మనతెలంగాణ/సిటీబ్యూరో: రెండు ఎంఎల్‌సి స్థానాలకు మొత్తం 67 నామినేషన్లు వచ్చాయి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి 38 దరఖాస్తులు రాగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి 29 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గానికి బిజెపి నుంచి జి. ప్రేమెందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్ నామినేషన్ వేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ పోటా పోటీగా నామినేషన్లు వేయడంతో జిహెచ్‌ఎంసి కార్యాలయం పూర్తిగా రాజకీయ సందడిగా మారింది. వివిధ పార్టీల శ్రేణులు భారీ ర్యాలీలుగా తరలివచ్చారు. స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీ సంఖ్యలో నామినేషనున్ల దాఖలు చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా సురభి వాణి దేవి నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి అభ్యర్థి ఎన్.రామచంద్రరావు, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి. చిన్నారెడ్డి తరుపున ఎంపి రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు.
అదేవిధంగా సామల వేణు హర్షవర్దన్‌రెడ్డి తదితరులతో కలిపి సోమవారం 47 సెట్లు నామినేషన్లు వేయగా ఇప్పటీ వరకు మొత్తం 90 నామినేషన్లు దాఖలైయ్యాయి. నామినేషన్లు వేసేందుకు అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో రావడంతో జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మంత్రులతో కలిసివచ్చిన వాణి దేవి…
టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణి దేవి సోమవారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సి.హెచ్. మల్లారెడ్డి, మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, హనుమంతరావులతో పాటు భారీ సంఖ్యలో టిఆర్‌ఎస్ శ్రేణులు తరలివచ్చారు. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలాకు సురభి వాణిదేవి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు నామినేషన్‌ను సమర్పించారు.
భారీ ర్యాలీగా ఎన్.రామచంద్రరావు…
బిజెపి అభ్యర్థి ఎన్.రామచంద్రరావు భారీ ర్యాలీతో వచ్చిన తన నామినేషన్ సమర్పించారు. బర్కత్‌పురలోని బిజెపి నగర కార్యాలయం నుంచి జిహెచ్‌ఎంసి కార్యాలయం వరకు బిజెపి శ్రేణులు భారీ ర్యాలీతో తరలి వచ్చి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బిజెపి నాయకులు మురళీధరరావు, లక్ష్మణ్, చింతల రామచంద్రరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు.
తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి. చిన్నారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు భారీగా తరలి వచ్చారు. ఇప్పటికే చిన్నారెడ్డి 3 సెట్ల నామినేషన్ల దాఖలు చేయగా ఆయన తరపున ఎంపి రేవంత్‌రెడ్డి సోమవారం మరోసారి నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డి, ఎంపి రేవంత్‌రెడ్డి, మల్లు రవి, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నేటితో ముగియనున్న పట్టభద్రుల ఎంఎల్‌సి నామినేషన్లు
పట్టభద్రుల ఎంఎల్‌సి స్థానాలకు నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగియనుంది. ఖమ్మం – వరంగల్, -నల్గొండ, మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా, నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మార్చి 24న నామినేషన్లను పరిశీలించనుండగా,నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 చివరి తేదీ. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావుల పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో రెండు పట్టభద్రుల స్థానాల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడదుల చేసింది.
TRS Graduate MLC Candidate Vani Devi filed nomination