Saturday, April 12, 2025

ఫార్మాను కరుణించిన ట్రంప్

- Advertisement -
- Advertisement -

ఊపిరి పీల్చుకున్న ఫార్మా సెక్టార్
సెమీ కండక్టర్, ఎనర్జీపైనా ట్రంప్
ప్రతీకార సుంకాల ప్రభావం లేదు
టారిఫ్ ప్రభావంపై వాణిజ్య వర్గాలతో
సమాలోచనలు జరుపనున్న ప్రభుత్వం

న్యూయార్క్/వాషింగ్టన్/న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల (రెసిప్రోకల్ టారిఫ్) బాంబ్ పేల్చారు. భారత్‌తో సహా 60 దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. భారతదేశంపై 26 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత ప్రధాని నరేం ద్ర మోడీ మంచి స్నేహితుడు, కానీ న్యూఢిల్లీ అమెరికాపై అత్యధిక సుంకాలు విధిస్తోంది. అమెరికాపై ఇండియా 52 శాతం వరకు సుంకాలు విధిస్తోంది, ఈ కారణంగానే యుఎస్ 26 శాతం సుంకాలను ప్రకటించిందని ట్రంప్ అన్నారు. న్యూఢిల్లీ అమెరికాపై కఠినంగా ఉందని, అత్యధిక సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు. ఇతర దేశాలు యుఎస్ నుండి వసూలు చేస్తున్న సుంకంలో దాదాపు సగమే అమెరికా వసూలు చేస్తోందన్నారు. అందువల్ల సుంకాలు సంపూర్ణంగా పరస్పరం ఉండవు, అలా చేయగలను, కానీ చాలా దేశాలకు అది కష్టం అవుతుందని చేయడం లేదని ట్రంప్ అన్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్‌లో అనేక రంగాలపై తీవ్ర ప్రభావం ఏర్పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఐటి స్టాక్స్ 9 శాతం పతనం
ట్రంప్ సుంకాలను ప్రకటించిన తర్వాత గురువారం స్టాక్‌మార్కెట్లో ఐటి స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. ముఖ్యం గా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టిసిఎస్ వంటి దిగ్గజ షేర్లు దాదాపు 9 శాతం నష్టపోయాయి. ట్రంప్ చర్యలు భారత్‌పై ప్రభావం చూపనుందనే కారణమే ఐటి స్టాక్స్‌ను దెబ్బతీసింది. కానీ ఐటి సెక్టార్ గురించి ట్రంప్ సుంకాల్లో ప్రత్యేకంగా పేర్కొనలేదు.
ఫార్మా, సెమీకండక్టర్, ఎనర్జీపై నో ఎఫెక్ట్: జిటిఆర్‌ఐ
ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్, కాపర్, వంటి నిత్యావసర, వ్యూహాత్మక వస్తువులు, ఇంకా చమురు, గ్యాస్, బొగ్గు, ఎల్‌ఎన్‌జి వంటి ఎనర్జీ ఉత్పత్తులు అమెరికా విధించిన 26 శాతం దిగుమతి సుంకం నుంచి మినహాయించినట్టు థింక్ ట్యాంక్ జిటిఆర్‌ఐ తెలిపింది. జిటిఆర్‌ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్) ప్రకారం, అమెరికా రక్షణాత్మక సుంకాలు భారత్‌కు ఉత్ప్రేరకంగా మారే చర్య అని, దీని వల్ల భారత్ ప్రపంచ సరఫరా గొలుసు పునర్‌వ్యవస్తీకరణకు దారి తీస్తుందని అన్నారు. ఈ పరిస్థితులను పరిష్కరించినట్లయితే, వచ్చే సంవత్సరాల్లో భారతదేశం కీలక గ్లోబల్ తయారీ, ఎగుమతి హబ్‌గా స్థానం మెరుగుపర్చుకుంటుందని జిటిఆర్‌ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాత్సవ అన్నారు. ఇతర దేశాలపై అమెరికా భారీ పన్నుల వల్ల భారత్ ఎగుమతులు మరింత మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

టారిఫ్‌లతో ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధం ముప్పు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకా లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికే హెచ్చరిక అని, ఇది విస్తృత స్థాయిలో వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చైనా, యురోపియన్ యూనియన్ వంటి దేశాలపై పెద్ద మొత్తం లో సుంకాలు విధించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికే ప్రమాదం అనే భావన వినిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News