బిజెపి దృష్టి సారించినా లాభం ఉండదు
ఆజాద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినా బిజెపి మాకు శత్రువే
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: రాష్ట్రంలో కారు టాప్ గేరులో ఉందని, బిజెపి అధిష్టానం దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఫలితం ఉండదని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సిఎం కెసిఆర్ బలంగా ఉన్నారని, బిజెపి తెలంగాణపై దృష్టి సారించినా యూపీ లాంటి ఫలితాలు పునరావృతం కావని అసద్ పునరుద్ఘాటించారు. గుజరాత్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. తాము ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని చెప్పారు. చాలా రాష్ట్రాలో కాంగ్రెస్ బలహీనపడిందని.. ఇక ఏం చేస్తారనేది జి 23 నేతలే చెప్పాలని అన్నారు.
కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు క్వార్టర్ పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయని ఆయన వ్యాఖ్యానించారు. దీని వెనుక మతలబు ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. అజాద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినా కూడా బిజెపి తమకు శత్రువేనని ఆయన అన్నారు. తెలంగాణలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తామనేది.. ఎన్నికలు వచ్చాకే చెబుతామని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలు ఏర్పాటైతే.. దక్షిణ భారతదేశం నష్టపోతుందన్నారు. అది ఉద్యమానికి కారణమవుతుందని హెచ్చరించారు.