Sunday, January 19, 2025

వాషింగ్టన్ చేరుకున్న ట్రంప్

- Advertisement -
- Advertisement -

అధ్యక్షుడుగా నేడు ప్రమాణ స్వీకారం
నాలుగేళ్ల తరువాత తిరిగి అధ్యక్ష పీఠంపైకి

వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ యుఎస్ అధ్యక్షుడుగా తన రెండవ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందుగా తన కుటుంబం, మద్దతుదారులు, రాజకీయ మిత్రులతో కలసి వేడుక చేసుకునేందుకు శనివారం సాయంత్రం వాషింగ్టన్‌కు చేరుకున్నారు. క్యాపిటోల్‌పై తన మద్దతుదారుల దాడి నీడన నగరంలో నుంచి నిష్క్రమించిన నాలుగు సంవత్సరాల తరువాత రిపబ్లికన్ అధినేతగా విజయవంతంగా ట్రంప్ అడుగు పెట్టారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తున్న సందర్భంగా వాషింగ్టన్‌కు వెలుపల దాదాపు 30 మైళ్ల దూరంలోని వర్జీనియా స్టెర్లింగ్‌లో ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో శనివారం సాయంత్రం బాణసంచా ప్రదర్శన జరిగింది. వణికించే ఉష్ణోగ్రతలు ఉంటాయనే వాతావరణ సూచనల కారణంగా యుఎస్ క్యాపిటోల్ మెట్లపై సాంప్రదాయకంగా జరిగే అధ్యక్ష, ఉపాధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవంతో సహా బాహ్య కార్యక్రమాలు చాలావాటిని ప్రాంగణం లోపల నిర్వహించేందుకు సోమవారంనాటి ప్రమాణ స్వీకారోత్సవ నిర్వాహకులు ప్రయత్నాలు సాగిస్తుండగా ట్రంప్ వాషింగ్టలోకి ప్రవేశించారు.

1985లో అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ తన రెండవ విడత ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆ వేడుకను యుఎస్ క్యాపిటోల్ లోపలికి మార్చడం మొదటిసారి. ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్, కుమారుడు బారన్‌తో కలసి ఫ్లోరిడా వెస్ట్ పామ్ నుంచి ‘స్పెషల్ ఎయిర్ మిషన్ 47’గా పేర్కొన్న యుఎస్ మిలిటరీ సి32 విమానంలో బయలుదేరారు. ట్రంప్ సోమవారం యుఎస్‌కు 47వ అధ్యక్షుడు కానుండడానికి సూచికగా ఆ విమానానికి ఆ పేరు పెట్టారు. అధికారం నుంచి నిష్క్రమిస్తున్న ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి సాంప్రదాయకంగా కల్పించిన గౌరవం అది. 2021లో తన ప్రమాణ స్వీకారానికి ముందు అధ్యక్షుడు జో బైడెన్‌కు ట్రంప్ ప్రభుత్వ విమానాన్ని సమకూర్చలేదు.

డెమోక్రాట్ బైడెణ్ ఒక ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో వాషింగ్టన్‌కు చేరుకున్నారు. ‘మేము సరైన నిర్ణయం తీసుకున్నామనే నా భావన. ఇప్పుడు మేము ఎంతో సౌకర్యంగా ఉంటాం’అని ట్రంప్ శనివారం ఒక ఫోన్ ఇంటర్వూలో ‘ఎన్‌బిసి న్యూస్’తో చెప్పారు. వైట్ హౌస్‌కు దారి తీసే పెన్సిల్వేనియా అవెన్యూలో ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు ఏర్పాటు చేసిన లోహపు కుర్చీలను సిబ్బంది తొలగించసాగారు. కాగా, ట్రంప్ వాషింగ్టన్‌కు చేరుకోక ముందే నిరసనకారుల బృందాలు ఉదయమే ఆ వీధిలోకి చేరుకోసాగారు. వాషింగ్టన్ వాసి మెలోడీ హమౌద్ 2017లో ట్రంప్ తొలి ప్రమాణ స్వీకారం పట్ల నిరసనగా సాగించిన పాదయాత్రలో వాడిన గులాబీ టోపీని ధరించారు. ‘ఇంటిలో కూర్చుని టివి ముందు చిరాకు ప్రదర్శించాలని నేను కోరుకోలేదు,. నాకు ఇంకా శక్తి ఉందని, అదే భావనతో ఉన్న ఇతరులతో కలసి సాగాలని కోరుకుంటున్నాను’ అని ఆమె చెప్పింది. అధ్యక్షుని ప్రమాణస్వీకారోత్సవం కోసం ఇదాహో పొకాటెల్లో నుంచి విమానంలో మిత్రులతో టిమోతి వాలిస్ (58) వచ్చారు. ఆరు బయట ఉత్సవం వీక్షణకు ఆ బృందం వద్ద టిక్కెట్లు ఉన్నాయి. ఇన్‌డోర్ కార్యక్రమాలు వేటికీ వారు టిక్కెట్లు సంపాదించలేకపోయారు. ప్లాన్ల మార్పు గురించి వాలిస్ మాట్లాడుతూ ‘మాకు విమానంలో ఆ విషయం తెలిసింది’ అని చెప్పారు. ఆ మార్పు తనను నిరాశ పరచిందని వాలిస్ తెలిపారు.

