మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ 18 ఏళ్ల ప్రజాజీవితం తర్వాత కూడా ఆయన ప్రజాప్రతినిధిగా మారలేదని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, బిసి కమిషన్ మాజీ సభ్యులు డాక్టర్ వకుళాభవరణం కృష్ణమోహన్‌రావు పేర్కొన్నారు. పేదలకు సేవడానికి బదులు వాళ్ల భూములనే కాజేశారని, వ్యాపారాభివృద్ధి తప్ప ప్రజా సేవ చేయడం అంటే ఏమిటో ఆయనకు అలవడలేదని విమర్శించారు. దశాబ్దాలలో కెసిఆర్‌పై బురదజల్లిన నాయకుల గతి ఏమిటో చూశామన్నారు. ప్రజలు కెసిఆర్‌ను నెత్తిన పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్యాయం చేసిన వారిని చెత్తబుట్టలో వేశారని, మరి మీ పరిస్థితి ఏంటో గమనించుకోండి అని ఈటల రాజేందర్‌కు సూచించారు. ఇప్పటికైనా తప్పుడు విమర్శలు మానుకోవాలని అన్నారు. టిఆర్ఎస్ బి.ఫాంలపై గెలిచిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులైన జెడ్పి ఛైర్మన్, జెడ్పిటిసిలుఏ, ఎంపిపిలు, ఎంటిటిసిలు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులైన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఫ్యాక్స ఛైర్మన్లు, డైరెక్టర్లు టిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగడం, కెసిఆర్ నాయకత్వాన్ని సమర్థించడం అమ్ముడు పోవడం ఎలా అవుతుందని..? ప్రశ్నించారు.
పార్టీని ధిక్కరించే మీ వైపు వెలితే తప్పు చేసినట్లు అని స్పష్టం చేశారు. ఈ విషయంలో విమర్శలు ఎంత విడ్డూరమైనవో ప్రజలు గమరిస్తున్నారని అన్నారు. ఇప్పటికీ టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఇతర రాజకీయ పార్టీల నాయకుల గడప గడపకు తిరిగి తనకు మద్దతుగా నిలవాలని కోరుకోవడం ఆత్మగౌవరం ఎలా అవుతుందని.. ? ప్రశ్నించారు. నిజంగా ఈటల ఉపయోగిస్తున్న ఈ పదాల పట్ల ఆయనకు గౌరవం ఉంటే పార్టీకి,ఎంఎల్ఎ పదవికి ఎప్పుడో రాజీనామా చేయాల్సింది అని, అయితే ప్రజలు, నాయకులు ఆయన వెంట ఎవరూ లేదని తేలడంతో మళ్లీ గెలవడం దుర్లభమని ఆయన నిర్థారించుకున్నారని పేర్కొన్నారు. ఎలాగోలాగా పూర్తి పదవి కాలాన్ని వెళ్లదీసుకోవాలని ఈటల ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకోసం ఆయన పూర్తిగా ఆత్మభిమానాన్ని గాలికి వదిలేశారని స్పష్టమవుతుందని అన్నారు.
తెలంగాణ సమాజంలో అభినవ జ్యోతిబాపూలేగా నినాదాలు కొట్టించుకున్నప్పుడల్లా ఆ మహనీయుడి ఆత్మ ఎంతగా క్షోభించి ఉంటుందో మీ నిజస్వరూపం బయటపడ్డాక తెలుస్తుందని విమర్శించారు.
ఇన్నాళ్లుగా అనేక సామాజిక, కుల సంఘాల వేదికలెక్కి మీరు ప్రసంగిస్తున్నప్పుడు, మీ వేదాంత ధోరణి, నిబద్దత, తాత్వికచింతనను గమనించి అవి నిజమేనని నమ్మి మోసపోయామని పేర్కొన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకున్న ఈటల వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నిస్తే మీ దగ్గర సమాధానం లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తున్నదన్నారు. ఇన్ని ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ ఆ బడు గు జీవుల భూములను ఎందుకు లాక్కోవలసి వచ్చిందో సమాజానికి ఈటల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బడుగుల భూములు మీ ఆధీనంలో ఉన్నవి అన్నది నిజమని పేర్కొన్నారు. ఉద్యమకాలం నుంచి నేటి ప్రభుత్వం అధినేతగా ప్రతి కార్యాచరణలో, ప్రతి పథకంలో ఆత్మగౌరవంతో ప్రజలను గొప్పగా బతకాలని ముందుకు నడిపిస్తున్న నాయకులు కెసిఆర్అని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయ దృక్పధంతో ఎంతోమందికి ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించి ఉన్నత భవిష్యత్తును కల్పించారని అన్నారు. అలాంటి గొప్ప దార్శనిక నేతపై ఈటల అనుచితంగా, సోయితప్పి విమర్శలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా విమర్శలు, తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.