Monday, December 23, 2024

తుషార్, శ్రీనివాస్‌లకు సిట్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతం చేసింది. దీనిలో రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న సిట్ ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది. ఫాంహౌస్ వ్యవహారంలో నిందితుడైన రామచంద్ర భారతికి ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ఇదే కేసులో తుషార్‌కు సిట్ బృందం గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21 లోపుగా విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొంది. ఎంఎల్‌ఎలకు ప్రలోభాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తుషార్ పేరును ప్రస్తావించారు.

దీంతో తుషార్ ను విచారణకు రావాలని సిట్ బృందం ఆయనకు నోటీసులు జారీ చేసింది. టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో ఎంఎల్‌ఎలను ప్రలోభాలకు గురి చేశారని సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి, సింహయాజులు స్వామీజీ, నంద కుమార్‌లను పోలీసులు అరెస్ట్ గత నెల 26న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ కు హైద్రాబాద్ సీపీ సివి ఆనంద్ నేతృత్వం వహిస్తున్నారు. సిట్ దూకుడుగా ఈ కేసును విచారిస్తోంది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. కేరళ రాష్ట్రంలో ఇద్దరిని సిట్ అదుపులోకి తీసుకుంది. సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి తుషార్ పేరును ప్రస్తావించినట్టుగా ఆడియో సంభాషణల్లో ఉంది. ఈ నెలలో తెలంగాణ సిఎం కెసిఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో తుషార్ పేరును కూడా ప్రస్తావించారు. కేంద్ హోంమంత్రితో తుషార్ సమావేశమైన ఫోటోను కూడా మీడియా సమావేశంలో కెసిఆర్ చూపించిన విషయం తెలిసిందే.

ఎవరీ తుషార్?
తుషార్ కేరళకు చెందిన రాజకీయ నాయకుడు. బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ మీద పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే బిజెపిలో అధికారికంగా సభ్యుడు కాదు. ఆయనకు ప్రత్యేకంగా ఓ హిందూ వేదిక ఉంది. తుషార్ ద్వారానే ఎంఎల్‌ఎల కొనుగోలుకు ప్రయత్నించారని సిట్ భావిస్తోంది. ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రామచంద్ర భారతిలతో తుషార్ ఫోన్‌లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. వారి ఫోన్ కాల్ జాబితాను విశ్లేషించినప్పుడు తుషార్ గురించి ఎక్కువ సమాచారం వెలుగు చూసింది. దీంతో ఆయన పాత్ర కీలకమని భావిస్తున్న సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో తుషార్‌కు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే తనపై వచ్చిన ఆరోపణల్ని గతంలోనే మీడియా ద్వారా తుషార్ ఖండించారు. ఇప్పుడు విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

జగ్గు స్వామి అనే వ్యక్తి కోసం కేరళ పోలీసుల గాలింపు…!
మరో వైపు కేరళలో సిట్ బృందం విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. కొచ్చి, కొల్లాం వంటి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. జగ్గు స్వామి అనే వ్యక్తిని పట్టుకోవడానికి సిట్ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జగ్గు స్వామి కేరళలోని అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్నెస్స్‌లో పని చేస్తున్నారు. ఈ జగ్గు స్వామినే తుపార్‌ను రామచంద్ర భారతికి పరిచయం చేసినట్లుగా సిట్‌కు ఆధారాలు లభించాయి. ఈ జగ్గు స్వామి దొరికితే చాలా వరకు కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు నమ్మకంతో ఉన్నారు.

ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా సిట్ విచారణ
టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో సిట్ బృందం విచారణ ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లోనే జరుగుతోంది. నిందితులు ఇతర రాష్ట్రాల వారు కావడమే దీనికి కారణం. మరో వైపు హైదరాబాద్‌కు చెందిన కీలక నిందితుడు నందకుమార్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై ఉన్న పాత కేసుల్లోనూ కొత్తగా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలను అతిక్రమించి నిర్మించిన ఆయన హోటళ్లలో నిర్మాణాలను కూలగొడుతున్నారు.

TRS MLAs Poaching: CIT Notice to Tushar and Srinivas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News