హైదరాబాద్: మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్‌పై ప్రభుత్వ విప్, చెన్నూరు ఎంఎల్‌ఎ బాల్కసుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటల రాజేందర్ భూములు కబ్జా చేసినట్లుగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారని తెలిపారు. అయినా కూడా ఇప్పటికీ ఈటల రాజేందర్ బుకాయించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈటల తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం టిఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎంఎల్‌ఎ ముఠాగోపాల్, ఎంఎల్‌సి పురాణం సతీష్‌కుమార్‌లతో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ‘ఈటల రాజేందర్ కుటుంబం ప్రభుత్వ, ఎస్సీ, ఎస్టీ భూములను కబ్జా చేశారని కలెక్టర్ చెప్పారు. నీతి నిజాయితీ ఉంది అంటున్న ఈటల రాజేందర్ 70.33 ఎకరాల భూములను ఏ విధంగా కబ్జా చేశారు? కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారు. తప్పైందని ఈటల ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నోరు లేని పేదల భూములను లాక్కుంటారు.
పర్యవరణానికి హాని కలిగిస్తారు. మళ్లీ వీల్లే దొంగే దొంగ అన్నట్లు ప్రవర్తిస్తారు. తప్పు అని రుజువైతే ముక్కు నేలకు రాస్తా అని ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పటికైనా హుజూరాబాద్ ప్రజలు ఈటల తీరును గమనించాలి. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదవారికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి.అక్కడి కలెక్టర్ నిజాయితీగా పనిచేస్తున్నారు. కానీ అతడ్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యాయ్యో కలెక్టర్ నిగ్గు తేల్చాలి. ఈటల కుటుంబం.. అధికారులు, కలెక్టర్‌పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అధికారులపై ఈటల రాజేందర్, అతని భార్య మాటలను ఖండిస్తున్నాన’ని బాల్క సుమన్ తెలిపారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరు దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉందని బాల్క సమన్ విమర్శించారు. ఒక వార్షిక ప్రణాళిక చేయమని అడిగితే.. ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఇన్ని రోజులుగా నిరసన చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. కేంద్రం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్‌క అసలు మనిషేనా.. అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పసుపు బోర్డు తెస్తా అన్న అరవింద్ తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ధర్మపరి అరవింద్‌ని బట్టలూడదీసి కొట్టాలి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ఏ రోజు తెలంగాణ కోసం పనిచేయలేదని ఆరోపించారు.