ప్రత్యేక అతిథులుగా ముఖేష్ అంబానీ దంపతులు

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రెండవ ప్రమాణ స్వీకారోత్సవానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఆయన భార్య నీతా హాజరు కానున్నారు. అమెరికాలోని అత్యంత పలుకుబడిగల బిలియనీర్లు, రాజకీయ నాయకులు కొందరు, విదేశీ అధినేతలు, ప్రముఖుల కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావచ్చు. శనివారం వాషింగ్టన్‌కు చేరుకున్న అంబానీలు ఆ సాయంత్రం సన్నిహిత ‘క్యాండిల్ లైట్ డిన్నర్’కు హాజరైన ప్రత్యేక అతిథులు 100 మందిలో ఉన్నారని దాని గురించి తెలిసిన ప్రతినిధులు తెలిపారు. డిన్నర్‌కు హాజరైన భారతీయులు బహుశా వారిద్దరే కావచ్చు. ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన జెడి వాన్స్, ఉషా వాన్స్ కూడా వారిని కలుసుకున్నారు.

ట్రంప్ కుటుంబం వ్యక్తిగత ఆహ్వానితులుగా ఆ దంపతులు సోమవారం అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని ఆ ప్రతినిధులు తెలిపారు. అంబానీలకు ట్రంప్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ 2017లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ కోసం హైదరాబాద్‌ను సందర్శించినప్పుడు ముఖేష్ అంబానీ కూడా అక్కడ ఉన్నారు. ఆమె అప్పట్లో అధ్యక్షుడు ట్రంప్‌కు సలహాదారు. ట్రంప్ యుఎస్ అధ్యక్షునిగా 2020 ఫిబ్రవరిలో భారత్‌ను సందర్శించినప్పుడు కూడా ముఖేష్ అంబానీ హాజరయ్యారు. నిరుడు మార్చిలో గుజరాత్ జామ్‌నగర్‌లో అంబానీ చిన్న కుమారుడు అనంత్ వివాహానికి ముందు మూడు రోజుల పాటు సాగిన వేడుకలకు హాజరైన ప్రముఖుల్లో ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లా రోజ్ కూడా ఉన్నారు.

ఇది ఇలా ఉండగా, ట్రంప్ రెండవ ప్రమాణ స్వీకారోత్సవానికి అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, జార్జి డబ్లు బుష్, బిల్ క్లింటన్ కూడా హాజరు కావచ్చునని అనుకుంటున్నారు. ప్రపంచంలో ముగ్గురు అత్యంత సంపన్నులు టెక్ వాణిజ్యవేత్త, ట్రంప్‌నకు గట్టి మద్దతుదారు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఏపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్, ఫేస్‌బుక్ మాతృసంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బెర్గ్ కూడా హాజరు కానున్నారు. ఆ కార్యక్రమానికి హాజరు కావచ్చునని భావిస్తున్న టెక్ దిగ్గజాల్లో ఓపెన్ ఎఐ సిఇఒ శామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్, ఉబెర్ సిఇఒ దారా ఖస్రోవ్ షాహి ఉన్నారు.

