తెలంగాణ భవన్‌లో మహాధర్నా నేడే
కేంద్ర పాలకులు దిగొచ్చేలా మార్మోగనున్న తెలంగాణ రైతు సమరశంఖం
ఢిల్లీలో భారీ ఏర్పాట్లు చేసిన టిఆర్‌ఎస్ శ్రేణులు
ధాన్యం అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే విశేష ఘట్టం
స్వయంగా హాజరవుతున్న టిఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కెసిఆర్
౩వేల మంది ప్రతినిధులకు అనువుగా ప్రాంగణం
భారీ వేదిక సిద్ధం
హస్తినకు చేరిన మంత్రులు సహా అన్నిస్థాయిల పార్టీ శ్రేణులు
ధర్నాకు మద్దతు ప్రకటించిన రైతు సంఘం నేత రాకేష్ టికాయత్, ఎంఆర్‌పిఎస్
మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ వేదికగా కేంద్రంలోని మోడీ సర్కార్‌పై టిఆర్‌ఎస్ పార్టీ సోమవారం సింహగర్జన చేయనుంది. ఈ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వంపై అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకపడనుంది. ధర్నాతో ధాన్యం కొనుగోలు అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే విధంగా గులాబీ దళం సర్వం సిద్దం చేసింది. ఈ నేపథ్యంలో మహాధర్నాకు భారీ ఏర్పాట్లు చేసింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా ఈ ధర్నాకు హాజరవుతున్నారు. దీంతో కేంద్రంపై ఆయన ఎలాంటి పోరుకు సిద్ధమవుతున్నారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కేంద్రంపై సమరభేరి మ్రోగించిన కెసిఆర్….భవిష్యత్తుల్లో ఎలాంటి దుకుడును కొనసాగించనున్నారన్న విషయంపై దేశంలో వాడివేడి చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ నోటి నుంచి వచ్చే ప్రతి మాట…కేంద్రంపై తూటాళ్లా పేలడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మహాధర్నాకు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో పాటు రైతులు, రైతు సంఘం నాయకులు కూడా పెద్దఎత్తున హాజరవుతున్నారు.
మొదట్లో పదిహేను వందల మంది వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. అయితే అది కాస్తా మూడువేల వరకు చేరనుందని తెలియడంతో ధర్నాకు వచ్చే వారందరికి ఎలాంటి అసౌకర్యం కలుగుకండా పార్టీఅధిష్టానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే గులాబీ జెండాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్టేజీని 22/35 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. దీక్షకు హాజరైన వారికి వేదికపై ఆసీనులైన నాయకులు స్పష్టంగా కనబడే విధంగా ఏర్పాటు చేయడంతో పాటు ఎల్‌ఇడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే నేతల ప్రసంగాలు కూడా స్పష్టంగా వినపడే విధంగా మంచి సౌండ్ సిస్టమ్‌ను నెలకొల్పారు. ముందు వరసలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలకు కుర్చీలు వేస్తున్నారు. వారి వెనుక మహిళలకు స్థానం కల్పించారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ధర్నాకు ఉక్కపోత సమస్య తలెత్తకుండా పెద్దఎత్తున ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేశారు. ఇక మంచినీటి సౌకర్యంతో పాటు తరుచూ మజ్జిగ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకంగా వాలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు.
కాగా దీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు కె. కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, ఎంపిలు జోగినపల్లి సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి, శాసనసభ్యులు దానం నాగేందర్, గోపీనాథ్, ఎంఎల్‌సి ప్రభాకర్ తదితరులు ఎప్పటికప్పుడు ఈ పనులను సమీక్షిస్తున్నారు. దీక్షలో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అగమేఘాలపై చర్యలు తీసుకొంటున్నారు. వేదిక, పార్కింగ్, భోజనం, విమానాశ్రయం నుంచి దీక్షా స్థలికి చేరుకొనేందుకు వాహనాల ఏర్పాటుతో పాటు తదితర పనులకు పలు ఉప కమిటీలు నియమించారు. వారందరికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చేవారి కోసం పది బస్సులు, 35 కార్లు సమకూర్చారు. మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఇతర నాయకుల కోసం తెలంగాణ భవన్‌తో పాటు చుట్టు పక్కల హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేశారు.
హస్తినకు చేరిన గులాబీ దండు
ధర్నాలో పాల్గొనేందుకు గులాబీ దండు ఇప్పటికే హస్తినకు చేరింది. ఆదివారం రాత్రికే దాదాపుగా మంత్రులందరూ ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పలువురు పార్టీ ముఖ్యలు కూడా దేశ రాజధానికి చేరుకున్నారు. కాగా ఆదివారం సాయంత్రం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.
ధర్నాకు సంపూర్ణ మద్దతు…టికాయత్
తెలంగాణా భవన్‌లో టిఆర్‌ఎస్ నిర్వహించే నిరసన కార్యక్రమానికి రైతుసంఘం నేత రాకేష్ టికాయత్ సంపూర్ణ మద్దతు ప్రకటంచారు. ఈ నేపథ్యంలో ధర్నాలో తాము కూడా పాల్గొంటామని ఆయన స్పష్టం చేశారు. రైతుల కేంద్రం అనుసరిస్తున్న విధానం ఏ మాత్రం సరిగ్గా లేదని మరోసారి మోడీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధ్యాన్యాన్ని మొత్తం కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ కేంద్రం మద్దతుధర ప్రకటించాలని ఈ సందర్భంగా టికాయత్ డిమాండ్ చేశారు. కేంద్రం అవలంభించిన వ్యతిరేక విధానాల వల్ల దేశవ్యాప్తంగా రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. కేంద్రం తీసుకున్న నల్ల చట్టాలపై తాము చేసిన ఆందోళనతో వెనక్కి తగ్గిందన్నారు.
ధాన్యం సేకరణ విషయంలో టిఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం అమలుచేస్తోన్న రైతుబంధు చాలా గొప్పదని కితాబిచ్చారు. ఈ పథకం దేశానికే ఆదర్శమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణా తరహాలో అన్ని రాష్ట్రాల్లో రైతుబంధును విధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంటు అందించాలన్నారు. ఈ విషయంలో కూడా సిఎం కెసిఆర్‌కు మించిన నాయకుడు దేశంలో మరొకరు లేరన్నారు. ఉచిత కరెంటు విషయంలో సిఎం కెసిఆర్ కృషి అభినందనీయమన్నారు. రైతుల సంక్షేమం కోసం కెసిఆర్ తీసుకునే ప్రతి నిర్ణయానికి… భవిష్యత్తులో తలపెట్టే ఏ కార్యక్రమానికైనా తమ మద్దతు ఉంటుందని కిసాన్ నేత రాకేష్ టికాయత్ ప్రకటించారు.
ఎంఆర్‌పిఎస్ సంపూర్ణ మద్దతు
రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన టిఆర్‌ఎస్ ధర్నాకు ఎంఆర్‌పిఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన వడ్లను, పంటను కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు.