కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచి ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయెల్‌కు ఫిర్యాదు చేసిన టిఆర్‌ఎస్ నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్ ఓటర్లను పలు రకాలుగా ప్రలోభాలు పెడుతున్నారని ఆరోపిస్తూ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ టిఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఓటర్లకు పెద్దఎత్తున డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లకు గాలం వేస్తున్న బిజెపి నాయకుల యత్నాలను వెంటనే కట్టడి చేయాలని ఈ సందర్భంగా శశాంక్ గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఆంథోల్ శాసనసభ్యుడు క్రాంతి కిరణ్, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత గట్టు రామచంద్రరావు తదితరులు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి వారిలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలన్న లక్షంతో బిజెపి అభ్యర్ధితో పాటు స్థానిక నేతలు కొత్తగా బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసి డబ్బులు జమ చేస్తున్నారని టిఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఓటర్ల ఖాతాల్లోకి డబ్బులు పంపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఈటల రాజేందర్ అక్రమాలపై ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదు చేశామన్నారు. అయినప్పటికీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శంశాక్‌గోయల్‌ను వారు కోరారు. అలాగే ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తునన బిజెపి అభ్యర్ధిపై తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.