హైదరాబాద్: తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. ఇప్పటికే సామాన్యులు మొదలు రాజకీయ, సినీ ప్రముఖులు చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా టిఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు కేశవరావుకు కరోసా సోకింది. కాస్త అనారోగ్యంగా వుండటంతో కరోనా పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రస్తుతం కేశవరావుకు కరోనా వల్ల ఎలాంటి సమస్య లేకపోవడంతో హోంఐసోలేషన్లో వుండాలని డాక్టర్లు సూచించారు. దీంతో తన నివాసంలోనే ఉంటూ ఎంపి కేశరావు చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఇటీవలే పార్లమెంటు సమావేశాలు ముగియడంతో కేశవరావు దేశ రాజధాని న్యూఢిల్లీ నుండి హైదరాబాద్‌కు వచ్చారు. కానీ సమావేశాల సమయంలో ఢిల్లీలోనే వున్న ఆయన సహచర ఎంపీలు, రాష్ట్ర మంత్రుల బృందంతో కలిసి కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ని కలిశారు.
అలాగే రాజ్యసభ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇలా ఇటీవల కేశవరావు న్యూఢిల్లీతో పాటు హైదరాబాద్‌లో చాలా మందిని కలిశారు. ఆయన కలిసిన వారిలో కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ సీనియర్లు, టిఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, నాయకులు కార్యకర్తలు వున్నారు. కాబట్టి తనను ఇటీవల కాలంలో కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేశవరావు సూచించారు. ఇక నాలుగు రోజుల క్రితమే తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరడానికి రాష్ట్ర మంత్రుల బృందం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించింది.
ఈ బృందంలో మంత్రి ఎర్రబెల్లి కూడా వున్నారు. న్యూఢిల్లీ నుండి తిరిగివచ్చిన మంతరి కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో హోం క్వారంటైన్లోకి వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇక టిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డికి కూడా కరోనా సోకింది. ఈయన ఇటీవలే ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. సమావేవాలు ముగిసిన తర్వాత రాష్ట్రానికి విచ్చేశారు. అయితే ఆయన కోవిడ్ టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. మంత్రి ఎర్రబెల్లి, ఎంపి రంజిత్‌రెడ్డితో పాటు తాజాగా కేశవరావుకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రుల బృందం, టిఆర్ఎస్ ఎంపీల్లో ఆందోళన నెలకొంది. అంతేకాకుండా ఇటీవల వీరిని కలిసిన నాయకులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.