సిద్దిపేట: చాలా రోజుల తర్వాత శుక్రవారం ధర్నా చేయడంతో రైతుల్లో నూతన ఉత్సాహం కలుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నాలో హరీష్ రావు ప్రసంగించారు. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం ధర్నాలు చేశామని, కానీ ఈ రోజు దుక్కి దున్నే రైతన్నల కోసం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల కోసం పని చేస్తున్నారని, గతంలో ఎన్నో పదవులు ఉన్నా వ్యవసాయ కోసం, రైతుల కోసం పని చేశారన్నారు. గతంలో వడ్లు కొనక పోయిన, విద్యుత్ సరఫరా కోసం, ఎరువుల కొరత కోసం ధర్నా చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నీటికి ఏ కష్టం లేకుండా పోయిందని, ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు దక్కుతుందన్నారు. తెలంగాణ వచ్చాక బోరు బండ్లు, ట్రాన్స్ఫారమ్ రిపేర్ ల కోసం, కరెంట్ మోటర్ రిపేర్ ల దుకాణాలు ముసుకు పోయాయంటే కెసిఆర్ తోనే అది సాధ్యమైందన్నారు. నీటికి, కరెంటు, ఎరువుల కోసం కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఢిల్లీ వాళ్ళు యాసంగిలో వడ్లు కొనం, దొడ్డు వడ్లు కొనం అని హుషారుగా చెబుతున్నారని, పంజాబ్ లో చలికాలంలో వరి పంట పండదని, గోధుమ పంటను వేశారని, బిజెపి సోషల్ మీడియా తెలంగాణ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే హేళన చేశారు కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తోందన్నారు. 30 వేల కోట్లు రూపాయల నిధులు రైతుల కోసం ఖర్చు చేస్తున్నామని, 70 ఏళ్లలో ఒక్క గోడౌన్ కడితే, 7 సంవత్సరంలో 70 మెట్రిక్ టన్నుల గోడౌన్ లు నిర్మించామని ప్రశంసించారు.
- Advertisement -