మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి
హుజూరాబాద్ : హుజూరాబాద్‌లో ప్రస్తుతం జరిగే అసాధరణ ఎన్నికలలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని టిఆర్‌ఎస్‌కు ఓటేయాలని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కోరారు. గురువారం నాడు హూజురాబాద్ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ… ప్రస్తుతం హుజూరాబాద్ జరిగేవి అసాధరణ ఎన్నికలని, ఈ ఎన్నికలలో టిఆర్‌ఎస్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో హుజూరాబాద్ టికెట్ వల్ల ప్రభుత్వానికి జరిగే నష్టం ఏమి లేదని, ఒక వేళ ప్రజలు ఈటలకు ఓటేస్తే నష్టం ప్రజలకే జరుగుతుందని అన్నారు. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్‌లో ప్రయోగత్మాకంగా ప్రవేశపెట్టడం అభినందనీయమని అన్నారు. హుజూరాబాద్‌లో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అభివృద్ధి పనులే ఎక్కువగా ఉన్నాయని, ఈటల ఏనాడు ప్రజల గురించి పట్టిం చుకోలేదని అన్నారు.
కేవలం తన అభివృద్ధ్ది విషయంలోనే సిఎం కెసిఆర్‌తో విభేదించాడని, ప్రజల కోసం కాదని అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. తాను బిజెపి నుండి టిఆర్‌ఎస్‌లోకి రావడానికి కారణం కేవలం ప్రజల కోసమేనని తన కోసం కాదని అన్నారు. హుజూరాబాద్ పట్టణ ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని, వారి శ్రేయస్సు కోసం మాత్రమే తాను పార్టిలోకి చేరుతున్నాను తప్ప అధికారం కోసం కాదని అన్నారు. తాను టిఆర్‌ఎస్‌లో చేరాక సిఎం కెసిఆర్ ఏ బాధ్యతలు అప్పగించిన చేపట్టడానికి సిద్ధ్దంగా ఉన్నానని, పదవి కోసం తాను అడగలేదని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాకుండా పక్కనున్న హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కూడా అనేక మంది పార్టి పదవులు అనుభవిస్తున్న తన అనుచరులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, వారందరు టిఆర్‌ఎస్‌లో క్రమ శిక్షణ గల కార్యకర్తలుగా ఉంటారని అన్నారు.
ఈటల నియోజకవర్గంలో దిగజారుడు రాజకీయం చేస్తున్నారని ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పని చేసే వారికే పట్టం కట్టాలని కోరారు. శుక్రవారం తాను తన అనుచరులతో టిఆర్‌ఎస్ భవన్‌లో కేసిఆర్ సమక్షంలో చేరుతున్నానని అనంతరం హుజూరాబాద్‌లో కార్యకర్తలతో సమావేశమై రానున్న ఎన్నికలలో ఏ విధంగా పని చేయాలనే విషయంపై దిశానిర్దేశం చేయడం జరుగుతుందని అన్నారు. తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకున్న పార్టి నిలబెట్టిన అభ్యర్ధి విజయం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతిరెడ్డిపేట గ్రామ సర్పంచ్ తాటికొండ పుల్లాచారి, మాజీ సర్పంచ్ బచ్చు ఆనందం, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ పోల్సాని రామారావు, పోరెడ్డి కిషన్‌రెడ్డి, సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.