Saturday, November 23, 2024

గులాబీమయం అయిన తెలంగాణ

- Advertisement -
- Advertisement -

ఘనంగా జరిగిన పార్టీ జెండా పండుగ
ప్రతి వీధి, బస్తీ, పట్టణాలు, ప్రధాన కూడళ్లలో ఎగిరన గులాబీ జెండాలు
పార్టీ శ్రేణుల్లో పెరిగిన మరింత జోష్

TRS Formation day celebrations

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం గులాబీమయం అయింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ప్రధాన కూడళ్లు, వీధులు,బస్తీలన్నీ ,కాలనీలన్నీ టిఆర్‌ఎస్ పార్టీ జెండాలతో కనిపించాయి. టిఆర్‌ఎస్ ఆవిర్భవించి రెండు దశాబ్ధాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు జెండా పండుగను సందర్భంగా పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పెద్దఎత్తున గులాబీ జెండాలను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ప్రజలకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచి పెట్టారు. ఊరు, వాడా అన్న తేడాలేకుండా ఈ కార్యక్రమం జరగడంతో పార్టీ శ్రేణుల్లో మరింత జోష్‌ను నింపింది.
నగరంలోని తెలంగాణ భవన్‌లో గులాబీ జెండానుపార్టీ సీనియర్ నేత పర్యాద కృష్ణమూర్తి ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిక్షణం ప్రజాహితం కోసం పరితపించే వ్యక్తి సిఎం కెసిఆర్ అని అని కొనియాడారు.అన్ని వర్గాలకు పెద్దఎత్తున సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గులాబీ జెండా రాష్ట్ర ప్రజలకు ప్రధాన అండ అని అన్నారు. అలాంటి జెండాను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఇరవై సంవత్సరాల క్రితం పార్టీ జలదృశంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ దాకా పోయిందన్నారు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
కాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో గులాబీ జెండా పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి కెసిఆర్ రావు భూమిపూజ నిర్వహించిన శుభ తరుణంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదేశాల మేరకు నగర పరిధిలోని అన్ని డివిజన్ లు, నియోజకవర్గాల పరిధిలో జెండా పండుగను ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. పలు నియోజక వర్గాల్లో మంత్రి తలసాని పార్టీ జెండాలను ఆవిష్కరించగా, మరికొన్ని నియోజక వర్గాల్లో స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముందుగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని సోమాజిగూడలో స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అంతకుముందు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేటలో జబ్బార్ కాంప్లెక్స్ వద్ద ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎంఎల్‌ఎ సాయన్న ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్నానగర్‌లో, అంబర్ పేట ఎంఎల్‌ఎ కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పటేల్ నగర్ చౌరస్తాలో జెండాను ఎగుర వేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుడు ముఠా గోపాల్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని రాంనగర్ చౌరస్తాలో, కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని గుడిమల్కాపూర్ లో నియోజకవర్గ ఇంచార్జి జీవన్ సింగ్, నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని మెహదిపట్నంలో నియోజకవర్గ ఇంచార్జి ఆనంద్ గౌడ్, ఎంఎల్‌సి ప్రభాకర్‌ల ఆధ్వర్యంలో జెండా పండగ జరిగింది. అలాగే జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నియోజకవర్గ పరిధిలోని బొరబండ చౌరస్తాలో నిర్వహించిన జెండా పండుగ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన జెండా పండుగలో ఎంఎల్‌ఎ కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి హాజరయ్యారు. అలాగేవరంగల్ జిల్లాలో జెండా పండుగ ఘనంగా జరిగింది. నర్సంపేట పట్టణంలో జెండాను స్థానిక ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ఎగురవేశారు.

పార్టీ శ్రేణులకు కెటిఆర్ ధన్యవాదాలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం లో పెద్ద ఎత్తున జెండా పండుగను విజయవంతం చేసిన టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ఆదేశాల మేరకు గురువారం నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమాలు ప్రారంభించుకున్నామన్నారు. ఇదే రోజున నిర్వహించిన జెండా పండుగ మాదిరే, పార్టీ నిర్ణయించిన గడువులోగా పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కెటిఆర్ సూచించారు. పార్టీ యంత్రాంగం మొత్తం వార్డ్, మండల, పట్టణ కమిటీల నియమించుకునే ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News