హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మార్చి 21న (సోమవారం) ఉదయం 11:30 గంటలకు టిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం ఎఫ్ సిఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కెసిఆర్ వివరించారు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టిఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం స్పష్టం చేశారు.