నలుగురి మృతి.. ఇద్దరికి గాయాలు
ఢిల్లీలో దారుణ ఘటన
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తున్న వ్యక్తులపై ఒక ట్రక్కు దూసుకెళ్లడంతో నలుగురు వ్యక్తులు మరణించగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అర్ధరాత్రి 1.51 గంటలప్పుడు వేగంగా వచ్చిన ట్రక్కు నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన దృశ్యాలు సిసి టివిలో రికార్డయ్యాయి. డిటిసి డిపో సిగ్నల్‌ను దాటిన ట్రక్కు డిఎల్‌ఎఫ్ టి పాయింట్ వైపు వెళుతూ రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్రక్కు డ్రైవర్ అతి వేగంగా నిర్లక్షంగా వాహనాన్ని నడిపాడని పోలీసు డిప్యుటీ కమిషనర్(షాదారా) ఆర్ సత్యసుందరం తెలిపారు. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా గాయపడిన నలుగురు వ్యక్తులను జిటిబి ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు మార్గమధ్యంలోనే మరణించగా మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడని డిసిపి తెలిపారు. నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న దృశ్యాలు కూడా సిసి టివిలో రికార్డయ్యాయి. మృతులను న్యూ సీమాపురికి చెందిన కరీం(52), చోటే ఖాన్(25), షా ఆలం(38), యుపిలోని సహీబాబాద్ షాలిమార్ గార్డెన్‌కు చెందిన రాహుల్(45)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.