Saturday, November 16, 2024

రెండూ మావే

- Advertisement -
- Advertisement -

అత్యధిక ఓటింగ్ సరళి చెబుతున్నది అదే

పెరిగిన ఓటింగ్ శాతం, ప్రభుత్వ పనితీరుకు పట్టభద్రులు ఇచ్చిన పాజిటివ్ తీర్పు
ఉద్యోగాలపై ప్రతిపక్షాల దుష్రచారాన్ని మంత్రి కెటిఆర్ తిప్పికొట్టగలిగారు 
టిఆర్‌ఎస్ శ్రేణుల్లో వ్యక్తంమవుతున్న తిరుగులేని ధీమా

TRS leaders responseded to bandi sanjay comments

మన తెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటింగ్‌కు పట్టభద్రులు పొటెత్తడంతో అధికార టిఆర్‌ఎస్‌లో విజయం ధీమా వ్యక్తమవుతోంది. ఎంఎల్‌సి అభ్యర్థు ఎంపిక నుంచి అచీతూచీ వ్యవహరించిన టిఆర్‌ఎస్ అధినేతలు గెలుపే లక్షంగా శ్రమించారు. తాజాగా ఎంఎల్‌సి పోలింగ్ సరళిని పరిశీలించిన పార్టీ శ్రేణులలో కారుదే జోరన్న ఆత్మవిశ్వాసం వెల్లువెత్తుతోంది. రెండు స్థానాలను భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటామన్న విశ్వాసం పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. పెరిగిన ఓటింగ్ శాతం తమ ప్ర భుత్వ పనితీరుకు పట్టభద్రులు ఇచ్చిన పాజిటివ్ తీర్పుగా టిఆర్‌ఎస్ భావిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి నియోజకవర్గానికి జరిగిన ఓటింగ్ సరళి అంతా ఏకపక్షమేనని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఇక ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజకవర్గం కూడా తమదేనని ఘంటాపథంగా చెబుతోంది.
రెండు ఎంఎల్‌సి స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్షంతో ముఖ్యమంత్రి కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచే ఎప్పటికప్పుడు వ్యూహాలను రచించారు. తదనుగణంగా పార్టీ శ్రేణులను తగు సూచనలు, సలహాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడానికి అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో కొంత ఓటింగ్ శాతం తగ్గినా… గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్ శాతం పెంచుకునే విధంగా అధికార పార్టీ వ్యూహాలకు పదునుపెట్టింది. అయితే అధికార పార్టీ సైతం ఊహించని విధంగా హైదరాబాద్‌లోనూ పట్టభద్రులు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. ఎండాకాలం…పైగా వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడం, బ్యాలెట్ పేపర్ సైజు కూడా పెద్దగా ఉన్నప్పటికీ….ఓటర్లు గంటల తరబడి లైన్లో ఉండి మరీ ఓట్లు వేశారు. కొద్ది నెలల క్రితం జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోలింగ్ శాతం అంతంత మాత్రమే నమోదు అయింది. ఓటర్లు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అప్పట్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి సంబంధిత అధికారులు చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ గ్రేటర్ వాసులు పోలింగ్ కేంద్రాలకు రాకపోవడంతో చాలా పోలింగ్ కేంద్రాలలో ఖాళీగా దర్శమిచ్చాయి. దీంతో ఓటింగ్ శాతం కూడా తక్కువగానే నమోదు అయింది.

ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా హైదరాబాద్ వాసులు ఏ మేరకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తారో? అన్న అనుమానాలు, సందేహాలు అటు అధికారుల్లోనూ, ఇటూ రాజకీయ పార్టీల్లోనూ వ్యక్తమయ్యాయి. కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ పట్టభద్రులు మొదటి సారిగా ఓటింగ్ వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో పోలింగ్ ప్రారంభమైన ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ కేంద్రా వద్ద భారీ లైన్లు కనిపించాయి. అయితే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లలో అధిక శాతం సిఎం కెసిఆర్ పనితీరుకు పట్టంగట్టే విధంగా పార్టీ అభ్యర్ధి వాణిదేవికి ఓటు వేశారని టిఆర్‌ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
అలాగే ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు చేసిన ప్రచారాన్ని మంత్రి కెటిఆర్ సవర్ధవంతంగా తిప్పికొట్టగలిగారని కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలను శాఖల వారిగా వివరించారు. దీనిపై ఎవరికైనా అనుమానాలు ఉంటే సదరు అధికారులను సంప్రదించి, తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై పదునైన విమర్శలను కెటిఆర్ సంధించారు. ముఖ్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతి సంవత్సరం ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? దీనిపై బిజెపి నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని కెటిఆర్ సూటిగా అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేకపోయారు. ఇది కూడా తమకు బాగా కలిసొచ్చిందని అధికార పార్టీ భావిస్తోంది. పైగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడం, అలాగే వంటగ్యాస్ ధరలను కూడా విపరీతంగా పెంచింది. ఈ అంశాన్ని కూడా మంత్రి కెటిఆర్ పట్టభద్రుల బుర్రలోకి చొచ్చుకుని వెళ్లేవిధంగా ప్రచారం చేశారు.

ఈ పరిణామాలన్నీ టిఆర్‌ఎస్ అభ్యర్ధుల విజయానికి దోహదపడనున్నాయని, ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రాలన్నీ ఓటర్లతో కళకళలాడాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఉద్యోగస్తులకు కూడా ఎపి కంటే మెరుగైన పిఆర్‌సి ఇస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగస్తులు ఓట్లు కూడా తమకు పాజిటివ్‌గా మారి పెద్దఎత్తున ఓట్లు వేశారని పోలింగ్ సరళి స్పష్టం చేస్తోందని టిఆర్‌ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తోడు ఎన్నికల ప్రచారం సమయంలోనే టీచర్లు, పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలు, న్యాయవాదులు, ఐటి రంగానికి చెందిన ఉద్యోగులతో నిర్వహించిన సమావేశాలు… వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ పక్షాన ఇచ్చిన హామీలు తమకు కలిసొస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రెండు ఎంఎల్‌సి నియోజకవర్గాలను కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో మరోసారి టిఆర్‌ఎస్‌కు ఎదురులేదని నిరూపించబోతున్నామన్న ధీమా టిఆర్‌ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

TRS has Confidence on 2 Graduate MLC Seats

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News