Monday, December 23, 2024

సొమ్ము తెలంగాణది సోకు కేంద్రానిది

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన మిషన్ భగీరథను హైజాక్ చేసిన కేంద్రం, తెలంగాణలో 54లక్షల ఇళ్లకు నీళ్లు ఇస్తున్నది వాళ్లేనట, కేంద్ర జలశక్తి శాఖ శుద్ధ అబద్ధపు ప్రచారం, టిఆర్‌ఎస్ నేతల ఫైర్

మన తెలంగాణ / హైదరాబాద్ : “నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు” అన్నట్లుగా కేంద్ర మంత్రుల తీరు ఉందని టి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు చేసిన ఉద్యమాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని చేసిన వ్యాఖ్యలు సృష్టించిన దుమారం సద్దుమణగక ముందే తాజాగా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ చేసిన ట్వీట్ మరో వివాదానాకి తెరలేపింది. తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చులతో ఇంటింటికీ నల్లా పైపుల ద్వారా నల్లా నీటిని (రక్షిత మంచినీరు) ఉచితంగా పంపిణీ చేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకంగా చెప్పుకొంటూ జల్‌శక్తి శాఖ చేసిన ట్వీట్‌పై తెలంగాణ వాదులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

సిగ్గు ఎగ్గూ లేకుండా తెలంగాణలోని టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకంతో రికార్డుస్థాయిలో 54,06,070 ఇళ్ళకు నల్లా కనెక్షన్లతో శుద్దిచేసిన మంచినీటిని సరఫరా చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పథకాన్ని సిగ్గు లేకుండా కేంద్రప్రభుత్వ పథకమైన జల్‌జీవన్ మిషన్ ద్వారా నల్లా నీటిని ఇస్తున్నట్లుగా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ట్విట్టర్‌లో చెప్పుకోవడం ఆయన అవగాహనా రాహిత్యాన్ని టి.ఆర్.ఎస్.పార్టీ పథకాన్ని హైజాక్ చేసి దేశ ప్రజల మన్ననలను పొందాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సీనియర్ నేతలు మండిపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకమే అయితే ఏదో ఒక్క రాష్ట్రంలో అమలుకాదు కదా& దేశ వ్యాప్తంగా అమలు చేయాలి కదా& అలా ఎక్కడా చేయలేదని, చివరకు బి.జే.పి. పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ తరహా పథకాలు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ట్విట్టర్‌లు, ప్రకటనల ద్వారా టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను హైజాక్ చేయాలిని చూసినా, అలా ప్రకటించుకొన్నా ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు ఎద్దేవాచేశారు. అంతెందుకు తెలంగాణలోని మహిళలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనల నుంచి పుట్టిన పథకమే మిషన్ భగీరథ అని రాష్ట్రంలోని చిన్న పిల్లలను అడిగినా చెబుతారని, ఈ పథకానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడమే కాకుండా ఎన్నో రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని, చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా పేరుమార్చి ఈ పథకానికి రూపకల్పన చేసిందని టి.ఆర్.ఎస్.పార్టీ నేతలు ట్విట్టర్‌లోనే కాకుండా, బహిరంగంగానే తీవ్రస్థాయిలో కేంద్ర జల్‌శక్తి శాఖపై అక్షింతలు వేస్తున్నారు.

తెలంగాణలోని టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం అమలు తీరును పరిశీలించిన 15వ ఆర్ధిక సంఘం నిపుణులు, మేధావులు తెలంగాణ రాష్ట్రానికి 2350 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసిందని, ఇప్పటికీ ఆ నిధులను ఇవ్వలేదని, చివరకు కేంద్రంలోని బి.జే.పి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సంస్థ కూడా మిషన్ భగీరథ పథకానికి 19,205 కోట్ల రూపాయలను గ్రాంటుగా తెలంగాణకు ఇవ్వాలని సిఫారసు చేసిందని, కానీ తెలంగాణ పట్ల ఏ మాత్రం కనికరం లేని కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయిని కూడా నిధులు ఇవ్వలేదని, నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మిషన్ భగీరథ పథకం ఏర్పాటయ్యిందని, సొంత నిధులతోనే మిషన్ భగీరధ పథకం అమలవుతోందని, తెలంగాణ రాష్ట్ర మహిళల తాగునీటి కష్టాలను తొలగించింది కూడా రాష్ట్ర నిధులతోనే అనే విషయాన్ని కేంద్రం గుర్తుతెచ్చుకోవాలని, జల్‌శక్తిశాఖకు అవగాహన లేకపోతే కేంద్ర ఆర్ధికశాఖాధికారులనైనా అడిగి వాస్తవాలు తెలుసుకోవాలని టి.ఆర్.ఎస్. నేతలు కోరుతున్నారు. అప్పటి వరకూ ఇలాంటి పనికిమాలిన ట్వీట్‌లు చేసి జల్‌శక్తిశాఖ అవగాహన రాహిత్యాన్ని బట్టబయలు చేస్తోందని, మీ తెలివి తక్కువ తనానికి మీరే నవ్వులపాలవుతున్నారనే విషయాన్ని బి.జే.పి. నేతలు గమనంలో ఉంచుకోవాలని కోరుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News