన్న విషయం రేవంత్‌కు తెలియనిది కాదు. పైగా పిసిసి అధ్యక్ష పదవి కోసం ఎంతో మంది పోటీలో ఉన్నప్పటికీ పార్టీ హైకమాండ్ మాత్రం ఏరికోరి రేవంత్‌కే అప్పగించింది. ఈ నేపథ్యంలో హైకమాండ్ వద్ద తన పరపతిని పెంచుకునేందుకు ఈ సెగ్మెంట్‌లో విజయం సాధించాలన్న పట్టదలతో రేవంత్ ఉన్నారు. దీంతో ఈ ఎన్నిక కూడా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడుగులు వేస్తున్నారు.
వ్యూహా, ప్రతివ్యూహాల్లో నిమగ్నం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అభ్యర్ధి పక్షాన ఇప్పటికే రేవంత్‌రెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు, పార్టీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఎలు రంగంలోకి దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రధాన ఎజెండాగా చేసుకుని బిజెపి, టిఆప్‌ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పిస్తూ…ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలుగా యత్నిస్తోంది. ఇలా అటు అధికార టిఆర్‌ఎస్‌కు… ఇటు సిట్టింగ్ శాసనసభ్యుడు, బిజెపిఅభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఈ ఎలక్షన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారగా, కాంగ్రెస్ పార్టీ తిరిగి తన పూర్వవైభవాన్ని చాటుకునేందుకు తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలోనే అత్యంత హై ఓల్టేజీ ఎన్నికగా మారింది. ఇందులో ఏ పార్టీ విజయం సాధిస్తారన్నది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిగా మారింది.