వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్?
ఈటల హుజూరాబాద్‌కు వెళ్తే బిసి.. హైదరాబాద్‌కు వస్తే ఓసీ
పదవి పోగానే ఆయనకు ముదిరాజ్‌లు గుర్తొచ్చారా?
సిఎం కెసిఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం
కొంత కాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈటల వ్యాఖ్యలు
ఎప్పటి నుంచో విపక్ష నేతలతో మంతనాలు జరుపుతున్నారు
పేదలకిచ్చిన అసైన్డ్ భూములు కొనడం తప్పుకాదా?
పార్టీలో ఆయన ఆత్మగౌరవం దెబ్బతిన్నది ఎక్కడో చెప్పాలి
మంత్రి గంగుల, కొప్పుల, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ ఫైర్
మనతెలంగాణ/హైదరాబాద్: తక్కువ సమయంలో వేల కోట్లు…వందల ఎకరాలు, మెడికల్ కాలేజీలు ఎలా సంపాదించారని మంత్రి గంగుల కమలాకర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు. ఈటల తండ్రి తనకు కేవలం రెండు ఎకరాలే ఇచ్చారని చెప్పుకుంటూ ఇంత తక్కు సమయంలో ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ ఒక మేక వన్నె పులి అని.. బిసి ముసుగు కప్పుకున్న పెద్ద దొర అని విమర్శించారు. సిఎం కెసిఆర్‌పై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో ఎంఎల్ఎ సుంకె రవిశంకర్, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మణ్‌లతో పాటు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఈటల హుజురాబాద్‌కు వెళితే బిసి…హైద్రాబాద్‌కు వస్తే ఒసి అని విమర్శించారు. పదవి ఉన్నప్పుడు ఆయన బిసిలను దగ్గరకు రానీయలేదని, బిసిలను తొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పదవి పోగానే బిసి బిడ్డను, ముదిరాజ్ బిడ్డను అని అంటున్నారని చెప్పారు. గతంలో తన అక్రమ ఆస్తలను సక్రమం చేసుకోవడానికి మాజీ సిఎంలు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు కలిసిన ఈటల టిఆర్ఎస్ ద్వారా సంక్రమించిన పదవులతో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. ఆయన కనీసం ఒక్కసారైనా ముదిరాజు సోదరుల కోసం ఏమైనా అడిగారా అని నిలదీశారు. కానీ సిఎం కెసిఆర బిసిల కోసం వేల కోట్ల నిధులను కేటాయిస్తున్నారని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం తేవడమే కాక వాటిలో చేపపిల్లలను వదిలి వారికి ఉపాధి చూపించారని గుర్తు చేశారు. నిస్సిగ్గుగా ఎస్సిలకు చెందాల్సిన అసైన్డ్ భూములను, దేవాదాయ భూములను తక్కువ ధరకే లాక్కున్నానని ఆయనే స్వయంగా తెలియజేశారని అన్నారు. భూకబ్జాలు చేసే తనకు అండగా ఉండాలని బిసిలను ఎలా కోరతాడని నిలదీశారు. ఏ ఒక్కరూ మద్దతు తెలపకపోవడంతో కరోనా సాకుతో నేనే రావద్దని చెప్పిన అని చెప్పి హుజుర్‌నగర్‌కు బయలుదేరి వెళ్లాడని ఎద్దేవా చేశారు. ఈటల కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు పరిగే అంటారని, దాన్ని బట్టే ఆయన బిసి వ్యతిరేకి అని రుజువు అవుతుందని అన్నారు. ఆయన సీఎం మీద మాట్లాడే స్థాయికి వచ్చారని మండిపడ్డారు.
ఈటల వ్యాపార భాగస్వాములు ఎవరైనా బిసిలు ఉన్నారా..?
