Friday, November 22, 2024

హిట్ అండ్ రన్ కేసులో కొత్త చట్టం ఏం చెప్తోంది..?

- Advertisement -
- Advertisement -

ఐపిసి స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన భారతీయ న్యాయసంహిత ప్రకారం హిట్ అండ్ రన్, ర్యాష్ డ్రైవింగ్ అనేవి నిర్లక్షపూరిత డ్రైవింగ్ కిందికి వస్తాయి. ఇందులోని 104 సెక్షన్‌లో రెండు క్లాజ్‌లున్నాయి. నిర్లక్షంగా వాహనం నడిపి వ్యక్తి మరణానికి కారణమయితే గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష ఉంటుంది. దీంతో పాటుగా జరిమానా కూడా విధించే వీలు ఉందని మొదటి నిబంధనలో పేర్కొన్నారు. రెండో నిబంధనలో.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాలి.

అలా ఇవ్వకుండా అక్కడినుంచి పారిపోతే గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఐపిసిలో ఇవి సెక్షన్ 304ఎ కిందికి వస్తాయి. నిర్లక్షంగా వాహనం నడిపి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఐపిసి లో గరిష్ఠంగా రెండేళ్లవరకు మాత్రమే శిక్ష ఉంటుంది. హిట్ అండ్ రన్ కేసుల్లో పదేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానాపైనే ట్రక్కు డ్వైర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒక వేళ జైలుశిక్ష పడితే పదేళ్ల పాటు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా భారీ స్థాయిలో(7 లక్షల) జరిమానా చెల్లించడం కూడా సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నారు. చిన్న ప్రమాదాలు జరిగినా సరే జనం వాహన డ్రైవర్లపై దాడి చేసి తీవ్రంగా కొడుతుంటారని, ఈ కారణంగానే వారు ప్రాణ భయంతో వాహనాన్ని వదిలిపెట్టి పారిపోతుంటారని అంటున్నారు.ఈ కఠిన నిబంధన వల్ల కొత్త వాళ్లు ఈ వృత్తిని చేపట్టడానికి ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు అంటున్నాయి. అందుకే శిక్షతో పాటుగా జరిమానాను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News