ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు సజీవదహనమయ్యారు మరో 25మందికి గాయాలయ్యాయి.
ఈ విషాద సంఘటన పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట- పర్చూరి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానిక చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఎపిలో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్స్ తోపాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. బాధితుల్లో ఎక్కువ మంది జనగంజాం, గోనసపూడి, నిలయపాలెం గ్రామాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.