Wednesday, January 22, 2025

అగ్రరాజ్యంలో వయోవృద్ధుల సమరం

- Advertisement -
- Advertisement -

మరో నాలుగు నెలల్లో- నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎన్నడూ లేనంత ఆసక్తిని, ఉత్కంఠనూ కలిగిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం రెండు వృద్ధ సింహాలు ఎన్నికల గోదాలో తలపడుతూ ఉండటమే. వారిలో ఒకరు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (81) కాగా, మరొకరు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (78).

అమెరికా చరిత్రలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన అత్యంత పెద్ద వయస్కుడిగా బైడెన్ ఇప్పటికే రికార్డు సృష్టించారు. తాజా ఎన్నికల్లో అభ్యర్థుల ముదిమి వయసే వివాదంగా మారడం విచిత్రమైన పరిణామం. వాస్తవానికి ఇద్దరి మధ్య వయసు తేడా మూడేళ్లే అయినా వయసు రీత్యా జో బైడెన్ వైఖరిలో వచ్చిన మార్పు చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా బైడెన్ మాటల్లో తడబాటు కనిపిస్తోందని, మతిమరుపు ఎక్కువైందని వార్తలు వస్తున్నప్పటికీ డెమోక్రటిక్ పార్టీ మరోసారి ఆయననే బరిలోకి దింపడం ఒక విధంగా ట్రంప్‌కు కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ విషయం గత నెల 27న అట్లాంటాలో జరిగిన ముఖాముఖీ చర్చలో బయటపడింది.

దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం, గర్భవిచ్ఛిత్తి, ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలపై జరిగిన ఈ వాడీవేడి చర్చలో బైడెన్ పలు సందర్భాల్లో తడబడటం, మాటల కోసం వెదుక్కోవడం, అప్పుడప్పుడు మాట్లాడకుండా ఆగిపోవడం వంటివి ప్రేక్షకులను విస్మయానికి గురి చేశాయి. అమెరికాలో అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే ముఖాముఖీ చర్చలు వారి గెలుపోటములను నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కేవలం అభ్యర్థుల మాటలు, వారి ఆలోచనా విధానాలే కాకుండా హావభావాలను, మాట్లాడే పద్ధతిని కూడా ఓటర్లు ఎంతో నిశితంగా పరిశీలిస్తారు. ఇంతటి కీలకమైన చర్చలో బైడెన్ వెనుకబాటును డెమోక్రాటిక్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘ది న్యూయార్క్ టైమ్స్’, ‘ది అట్లాంటిక్’ వంటి పత్రికలు కూడా వయసురీత్యా బైడెన్‌లో వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ, ఆయన తప్పుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే బైడెన్ మాత్రం కిందపడ్డా తనదే పైచేయి అంటున్నారు.

వయసురీత్యా తనలో వచ్చిన మార్పులను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తూ, నిజం ఎలా చెప్పాలో ప్రత్యర్థి కంటే తనకే బాగా తెలుసునంటున్నారాయన. పైగా ట్రంప్ తనకంటే మూడేళ్లే చిన్నవాడంటూ తన వయోభారాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బైడెన్ రోజుకు ఆరు గంటలకు మించి పనిచేయలేకపోతున్నారని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో డెమోక్రాటిక్ పార్టీ నేతల పరిస్థితి కుడితిలో పడిన ఎలుక చందంగా మారింది. నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నవేళ అభ్యర్థిని మారిస్తే విజయావకాశాలు మరింత అడుగంటుతాయన్న భయంవారిని వెంటాడుతోంది. పైగా బైడెన్ స్వయంగా తప్పుకుంటే తప్ప, అభ్యర్థిని మార్చడం అంత సులువు కాదు. ఇందుకోసం పార్టీ నిబంధనలను మార్చాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేది ఎవరైనా తమ దేశానికి మాత్రమే పరిమితం కారు. ప్రపంచ దేశాలపై పరోక్షంగా పెద్దన్న పెత్తనం ఆ దేశానిదేనన్నది జగమెరిగిన సత్యం.

ఈ నేపథ్యంలో వయోభారంతో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే అగ్రరాజ్యం అభివృద్ధి కుంటుబడటమే కాకుండా, ప్రపంచ దేశాలలో అమెరికా ప్రాభవం సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. పోనీ ట్రంప్ గెలిచినా పెద్దగా ఒరిగేది ఏమైనా ఉందా అంటే అనుమానమే. 2017లో గెలిచిన ట్రంప్ అనేక అంశాలలో వివాదాస్పదుడిగా ముద్రపడ్డారు. పోర్న్‌స్టార్‌తో సంబంధం, ఆర్థిక లావాదేవీలలో అవకతవకలపై ఇప్పటికీ నడుస్తున్న కేసులు ట్రంప్ ప్రతిష్ఠను మసకబార్చాయి. గత ఎన్నికలలో ట్రంప్ ఓడిపోయాక ఆయన అనుచరులు క్యాపిటల్ హిల్‌పై జరిపిన దాడి అమెరికా ప్రజల దృష్టి పథం నుంచి ఇంకా కనుమరుగు కాలేదు. ఈ నేపథ్యంలో అమెరికన్లు ఎవరిని ఎన్నుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ఆగస్టులో షికాగోలో జరగబోయే డెమోక్రాట్ల సమావేశం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసేందుకు జరిగే ఈ సమావేశంలో బైడెన్ తనంతట తానుగా తప్పుకుని, మరొకరికి అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. అలా జరిగినా, ఈ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం కాబోదు. ఎవరి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా, ఇకపై ప్రభుత్వాన్ని ముందుకు నడిపించవలసిన నేతలకు వయో పరిమితిని విధించే విషయమై చట్టసభల సభ్యులు నిర్ణయం తీసుకోవాలి. లేదా సీనియర్ రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ చెప్పినట్లు ఎన్నికలలో గెలిచిన 75 ఏళ్లు పైబడినవారి మానసిక స్థితిని పరీక్షించే విధానం రావాలి. అప్పుడే సగటు ఓటరు కుదుటపడేది.. అగ్రరాజ్యం గాడిన పడేది!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News