Sunday, December 22, 2024

ఇండియాతో కెనడా ట్రూడో ఢీ..

- Advertisement -
- Advertisement -

టొరంటో : భారతదేశాన్ని దౌత్యపరమైన అంతర్జాతీయ విషయాలపై పూర్తి స్థాయిలో ఇరకాటంలోకి నెట్టేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పలు విధాలుగా పావులు కదిపారు. భారతదేశంలోని తమ దౌత్యవేత్తలకు రక్షణ కల్పించలేకపోవడం అత్యంత కీలక విషయం అని, అంతర్జాతీయ సమాజం దీనిని గుర్తించి తగు విధంగా స్పందించాల్సి ఉందని ట్రూడో శనివారం స్పందించారు. దౌత్యవేత్తలకు రక్షణ భద్రతను కల్పించలేమని, అత్యధిక సంఖ్యలో ఉన్న దౌత్యవేత్తలను వెనకకు తీసుకువెళ్లాలని భారతదేశం ఈ నెలలో కెనడాకు తెలిపింది. దీనికి ప్రతిగా ఇందుకు అనుగుణంగానే కెనడా స్పందిస్తూ భారతదేశాన్ని అంతర్జాతీయంగా చిక్కుల్లోకి నెట్టేందుకు కెనడా ప్రధాని రంగం సిద్ధం చేశారు. భారతదేశంలోని తమ దేశపు 41 మంది దౌత్యవేత్తలను వెంటనే ఇండియా నుంచి వారి కుటుంబాలు సహా వెనకకు తీసుకువస్తున్నట్లు తెలిపారు.

మరో వైపు భారతదేశంలోని కెనెడియన్లపై దాడులు జరుగుతాయనివారు జాగ్రత్తగా ఉండాలని అడ్వయిజరీలు కూడా వెలువరించేలా చేశారు. దౌత్యవేత్తల విషయంలో ఇండియా వ్యవహారశైలి దారుణంగా ఉందని, అంతర్జాతీయ కట్టుబాట్ల వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ట్రూడో పేర్కొన్నారు. కెనడా దౌత్యవేత్తలు భారత్ వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారనే అసత్యాలు ప్రచారం చేయడం తగదని ట్రూడో ఎదురుదాడికి దిగారు. ఇప్పుడు భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చివరికి ఇటు కెనడాలోని భారతీయులకు, అటు భారత్‌లోని కెనెడియన్ల భవితను, భద్రతను గందరగోళంలోకి నెడుతుందని ట్రూడో వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి కెనడాలో ఇప్పుడు వివిధ స్థాయిల్లో పనిచేసే లక్షలాది మంది భారతీయుల పరిస్థితి డోలాయామానం అవుతుందనే సంకేతాలు వెలువరించారు.

కెనడాకు వంతగా అమెరికా బ్రిటన్‌లు
ఇండియా పద్ధతులు పాటించడం లేదని విమర్శలు
ప్రస్తుత దశలో దౌత్యసిబ్బంది వ్యవహారంలో అమెరికా, బ్రిటన్‌లు కెనడాకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాయి. దౌత్యవేత్తలను వెనకకు పంపించే స్థితిని కల్పించడం భారత్‌కు తగదని , ఇది వియన్నా కట్టుబాట్లకు విఘాతం అని అమెరికా, బ్రిటన్‌లు వేర్వేరుగా అధికారికంగా స్పందించాయి. దౌత్యనీతిని రివాజును ఎందుకు దెబ్బతీస్తున్నారని భారత్‌ను ఈ రెండు దేశాలు ప్రశ్నించాయి. జస్టిన్ ట్రూడోకు మద్దతు ప్రకటించాయి. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ఇది గడ్డు పరిస్థితిని తీసుకువచ్చింది. ఇతరత్రా వివాదాలు ఉంటాయి. సంక్లిష్టతలు ఏర్పడుతాయి. ఇరుదేశాల నడుమ తలెత్తే సంక్షోభాల పరిష్కారానికి తగు విధంగా సమాచార వినిమయానికి దౌత్యవేత్తల అవసరం ఎంతైనా ఉంటుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. భారత ప్రభుత్వ చర్యలు దౌత్యసిబ్బంది ఉపసంహరణకు దారితీశాయని రిషి సునాక్ సారధ్యపు ప్రభుత్వం పేర్కొంది. ఇతర విషయాల జోలికి తాము వెళ్లడం లేదని, అయితే దౌత్య నీతి కీలకం అని భారత్‌కు బ్రిటన్ క్లాసు తీసుకునే పరిస్థితి ఏర్పడింది.

1961 నాటి వియన్నా కన్వెషన్‌ను అంతా గౌరవించాల్సిందేనని , ఇందులో భాగంగా ఏ దేశం అయినా ఇతర దేశాల దౌత్యవేత్తలకు తగు విధంగా భద్రతను కల్పించాల్సి ఉంటుంది. ఇది అంతర్జాతీయ కట్టుబాటు. దీనిని భారతదేశం గౌరవించాల్సి ఉంటుందని బ్రిటన్ హితవు పలికింది. ఇరుదేశాల నడుమ దౌత్యసంబంధాలు బెడిసికొట్టకుండా చూడాల్సి ఉందని చెప్పిన అమెరికా ఈ విషయంలో భారతదేశం బాధ్యత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అయితే భారతదేశంలో ఉంటూ వచ్చిన అత్యధిక కెనడియన్ దౌత్యవేత్తలు తమ విధుల కన్నా భారత్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ఎక్కువైందని , దీనిని గుర్తించే తాము చర్యలకు దిగామని తెలిపిన భారతదేశ వాదనను కెనడా భారత్‌లు రెండూ తమ సమాన మిత్రపక్షాలే అని చెపుతోన్న అమెరికా ఈ విషయంలో పట్టించుకోవడం లేదని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News