Monday, December 23, 2024

టిఆర్‌ఎస్‌లో రాజ్యసభ ఎన్నికల వేడి

- Advertisement -
- Advertisement -

 

TRS Party Formation Day Celebrations

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉపఎన్నిక జరగనుంది. ఈ నేప్యథ్యంలో అధికార టిఆర్‌ఎస్‌లో అప్పుడే రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ముమ్మరంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న స్థానం నుంచి ఎవరికి రాజ్యసభ అవకాశం కల్పిస్తారన్నది… ప్రస్తుతం పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఢిల్లీ కేంద్రంగా సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడితే దేశంలో పెనుమార్పులు చోటుచేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల ఖాళీ అయిన ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు అప్పుడు పలువురు నేతలు సిఎం కెసిఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వారి ఆశీస్సులతో రాజ్యసభకు వెళ్ళాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ స్థానం నుంచి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై సిఎం కెసిఆర్ కూడా త్వరలోనే పార్టీలోని పలువురు ముఖ్య నేతలతో మంతనాలు జరపనున్నారని తెలుస్తోంది. ఆ సమావేశంలోనే పార్టీ అభ్యర్ధి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశముందని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

2018లో టిఆర్‌ఎస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన బండా ప్రకాశ్ ముదిరాజ్ గత ఏడాది నవంబర్‌లో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. దీంతో గత ఏడాది డిసెంబర్ 4న ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. దీంతో ఈ ఉపఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉపఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. వాస్తవానికి ఈ స్థానంతో పాటు టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి. శ్రీనివాస్ వచ్చే నెలలో తమ ఆరేళ్ల పదవీ కాల పరిమితి పూర్తి చేసుకుంటున్నారు. దీంతో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడతుందని అంతా భావించారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం కేవలం ఖాళీ అయిన బండా ప్రకాశ్ స్థానానికి మాత్రమే ఎన్నికను నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించింది. వచ్చే నెలలో మరో రెండు రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అవుతున్నా…. వాటి విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిల పదవి కాలం కూడా జూలై, ఆగస్టులో పూర్తి అవుతోంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని టిఆర్‌ఎస్ సర్కార్ ఢీ కొడుతోంది. ఇది మునుముందు మరింత ఉధృతంగా మారి మోడీ సర్కార్‌పై విజృభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రాజ్యసభలో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే సత్తాగల నేతకే….రాజ్యసభ స్థానాన్ని కల్పించాలని కెసిఆర్ భావిస్తున్నారు. అలాగే రాష్ట్ర విభజన సమస్యలు, కేంద్రం ఇచ్చిన హామీలు, పెండింగ్‌లో ఉన్న నిధులపై పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ పక్షాన మరింత బలంగా వాణిని వినిపించే సత్తా, రాజకీయ నేర్పరి గల నాయకుడినే సిఎం కెసిఆర్ ఎంపిక చేయనున్నారు.

రాజ్యసభలో రాష్ట్ర నుంచి మొత్తం ఏడుగురు సభ్యులకు ప్రాతినిధ్యం ఉండగా, మొత్తం మూడు సీట్లు ఖాళీ అవుతున్నాయి. కానీ ఎన్నికల సంఘం కేవలం ఉప ఎన్నికకు సంబంధించే షెడ్యూల్‌ను వెలువరించింది. ఈ నేపథ్యంలో ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు ఎన్నికలు జరిపే విషయంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది.

అయితే ఈ స్థానానికి పార్టీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కెప్టె న్ లక్ష్మీకాంతరావును వరుసగా మూడో పర్యాయం కూడా రాజ్యసభకు పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కని మాజీ ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మందా జగన్నాథం, ప్రొఫెసర్ సీతారామ్ నాయక్ కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఆశిస్తున్నారు.

అధికార పార్టీకి చెందిన దినపత్రిక అధినేత దామోదర్‌రావు, గతంలో ఇదే పత్రిక వ్యవస్థాపకుడైన రాజం పేర్లు కూడా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే మహారాష్ట్ర పర్యటనకు వచ్చిన నటుడు ప్రకాశ్‌రాజ్‌ను రాజ్యసభకు పంపేందుకు కూడా కెసిఆర్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం 119 మంది సభ్యులకుగాను టిఆర్‌ఎస్ సంఖ్యాపరంగా 103 మంది శాసనసభ్యుల బలాన్ని కలిగి ఉంది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతిపాదించిన ప్రతిపాదించిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News