కృష్ణా జలాలపై గాని మరేదైనా విషయంలోగాని టిఆర్‌ఎస్‌ది మడమ తిప్పని వైఖరి
కాంగ్రెస్, బిజెపిలదే రెండు నాలుకల ధోరణి
శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి మంత్రులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు
ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టిఆర్‌ఎస్‌నే గెలిపిస్తారు
ఎవరెన్ని చిల్లర మల్లర విమర్శలు చేసినా అభివృద్ధి ఆగదు
టిడిపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ, తదితరులు టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్న సందర్భంగా మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో కానీ, మరేదైనా విషయంలో కానీ రాజీ లేకుండా పోరాటం చేసేది ఒక్క టిఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కానీ ఈ వివాదంపై బిజెపి, కాంగ్రెస్ నాయకులు రెండు నాలుకల ధోరణితో వ్యవహారిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించి కొట్లాడేది టిఆర్‌ఎస్ పార్టీ మాత్రమే అని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. సోమవారం టిఆర్‌ఎస్ భవన్‌లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. అందులో భాగంగా రాష్ట్ర టిడిపి మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీ కండువాను కప్పుకున్నారు.
మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ఎల్.రమణ టిఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు కెటిఆర్‌తో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని నలుగురు కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఘట్‌కేసర్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు.
చిల్లర మల్లర విమర్శలు చేసినా అభివృద్ధి ఆగదు
అనంతరం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రాజకీయంగా చిల్లర మల్లర విమర్శలు చేసినా అభివృద్ధి ఆగదని ఆయన పేర్కొన్నారు. పదవులు రాగానే కుప్పిగంతులు వేస్తే సిఎం కెసిఆర్ ముందు అది చెల్లదన్నారు. రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ మనకు ఉన్నారన్నారు. సుదీర్ఘ కాలం టిడిపితో అనుబంధం ఉన్న ఎల్.రమణ టిఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నీటి వివాదంపై ద్వంద వైఖరి అవలంభిస్తోందని మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జవహర్‌నగర్ అభివృద్ధికి తప్పకుండా నిధులు కేటాయిస్తాం
మేడ్చల్ నియోజకవర్గంలోనే 10 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయని, ప్రజలందరి మద్ధతుతో మంత్రి మల్లారెడ్డి వాటిని గెలిపించుకున్నా రన్నారు. ప్రజల్లో పార్టీపై విశ్వాసం ఉండడం వల్లే గెలుపు సాధ్యమవుతుందన్నారు. అత్యంత ఎక్కువ సమస్యలు ఉన్న ప్రాంతం జవహర్ నగర్ అని, ఈ కార్పొరేషన్ అభివృద్ధికి తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని మంత్రి కెటిఆర్ హామినిచ్చారు. జిఓ నం. 58, 59 ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జవహర్ నగర్ ప్రజలు మంత్రి కెటిఆర్‌ను కోరారు. జవహర్‌నగర్ హెచ్‌ఎండిఏ పరిధిలో ఉన్నందున ఆ ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామని ఆయన తెలిపారు. ఈ సమస్యను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానని ఆయన హామినిచ్చారు. నగర శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డికి సూచించామని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలపై పూర్తి విశ్వాసం ఉంది
సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, అభివృద్ధి బాటలో పయనింపజేస్తున్నామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నామని ఆయన తెలిపారు. కరోనాను లెక్క చేయకుండా అభివృద్ధి ఫలాలు సామాన్యులకు అందించామన్నారు. ప్రతి పేద వ్యక్తికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎవరెన్నీ కుప్పిగంతులు వేసినా, కొన్ని పదవులు రాగానే కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రజలపై పూర్తి విశ్వాసం ఉందని, ఏ ఎన్నిక అయినా టిఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తున్నారన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని భావించి ఇతర పార్టీల నాయకులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.