ఈటల వ్యాపార భాగస్వాములు ఎవరైనా బిసిలు ఉన్నారా..? అని మంత్రి గంగుల ప్రశ్నించారు.పదవి పోగానే ఇప్పుడు బిసిలు మీకు గుర్తుకు వచ్చారా..? అని నిలదీశారు. కమలాపూర్ నియోజకవర్గంలో ఈటల చీమలు పెట్టిన పుట్టలో పాములా చేరారని చెప్పారు. హుజుర్నగర్లో టిఆర్ఎస్ నేతలను బయటకు పంపే కుట్ర చేశారని అన్నారు. ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఊరుకోమని పేర్కొన్నారు. ఈటల బిసిలను ఎదగకుండా చేశారని ఆరోపించారు. టిఆర్ఎస్ బీ.ఫామ్ తమకు పవిత్ర గ్రంధమని, కానీ ఈటల టిఆర్ఎస్ బీ.ఫామ్ మీద పోటీ చేసిన వారిని ఓడించే ప్రయత్నం చేశారని మండిడడ్డారు. ఈటల తనకు తాను పెద్దగా ఊహించుకున్నారని అన్నారు. పార్టీలో విభజన తెచ్చే ప్రయత్నం చేశారని, పార్టీ ఓడితే ఈటల నవ్వుతారు, గెలిస్తే మొహం మాడ్చుకుంటారని ఆరోపించారు. ఈటల ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీల నాయకులతో టచ్‌లో ఉన్నారని, అందుకే వారు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్‌లో కెసిఆర్ బొమ్మతో ఈటల గెలిచారని తెలిపారు. ఈటల ఆరు సార్లు గెలవడం ఆయన గెలుపు కాదని, అది కెసిఆర్‌ది అని వ్యాఖ్యానించారు. కెసిఆర్ బొమ్మ వల్లనే జానారెడ్డి లాంటి నాయకులు ఓడిపోయారని చెప్పారు. ఎంపిపిగా ఉన్న కెప్టెన్ లక్ష్మికాంతరావు భార్య మీద కూడా అవిశ్వాసం పెట్టించారని అన్నారు. తాను హుజురాబాద్‌లో త్వరలో పర్యటిస్తానని, పార్టీని మరింత బలోపేతం చేస్తామని గంగుల కమలాకర్ వెల్లడించారు.
అసైన్డ్ భూములు కొనడం తప్పనిపించలేదా..?: మంత్రి కొప్పుల
అసైన్డ్ భూములను వ్యాపారం కోసం కొన్నట్లు ఈటల స్వయంగా చెప్పారని, 1995ల పేదలకు ఇచ్చిన ఆ భూములను కొనడం తప్పనిపించలేదా..? అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం రూ.కోటిన్నర విలువ చేసే భూములను రూ.6 లక్షలకే ఎలా కొన్నారని నిలదీశారు. అసైన్డ్ భూముల అమ్మకం, కొనుగోళ్లు చేయవద్దని చట్టం చెబుతున్నా వాటిని కొనేందుకు ఎందుకు సాహసించారని ప్రశ్నించారు. ఇది ఎస్సిలకు నష్టం చేకూర్చినటా..? లాభం చేసినట్లా..? అని దుయ్యబట్టారు. వీటిపై ఈటల సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారరు. అసైన్డ్ భూముల ఎన్నిసార్లు అమ్మినా వాటిని తిరిగి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. అక్కడి రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే సమాధానం చెప్పాల్సింది పోయిన ప్రభుత్వం, సిఎంపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని కొప్పుల ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవడం, పార్టీని గందరగోళానికి గురిచేయడమే మీ ఉద్దేశమా..? అని నిలదీశారు. ఈటల వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో అర్థం కాలేదు
టిఆర్ఎస్ తనకు గౌరవం, విలువ దక్కలేదంటూ ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు సత్యదూరమని మంత్రి కొప్పుల అన్నారు. పార్టీలో తొలి నుంచి ఆయనకు ప్రాధాన్యమివ్వడాన్ని తాము కళ్లారా చూశామని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2003లో ఈటల రాజేందర్ పార్టీలో చేరారని, ఆయన పార్టీలో చేరకముందే ఉద్యమం ఉధృతంగా ఉందని తెలిపారు. ఉద్యమకాలంలోనూ కెసిఆర్ ఈటలను అన్ని విధాలా గౌరవించి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గంలో ఎంఎల్ఎ టికెట్కరు