Saturday, November 2, 2024

నేడు టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

- Advertisement -
- Advertisement -

TRS Parliamentary party meeting will be chaired by CM KCR

ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఉ.11 గంటలకు ప్రారంభం

పార్లమెంట్‌లో పార్టీ వ్యూహంపై ఎంపిలకు దిశానిర్దేశం చేయనున్న సిఎం
ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర విభజన అంశాలు, నదీ జలాల గెజిట్‌లపై కేంద్రాన్ని నిలదీయాలని సూచించే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపిలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల అంశం ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య తీవ్ర స్థాయిలో వివాదం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో వివిధ అంశాలపై పార్లమెంట్‌లో పదునైన వ్యూహాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పలు రకాల ప్రణాళికలు, సూచనలను సిఎం కెసిఆర్ జారీ చేయనున్నారు. కేంద్రంపై ఇప్పటి వరకు టిఆర్‌ఎస్‌ది ఒక లెక్క….ఇకపై మరో విధంగా ఉండబోతుందని ఇటీవల సిఎం కెసిఆర్ చాలా స్పష్టంగా, కుండ బద్దలు కొట్టిన చందంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోళ్ల పూర్తి బాధ్యత కేంద్రానిదేనని… ఈ నేపథ్యంలో ధ్యానాన్ని కొనుగోలు చేస్తుందా? లేదా? సూటిగా చెప్పాలని ఇటీవల టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో సిఎం కెసిఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే ఎవరినైనా ఎదురిస్తామని.. ఎంతదూరమైన పోతామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆ దిశగానే నేడు జరిగే పార్లమెంటరీ సమావేశంలో ఎంపిలకు సిఎం చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది. అలాగే పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలు…కేంద్రం నుంచి రావాల్సిన నిధులు…గ్రాంటులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించే అంశం కూడా పార్లమెంట్‌లో పార్టీ ఎంపిలు చాలా గట్టిగా తమ వాణిని వినిపించాలని సిఎం కోరే అవకాశముందని తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణ బిల్లును కూడా కేంద్రం వెనక్కు తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా రాష్ట్ర పక్షాన మోడీ ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేయాలని సూచించనున్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఉత్తర భారత్‌దేశంలోని రైతులు సంఘటితంగా పోరాటం చేస్తే….దెబ్బకు కేంద్రం దిగిరావడమే కాకుండా…రైతులకు క్షమాపణలు చెప్పడంతో ఆ చట్టాలను వెనక్కు తీసుకుందన్న విషయాన్ని ఎంపిలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరాటం చేయాలని కోరనున్నారు.

బిజెపి పాలిత రాష్ట్రాలకు ఉదారంగా నిధులు ఇస్తున్న కేంద్రం తెలంగాణ విషయంలో అనుసరిస్తున్న మొండి వైఖరిని కూడా పార్లమెంట్ వేదికగా ఎంపిలు నిలదీయాలని సూచించనున్నారు. ఈ అంశాలపై కేంద్రం వైఖరిపై కెసిఆర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ పరిణామాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉప్పు…నిప్పుగా మారాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎంపిలు అనుసరించనున్న వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై రాష్ట్రంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News