Thursday, January 23, 2025

దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా రెండో రోజూ ట్రక్కు డ్రైవర్ల నిరసన
మూతపడిన 2 వేలకు పైగా పెట్రోలు బంకులు
ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్రంగా ఉన్న సమ్మె ప్రభావం
పెట్రోలు బంకులకు క్యూ కట్టిన వాహనదారులు
నిత్యావసర సరకులు, కూరగాయల సరఫరాకూ అంతరాయం
పలు చోట్లు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ, ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత శిక్షాస్మృతి(ఐపిసి) స్థానంలో కేంద్రం ఇటీవల ఆమోదించిన కొత్త చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి తీసుకు వచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డైవర్లు రెండు రోజులుగా ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ముఖ్యంగా పెట్రోలు ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మె చేస్తుండడంతో పెట్రోలు బంకుల్లో నిల్వలు నిండుకున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాదిన పెట్రోలు బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి.

ట్రక్కు డైవర్ల సమ్మెను ముందే ఊహించి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు బంకుల్లో నిల్వలను ఉంచినప్పటికీ భారీ రద్దీ కారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోని దాదాపె 2 వేల పెట్రోలు బంకులు మూతపడ్డాయి. రెండు మూడు రోజలుకు సరిపడా నిల్వలు ఉన్నాయని, అయితే సమ్మె కొనసాగితే మాత్రం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని ఆ సంస్థలు అంటున్నాయి. నిల్వలు నిండుకుంటాయేమోనన్న భయంతో వాహన యజమానులు పెట్రోలు బంకులకు పరుగులు తీయడంతో బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మాత్రం కొన్ని పెట్రోలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.

సోమవారం ప్రారంభమయిన మూడు రోజుల సమ్మె దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించడంతో ట్రక్కులు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు లాంటి వాటి సరఫరాలకు కూడా అంతరాయం ఏర్పడింది. ట్రక్కు ఆపరేటర్ సంఘాల సమాఖ్య అయిన ది ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్ట్ అసోసితయేషన్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వకపోయినప్నటికీ కొన్ని సంఘాలు సమ్మెకు దిగడంతో పరిస్థితి దిగజారింది. కేంద్రం కొత్తగా తీసుకు వచ్చిన చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలను ప్రవేశ పెట్టడాన్ని ట్రక్కు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ట్రక్కు డైవర్లు ఏదయినా ప్రమాదం జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వాహనాన్ని వదిలిపెట్టి పారిపోతే పదేళ్ల దాకా జైలు శిక్షతో పాటుగా 7 లక్షల రూపాయల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. పాతచట్టం ప్రకారం ఇలాంటి ప్రమాదాల్లో గరిష్ఠంగా రెండేళ్లు మాత్రమే శిక్ష విధించే వారు.

పోలీసులకు, డ్రైవర్లకు మధ్య ఘర్షణలు
సమ్మె చేస్తున్న ట్రక్కు డ్రైవర్లు జాతీయ రహదారులపై వాహనాలను ఎక్కడికక్కడ నిలిపి వేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ జామ్‌లను క్లియర్ చేయడానికి వెళ్లిన పోలీసులకు ట్రక్కు డైవర్లకు మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్న ట్రక్కు డైవర్లు, పోలీసుల మధ్యఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. యుపిలోని మెయిన్‌పురిలో మంగళవారం ధర్నా చేస్తున్న ట్రక్కు డైవర్లపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో ఆగ్రహించిన ట్రక్కు డైవర్లు ఎదురుతిరిగి పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

రాజస్థాన్‌లోని కేక్రీ జిల్లా బందన్‌వాడా ప్రాంతంలో సోమవారం రాత్రి ధర్నా చేస్తున్న ట్రక్కు డైవర్లను అక్కడినుంచి ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై ఆందోళనకారులు, స్థానికులు రాళ్లు రువ్వడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు ఒక పోలీసు వాహనానికి నిప్పు పెట్టారని కూడా కేక్రీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ సింగ్ చెప్పారు. అదనపు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించామని, రోడ్డును క్లియర్ చేశామని ఆయన చెప్పారు.ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు.

ట్రక్కు డ్రైవర్ల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు
కాగా హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించడానికి వీలు కల్పించే కొత్త చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేసింది. కొత్త చట్టాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా బెదిరించి డబ్బులు గుంజే నెట్‌వర్క్ తయారు కావడానికి, వ్యవస్థీకృత అవినీతికి దారి తీస్తుందని ఆ పార్టీ పేర్కొంది. ప్రభుత్వం ఓ వైపు మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను ఆపేసి, మరో వైపు పేదలను శిక్షిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంటులో 150 మంది సస్పెండ్ అయిన సమయంలో డ్రైవర్లకు వ్యతిరేకంగా కొత్త చట్టాన్ని ఆమోదించారని, ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ ఎక్స్‌లో ఉంచిన పోస్టులో గాంధీ దుయ్యబట్టారు.

చాలీ చాలని రాబడులతో బతుకులీడుస్తున్న డ్రైవర్లను కఠిన శిక్షల పరిధిలోకి తీసుకు రావడం వల్ల వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అవతేకాకుండా వ్యవస్థీకృత అవినీతికి తోడుగా బెదిరించి డబ్బులు గుంజే నెట్‌వర్క్ తయారు కావడానికి దారి తీస్తుందని ఖర్గే పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని సృష్టించి ఏమీ అమలు చేయని వ్యూహాన్ని కేంద్రప్రభుత్వం అనుసరిస్తోందని కూడా ఆయన అన్నారు.

కొత్త చట్టం ఏం చెప్తోంది?
ఐపిసి స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన భారతీయ న్యాయసంహిత ప్రకారం హిట్ అండ్ రన్, ర్యాష్ డ్రైవింగ్ అనేవి నిర్లక్షపూరిత డ్రైవింగ్ కిందికి వస్తాయి. ఇందులోని 104 సెక్షన్‌లో రెండు క్లాజ్‌లున్నాయి. నిర్లక్షంగా వాహనం నడిపి వ్యక్తి మరణానికి కారణమయితే గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష ఉంటుంది. దీంతో పాటుగా జరిమానా కూడా విధించే వీలు ఉందని మొదటి నిబంధనలో పేర్కొన్నారు. రెండో నిబంధనలో.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా అక్కడినుంచి పారిపోతే గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఐపిసిలో ఇవి సెక్షన్ 304ఎ కిందికి వస్తాయి. నిర్లక్షంగా వాహనం నడిపి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఐపిసిలో గరిష్ఠంగా రెండేళ్లవరకు మాత్రమే శిక్ష ఉంటుంది.

హిట్ అండ్ రన్ కేసుల్లో పదేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానాపైనే ట్రక్కు డ్వైర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ జైలుశిక్ష పడితే పదేళ్ల పాటు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా భారీ స్థాయిలో(7 లక్షల) జరిమానా చెల్లించడం కూడా సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నారు. చిన్న ప్రమాదాలు జరిగినా సరే జనం వాహన డ్రైవర్లపై దాడి చేసి తీవ్రంగా కొడుతుంటారని, ఈ కారణంగానే వారు ప్రాణ భయంతో వాహనాన్ని వదిలిపెట్టి పారిపోతుంటారని అంటున్నారు.ఈ కఠిన నిబంధన వల్ల కొత్త వాళ్లు ఈ వృత్తిని చేపట్టడానికి ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు అంటున్నాయి. అందుకే శిక్షతో పాటుగా జరిమానాను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News