టిఆర్ఎస్ నుంచి 23మంది ఆశావహులు ఉన్నారని, వాళ్లంతా ఉద్యమంలో పనిచేసి అవకాశమిస్తే పోటీ చేస్తామని ఎదురుచూస్తున్న వాళ్లే అని పేర్కొన్నారు. కానీ ఈటల రాజేందర్ వచ్చిన తర్వాత ఆయనను గౌరవించి కెసిఆర్ అవకాశమిచ్చారని చెపప్పారు. ఈటల ఎంఎల్ఎగా గెలిచిన తర్వాత శాసనసభలో ఫ్లోర్ లీడర్‌గా నియమించడంతో పాటు పార్టీలోనూ మంచి ప్రాధాన్యత కల్పించారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈటలకు అత్యంత గౌరవం లభించిందని తెలిపారు. మొదటి మంత్రివర్గంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖను ఇచ్చి, మంత్రివర్గం ఉపసంఘంలోనూ ప్రాధాన్యం కల్పించారని అన్నారు. రెండవ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారని తెలిపారు. తరచూ అసంతృప్తిని వెళ్లగక్కుతూ, కెసిఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని అన్నారు. ప్రభుత్వ పథకాలపైనా సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. అలాంటి సందర్భంలోనూ ఆయన వ్యాఖ్యలపై పార్టీ స్పందించలేదని, ఆయనకు ఎక్కడా గౌరవం తగ్గలేదని పేర్కొన్నారు. ఈటలకు ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో అర్థం కావడం లేదని అని చెప్పారు.
ఈటలకు కమలాపూర్‌ను బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చాం: వినోద్‌కుమార్
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సమాజం సంతోషంగా లేరని, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రం ఒక్కటే పరిష్కారం అన్నవాళ్లలో తాను ఒకరినని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. ఆనాడు చంద్రబాబు నాయుడు టిఆర్ఎస్ పార్టీని చాలా ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. 2001లోనే కమలాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ఈటల ప్టాలో చేరకముందే కమలాపూర్‌లో అన్ని జెడ్పిటిసి, ఎంపిపిలను టిఆర్ఎస్ గెలిచిందని గుర్తు చేశారు. 2003లో ఈటలకు కమలాపూర్ నియోజకవర్గాన్ని బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చామని తెలిపారు. 2001లోనే ఉత్తర తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, కరీంనగర్ జెడ్పి సీటను కైవసం చేసుకున్నామని అన్నారు. కెసిఆర్ ఈటలకు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఇచ్చి అత్యున్నత స్థానం కల్పించారని చెప్పారు. ఈటలకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కెసిఆర్‌కు ఆయన సవాల్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉంటూ ప్రభుత్వ భూముల జోతికి పోవద్దని అన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ హుజుర్‌నగర్‌కు ఏం కావాలంటే అది ఇచ్చారని అన్నారు. ఈటల మీద ప్రేమతోనే ఆయన నియోజకవర్గంలోనే సిఎం కెసిఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. అప్పుడు రైతుబంధును పొడిగి, ఇప్పుడు విమర్శిస్తావా..? అంటూ నిలదీశారు. యావత్ దేశం తెలంగాణ పథకాల వైపు చూస్తున్నప్పుడు వాటిని ఈటల విమర్శించడం సబబా..? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ మాటలు చూసి చాలా బాదేసిందని, కానీ మంత్రిపై మాట్లాడటం కరెక్ట్ కాదని ఊరుకున్నానని పేర్కొన్నారు. అన్నీ ప్రజలు గమిస్తున్నారని వినోద్‌కుమార్ అన్నారు.
TRS Leaders press meet over Etela Rajender issue