Tuesday, November 5, 2024

నేడే మహాధర్నా

- Advertisement -
- Advertisement -

TRS party is holding Maha Dharna today

బియ్యం సేకరణలో కేంద్ర ద్వంద్వ వైఖరికి నిరసనగా

ఇందిరాపార్కు వద్ద టిఆర్‌ఎస్ ధర్నాలో పాల్గొననున్న సిఎం కెసిఆర్
పెద్ద ఎత్తున తరలిరానున్న మంత్రులు, పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు ఇతర గులాబీ శ్రేణులు

మన తెలంగాణ/హైదరాబాద్ : అధికార టిఆర్‌ఎస్ పార్టీ నేడు మహాధర్నాను తలపెట్టింది. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా గురువారం నగరంలోని ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నాను నిర్వహిస్తోంది. ఈ ధర్నాలో సిఎం కెసిఆర్ కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, టిఆర్‌ఎస్‌కు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపిలు, స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు, గులాబీ శ్రేణులు, హైదరాబాద్‌కు చుట్టు ఉన్న శివారు ప్రాంతాల్లోని రైతులు పెద్దఎత్తున తరలిరానున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల నుంచి వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. అలాగే ఆయా జిల్లాల నుంచి రైతులను కూడా పెద్దసంఖ్యలో సమీకరణ చేస్తున్నారు.

ఈ మేరకు అవసరమైన రవాణా ఏర్పాట్లును ఆయా జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే ధర్నాచౌక్‌కు వచ్చే వారు వివిధ రూపాల్లో కేంద్రానికి నిరసనలు తెలియజేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే కేంద్రంపై దుమ్మెత్తిపోసే విధంగా జానపద పాటలు, నృత్యాలతో అలరించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక ఏర్పాట్లు కూడా చేశారు. దీని కోసం ప్రత్యేకంగా కళాకారులను కూడా ఆహ్వానించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పండించే ధాన్యాన్ని ఎంత మేరకు కొనుగోలు చేస్తారన్న అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే పలుమార్లు పదేపదే డిమాండ్ చేశారు. అయినప్పటికీ నుంచి తగు స్పందన రాకపోవడంతో కేంద్రంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇందుకు నిరసనగానే ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో పెద్దఎత్తున ధర్నాలకు పిలుపునివ్వడంతో అన్ని జిల్లాలిలో టిఆర్‌ఎస్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. అయితే ధర్నాలు జరిగి సుమారు వారం రోజులు కావస్తున్నప్పటికీ కొనుగోళ్లపై కేంద్రం నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో సమస్యను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సిఎం కెసిఆర్ మరోసారి మహాధర్నాకు పిలుపునిచ్చారు. కాగా ధర్నాకు వేలాదిగా కార్యకర్తలు తరలిరానున్న నేపథ్యంలో ధర్నా వేదిక వద్ద తాగు నీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

సిఎం కెసిఆర్‌మహాధర్నాకు పిలుపునివ్వడంతో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌యాదవ్‌లు నగరానికి చెందిన శాసనసభ్యులతో కలిసి ధర్నా చౌక్ వద్ద బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, ప్రజల పక్షాన పోరాడేందుకు టిఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా…లేకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందన్నారు. అందుకే ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ టిఆర్‌ఎస్ పార్టీ మహాధర్నాకు పిలుపునివ్వాల్సి వచ్చిందన్నారు.

ఆనాడు ఆంధ్రలో విలీనం అయిన మండలాల గురించి బంద్ నిర్వహించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని ఆందోళన చేస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం కేంద్ర ప్రభుత్వానికి ఉండాలన్నారు. కానీ రాష్ట్రానికో నీతి అన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రానికి ఏడాదికి వెయ్యికోట్ల నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్య పక్షంగా ఆందోళన చేస్తున్నామన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ధాన్యం నుగోలు చేశాయని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. కానీ మోడీ సర్కార్ తన బాధ్యత నుంచి. తప్పించుకునే యత్నం చేస్తోందని విమర్శించారు. నేటి ధర్నా టిఆర్‌ఎస్ బల ప్రదర్శన కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. రైతుల పక్షాన కేంద్రం పై ఒత్తిడి తేవాలన్నదే ఉద్దేశ్యంతోనే ఈ ధర్నాను నిర్వహిస్తున్నామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News