తొలి రోజు 100 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలకు అవకాశం

డొనాల్డ్ ట్రంప్ తన ప్రమాణ స్వీకారానంతరం సోమవారం మధ్యాహ్నం వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పుడు ఆయన ఓవల్ ఆఫీస్ డెస్క్‌పై సంతకం చేయవలసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు వందకు పైగా ఉంటాయి. ఏమాత్రం ఆలస్యంకాకుండా ఆయన రెందవ విడత అధికారం మొదలు కావడానికి ఆయన బృందం వాటిని సిద్ధం చేసింది. ఆ ఉత్తర్వులు ప్రధానంగా ఆయన ఎన్నికల వాగ్దానాల అమలుకు ఉద్దేశించినవి. తొలి రోజున రికార్డు స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు సంతకం చేయాలని తాను యోచిస్తున్నట్లు ‘ఎన్‌బిసి న్యూస్’ ఇంటర్వూలో ట్రంప్ చెప్పారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు వందకు పైగానే ఉంటాయా అన్న ప్రశ్నకు ‘కనీసం ఆ కేటగరీలోనే’ అని ట్రంప్ సమాధానం ఇచ్చారు.

ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు అధ్యక్షుడు ఏకపక్షంగా జారీ చేసే ఉత్తర్వు. చట్ట ప్రకారం దానిని పాటించవలసిందే. శాసనం వలె కాకుండా ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులకు కాంగ్రెషనల్ ఆమోదం అవసరం లేదు. వాటిని కాంగ్రెస్ తోసిరాజనలేకపోయినా చట్టబద్ధమైన కోర్టులో వాటిని సవాల్ చేయవచ్చు. దక్షిణ సరిహద్దును సీల్ చేయడం, అక్రమంగా వలసవచ్చిన వారిని సామూహికంగా పంపివేయడం, మహిళల క్రీడల్లో నుంచి ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను నిరోధించడం,ఇంధన అన్వేషణనపై ఆంక్షల తొలగింపు, ప్రభుత్వ సామర్థం మెరుగుదల అనే ఐదు అంశాలపై ఆ ఉత్తర్వులు ప్రధానంగా ఉంటాయని ట్రంప్ సన్నిహిత అనుచరుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్ ఒక వార్తా చానెల్‌కు సూచించారు. నాలుగు సంవత్సరాల క్రితం జనవరి 6న యుఎస్ క్యాపిటోల్‌పై దాడిలో ప్రమేయానికి గాను భద్రత సంస్థలు అరెస్టు చేసిన తన మద్దతుదారులకు క్షమాభిక్ష ప్రసాదించడం కూడా వాటిలో ఒకటి కావచ్చు.

యుఎస్‌లో టిక్ టోక్ మూసివేత

పాప్యులర్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్ టోక్ యాప్‌పై నిషేధ చట్టం అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందుగా యుఎస్‌లో ఆ యాప్‌ను శనివారం మూసివేశారు. ‘టిక్ టోక్‌కు నిషేధిస్తున్న చట్టాన్ని యుఎస్‌లో చేశారు. దురదృష్టవశాత్తు మీరు ఇప్పుడు టిక్ టోక్‌ను వినియోగించుకోలేరు’ అని అమెరికన్ వినియోగదారుల ఆ యాప్‌ను తెరచినప్పుడు ఒక సందేశం కనిపించింది. ‘తాను పదవిని చేపట్టిన తరువాత టిక్ టోక్ పునరుద్ధరణకు ఒక పరిష్కారంపై మాతో యత్నం చేస్తానని అధ్యక్షుడు ట్రంప్ సూచించడం అదృష్టం. అందుకు సిద్ధంగా ఉండండి’ అని ఆ సందేశం పేర్కొన్నది. కాగా, టిక్ టోక్ మూసివేత బెదరింపును బైడెన్ ప్రభుత్వం ఒక ‘స్టంట్’గా తోసిపుచ్చి, నిషేధం అమలు బాధ్యతను ట్రంప్ ప్రభుత్వానికి బదలీ చేసింది. స్పష్టమైన హామీలు లేకుండా యుఎస్‌లో తమ సేవలు నిలిపివేయడం మినహా తమకు మార్గాంతరం లేదని టిక్ టోక్ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News