Tuesday, March 4, 2025

అక్రమ వలసలపై ఏదీ సక్రమ విధానం?

- Advertisement -
- Advertisement -

‘అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. దేశంలో చట్టవిరుద్ధంగా ఆశ్రయం పొందుతున్న తమ పౌరులను వెనక్కు పిలిపించుకునేందుకు ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి’ అంటూ శ్వేతసౌధం తాజాగా చేసిన ప్రకటన ఆహ్వానించదగినదే. ఏ దేశానికైనా అక్రమ వలసదారులు గుదిబండలా మారతారనేది నిర్వివాదాంశం. అయితే వారిని వెనక్కు పంపేందుకు విధివిధానాలంటూ ఉండాలి. లేనిపక్షంలో విమర్శలకూ, వివాదాలకూ దారితీస్తుంది. ఇప్పుడు అగ్రరాజ్యం విషయంలో జరుగుతున్నదదే. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశంగా చెప్పుకునే అమెరికా అక్రమ వలసదారుల విషయంలో అనుసరిస్తున్న వైఖరిని గమనించి, ప్రజాస్వామికవాదులు ముక్కున వేలేసుకుంటున్నారు. లేడికి లేచిందే పరుగన్నట్లు డొనాల్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వారం రోజులైందో లేదో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టారు. తమ దేశంలో తిష్ఠ వేసుకుకూర్చున్న వేలాదిమంది విదేశీయుల్ని ఉన్నపళంగా, కట్టుబట్టలతో వెనక్కు పంపుతున్నారు.

తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపుతానంటూ ట్రంప్ మొదటినుంచీ చెబుతూనే ఉన్నారు. వలస విధానాన్ని మార్చేస్తాననీ, ప్రపంచంలోనే అత్యంత భారీ డిపోర్టేషన్ చేపడతాననీ హెచ్చరించారు కూడా. ఇప్పుడు అన్నంతపనీ చేస్తున్నారు. అమెరికాను స్వర్గధామంగా భావిస్తూ, అక్కడ ఉద్యోగావకాశాలు సంపాదించి, గ్రీన్ కార్డు సాధించి, అక్కడే స్థిరపడిపోవాలనేది అనేకమంది కల. వీలైతే సక్రమ మార్గంలో, లేనిపక్షంలో అక్రమంగా ఆ దేశంలోకి చొరబడేవారు ఏటా వేల సంఖ్యలోనే ఉంటారు. అక్రమంగా వలస వచ్చినవారు పిల్లల్ని కని, వారికి అమెరికా పౌరసత్వం లభిస్తే చాలనుకుంటారు. ఇప్పుడు ఇదే ట్రంప్ ఆగ్రహానికి కారణమవుతోంది. అక్రమంగా తమ దేశంలోకి చొరబడి, తమ దేశీయుల ఉపాధి అవకాశాలను కొల్లగొట్టడమే కాకుండా, నేరాలకు ఘోరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు పెను సవాలుగా పరిణమిస్తున్నారన్న ట్రంప్ వాదన కాదనలేని సత్యం.

దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారితోపాటు దొంగతనాలకు, హింసకు పాల్పడేవారిని నిర్బంధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలో ట్రంప్ తన కత్తికి పదును పెట్టారు. ఆయన ఆదేశాల మేరకు రోజుకు రెండువందల మందికి పైగా అక్రమ వలసదారుల్ని గుర్తించి, వారిని వెనక్కి పంపే బృహత్ కార్యాన్ని ఇమిగ్రేషన్ అధికారులు నెత్తికి ఎత్తుకున్నారు. కొలంబియా, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కు పంపిస్తున్నారు. బ్రెజిల్ వలసదారుల్ని కనీస సౌకర్యాలు సైతం లేని విమానంలో చేతులకు బేడీలు వేసి పంపిన వైనం వివాదాస్పదమైంది. ఇది మానవహక్కుల ఉల్లంఘనేనంటూ బ్రెజిల్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి ఆందోళనలను, నిరసనలను ట్రంప్ లెక్కచేయడం సరికదా, అలాంటి దేశాలను నయానో భయానో బెదిరించి మరీ దారికి తెచ్చుకుంటున్నారు. తమ దేశానికి వలసదారుల్ని తీసుకొచ్చే అమెరికా విమానాలను అంగీకరించబోమంటూ ప్రతిఘటించిన కొలంబియాపై భారియెత్తున సుంకాలు విధిస్తామని హెచ్చరించడం ద్వారా డోనాల్డ్ ట్రంప్ ఆ దేశం మెడలు వంచగలిగారు.

అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు కంకణం కట్టుకున్న ట్రంప్, ఇందులో భాగంగా తాను అధ్యక్షుడైన తొలి రోజునే జన్మతః పౌరసత్వంపై వేటు వేశారు. పనిలోపనిగా అక్రమ వలసల బెడద ఎక్కువగా ఉన్న మెక్సికో సరిహద్దుల వద్ద జాతీయ అత్యయిక పరిస్థితిని విధించి, వలసల నిరోధానికి పదివేల మంది సైనికులను మోహరించాలని నిర్ణయించారు. అక్రమ వలసల పట్ల డెమోక్రాట్ల ఉదాసీన వైఖరిని ఎండగట్టడం ద్వారా ఎన్నికల్లో ఆయన ఎంతో లబ్ధి పొందారు. అంతమాత్రాన డెమోక్రాట్లు అక్రమ వలసలకు సానుకూలమని అనుకోవడానికి లేదు. దేశ వలస విధానాన్ని సంస్కరించాలని, అందుకు చట్టాల్లో మార్పు అవసరమన్నది వారి అభిప్రాయం.

అక్రమ వలసల మాటున నేరగాళ్ల ముఠాలు అమెరికాలో తలదాచుకుంటున్నాయన్నది ట్రంప్ వాదన. వారిలో ఉగ్రవాదులు కూడా ఉన్నారని, వారివల్ల దేశభద్రతకు ముప్పు పొంచి ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో వాస్తవం లేకపోలేదు. అమెరికాలో సగటున ఇంటికొకరు ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా ఉంటున్నట్లు అంచనా. దేశ జనాభాలో ఐదు శాతం మంది అక్రమ వలసదారులేనని ఓ సర్వేలో తేలింది కూడా. ఇలా దేశంలో సుమారు 11 లక్షల మంది అక్రమంగా చొరబడి, తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివారిని వెనక్కు పంపడంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. అయితే వలసల నిరోధానికి ఆయన చేపడుతున్న విధానమే ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆగ్రహానికి కారణమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News