హైదరాబాద్: బల్దియాపై గులాబి జెండా మరోసారి రెపరెపలాడింది. గురువారం నిర్వహించిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పదవులను కైవసం చేసుకుంది. 2016లో జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో 99 స్థానాల్లో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో మొదటిసారిగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకోగా, 2021లో మరోసారి ఈ రెండు పీఠాలను కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను తిరిగి దక్కించుకున్నారు. మేయర్‌గా బంజారా హిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలతలు గెలుపొందారు. దీంతో బల్దియా 26వ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలతలు బాధ్యతలను స్వీకరించనున్నారు.
గడిచిన 6 ఏళ్ల కాలంలో హైదరాబాద్ అభివృద్దికి అన్ని తానై ఎనలేని కృషి చేస్తున్న పురపాలక శాఖమంత్రి కె.తారక రామారావు నేతృత్వంలో అనేక అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్లై ఓవర్లు, మొదల్కొన్ని రోడ్ల విస్తరణలో భాగంగా లింక్ రోడ్ల అభివృద్ది, ఆర్ఓబి, ఆర్‌యుబిల నిర్మాణం, జంక్షన్ల అభివృద్దితో నగర ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వాటి నిర్వహణను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న నగర నిరు పేదలు కలను నిజం చేస్తూ డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. దీనికి తోడు నగరాన్ని పూర్తిగా ఆకుపచ్చ హైదరాబాద్‌గా తీర్చిదిద్దడమే లక్షంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటడమే కాకుండా నగరవాసులకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకమైన వాతావరణాన్ని అందించడమే లక్షంగా ఎక్కడికక్కడ పార్కులను అభివృద్ది చేయడంతో పాటు ప్రజలలకు మరింత విజ్ఞానాన్ని అందించేందుకు థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి తోడు నగరంలోని ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలను పాశ్చత్య దేశాల్లోని నగరాలకు దీటుగా తీర్చిదిద్దారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో సైతం నగరవాసులు టిఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టడంతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది.